Telangana Unemployed Youth Protest: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగులు, విద్యార్థి, యువజన సంఘాలు ఉద్యమిస్తున్నాయి. ఎన్నికల్లో నిరుద్యోగుల విషయంలో ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు నెరవేర్చాలన్న డిమాండ్ నిరుద్యోగుల నుంచి వినిపిస్తోంది. దీనిపై నిన్న 'చలో సెక్రటేరియట్' కార్యక్రమానికి కొన్ని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ విషయంలో బీఆర్ఎస్, బీజేపీలు కూడా ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నాయి. రానున్న రోజుల్లో నిరుద్యోగుల డిమాండ్లు ప్రభుత్వానికి కంట్లో నలుసుగా మారే అవకాశం లేకపోలేదు.
నిరుద్యోగులకు కాంగ్రెస్ అభయహస్తం హామీలు
శాసనసభ ఎన్నికల సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ 'అభయహస్తం' పేరుతో రైతులు, మహిళలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, కార్మికులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు పలు హామీలు ఇచ్చింది. ఇది ప్రజలందరి ఆకాంక్షలకు సమగ్ర రూపంగా ఆ పార్టీ నేతలు అభివర్ణించారు. ఇందులో ప్రధానంగా యువతకు సంబంధించి ఆరు ప్రధాన హామీలను పొందుపరిచారు.
నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన ప్రధాన హామీలు ఇవే
-
2 లక్షల ఉద్యోగాల భర్తీ: తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో అభయహస్తం పేరుతో హామీ ఇచ్చింది.
-
నిరుద్యోగ భృతి: తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగం లేదా ఉపాధి కలిగే వరకు ప్రతి నెలా నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చింది.
-
జాబ్ క్యాలెండర్ విడుదల: ప్రతి సంవత్సరం ఉద్యోగ నియామక ప్రక్రియకు సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, ఏ సమయంలో ఏ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అవుతుందో అందులో పొందుపరుస్తామని ప్రకటించింది. ఆయా ఉద్యోగాలకు నిరుద్యోగులు గందరగోళం లేకుండా సన్నద్ధమయ్యేందుకు రోడ్ మ్యాప్ ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ పేర్కొంది.
-
మెగా డీఎస్సీ ప్రకటన: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి క్యాబినెట్ ఏర్పడిన తొలి సమావేశంలోనే మెగా డీఎస్సీ ప్రకటన చేస్తామని, 25 వేల పోస్టుల భర్తీకి మార్గం సుగమం అవుతుందని కాంగ్రెస్ నిరుద్యోగులకు హామీ ఇచ్చింది.
-
యూత్ కమిషన్ ఏర్పాటు: రాష్ట్రంలో విద్యా, ఉపాధి అవకాశాలు పెంచేందుకు యూత్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది. ఈ కమిషన్ ద్వారా యువతకు వడ్డీ లేకుండా పది లక్షల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది.
-
విద్యా భరోసా కార్డు: విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఇస్తామని, తద్వారా ఉన్నత విద్య చదువుకునే విద్యార్థులకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని తన ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.
నిరుద్యోగ హామీల అమలుకు కట్టుబడి ఉన్నామంటున్న అధికార కాంగ్రెస్
నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి సహా, అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఒక్క ఉద్యోగం తగ్గినా తాను బహిరంగ క్షమాపణకు సిద్ధమని ఎల్బీ స్టేడియంలో జరిగిన సభలో ప్రకటించారు. నిధుల సమస్య ఉన్నా హామీలన్నీ నెరవేరుస్తున్నట్లు మంత్రులు, తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. నిరుద్యోగ భృతి విషయంలో స్పందిస్తున్న హస్తం నేతలు రాజీవ్ యువవికాసం లాంటి పథకాలు, యువత నైపుణ్యం పెంచడం వంటివి ఇందులో భాగమని వాదిస్తున్నారు. నిరుద్యోగ భృతి అనేది కేవలం డబ్బు రూపంలో చూడవద్దని, ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెబుతున్నారు. రాజీవ్ యువ వికాసంలో స్వయం ఉపాధి కోసం మూడు లక్షల వరకు రుణాలు ఇస్తున్నట్లు చెబుతున్నారు. తాము హామీలు నెరవేరుస్తున్నప్పటికీ దీనిపై పార్టీలు రాజకీయం చేస్తున్నాయన్నది తెలంగాణ కాంగ్రెస్ నేతల వాదన.
హామీలను అమలు చేయాలని నిరసనకు దిగిన నిరుద్యోగులు
అయితే నిరుద్యోగ ఐకాసతోపాటు, ఆయా విద్యార్థి సంఘాల అభిప్రాయాలు మరోలా ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 19 నెలలు కావస్తున్నా, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వానికి నిరసన తెలిపేందుకు జులై 4, 2025న 'చలో సచివాలయం' కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఇందులో నిరుద్యోగ జేఏసీ, DYFI, BRSV, BRSY, PDSU వంటి సంఘాలు పాల్గొన్నాయి. అశోక్ నగర్, బషీర్ బాగ్ వంటి ప్రాంతాల్లో నిరుద్యోగులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు కలిసి సచివాలయం వైపు వస్తుండగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. జిల్లాల నుంచి వచ్చే నిరుద్యోగ యువతను అక్కడే అరెస్టు చేశారు. కొద్ది మంది నాయకులను గృహ నిర్బంధం చేశారు. అయితే ఈ క్రమంలో నిరుద్యోగులు ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ప్రతిపక్షాలు వీరి నిరసనలకు మద్దతు ఇస్తూ, అరెస్టులను తీవ్రంగా ఖండించాయి. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చి రెండేళ్లు దగ్గరపడుతున్నా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని బీఆర్ఎస్వీకి చెందిన వరంగల్ జిల్లా నేత రాకేశ్ చెబుతున్నారు. తాము నిరసన ద్వారా ప్రభుత్వ దృష్టికి తెద్దామనుకుంటే పోలీసులతో అరెస్టు చేసి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, ఇది ఎంతవరకు ప్రజాస్వామికమని ప్రశ్నిస్తున్నారు. ఈ నిరసనలో పాల్గొన్న పీడీఎస్ యూ విద్యార్థి సంఘం నాయకురాలు, "జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు, కానీ ఇప్పటి వరకు చేయలేదని, గొప్పగా ఎన్నికల ప్రణాళికలో చెప్పుకున్న నిరుద్యోగ భృతి ఇంకా ఎందుకు అమలు చేయలేదని" ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ హామీలు డ్రామాలో భాగమే
"ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల ముందు డ్రామాలు ఆడిందని, ఇప్పుడు నిరుద్యోగులను, విద్యార్థులను పట్టించుకోవడం లేదని" మరో విద్యార్థి నేత తుంగ బాలు తమ అభిప్రాయాన్ని ఏబీపీ దేశంతో పంచుకున్నారు. బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఫోన్ ద్వారా ఏబీపీ దేశంతో తన అభిప్రాయాలు పంచుకున్నారు. "కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలనే అమలు చేయమని అడుగుతున్నాం తప్ప, నిరుద్యోగులు కొత్తవి ఏమి అడగడం లేదు కదా" అని అన్నారు. "ఇంకా ఎంత సమయం తీసుకుంటారో అదైనా చెప్పాలి కదా" అని గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే వస్తున్నారని ఆయనకు ఈ విషయం తెలియాలనే విద్యార్థులు 'చలో సచివాలయం' కార్యక్రమానికి శాంతియుతంగా వస్తుంటే అడ్డుకోవడం సరి కాదని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
నిరుద్యోగ జేఏసీ నేత ప్రత్యూష, "మేం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తుంటే తమను బీజేపీ, బీఆర్ఎస్ నాయకులని ప్రభుత్వం బురద జల్లుతుందని" వాపోయారు. చిక్కడపల్లి లైబ్రరీలో చాలా మంది ఐదు రూపాయల భోజనం తింటూ గ్రూప్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారని, ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వలేదని ఏబీపీ దేశం ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ 2 లక్షల జాబ్ నోటిఫికేషన్ వెంటనే ఇస్తామని అన్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 19 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని ప్రత్యూష మండిపడ్డారు. ఇప్పటి వరకు ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లనే భర్తీ చేసిందే తప్ప కొత్త నోటిఫికేషన్లు ఏం ఇవ్వలేదని నిరుద్యోగ జేఏసీ అభిప్రాయపడుతోంది.