KTR Challenges To Revanth Reddy: ఎల్బీస్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సవాల్‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. ఎవరి హయాంలో రైతులకు మేలు జరిగిందో చర్చించేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా చర్చకు రెడీ అని ప్రకటించారు. అసెంబ్లీలోనైనా చర్చిద్దామని పిలుపునిచ్చారు. ఇంకా కావాలంటే సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో అయితే మరీ మంచిదన్నారు. ఈ ఉదయం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

రైతుల సంక్షేమంపై చర్చించేందుకు రేవంత్ రెడ్డికి 72 గంటల సమయం ఇచ్చారు కేటీఆర్. చేసినవాటిపై ప్రిపేర్ అయ్యేందుకు ఈ టైంలో ఇచ్చినట్టు పేర్కొన్నారు. "8వ తేదీ ఉదయానికి ప్రెస్‌క్లబ్‌లో ఉంటాను. రేవంత్ రెడ్డి ఒక్కడు వస్తారో, మంత్రివర్గాన్ని తీసుకొస్తోరో వాళ్ల ఇష్టం. కార్యకర్తలతో వచ్చినా రెడీ. రేవంత్ రెడ్డికి కుర్చీ వేసి పెడతాం. ఆయన కోసం ఎదురు చూస్తాం. అక్కడ కాదు అనుకుంటే రాష్ట్రంలో ఎక్కడైనా నేను చర్చకు సిద్ధమే. అసెంబ్లీలోనా, లేదా కొండారెడ్డి పల్లెలో, చింతమడకలో ఎక్కడైనా సిద్ధంగా ఉన్నాం." అని సవాల్ చేశారు. 

ప్లేస్, టైమ్, డేట్ అన్ని సీఎం ఇష్టం.. మేం ఎప్పుడైనా సిద్ధమే అంటున్నారు కేటీఆర్. బేసిన్‌కు, బేసిక్‌కు తేడా తెలియని వ్యక్తి రేవంత్ రెడ్డి అని అలాంటి వ్యక్తి సీఎంగా ఉన్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రేవంత్‌కు కేసీఆర్ అవసరం లేదని తాము చాలంటూ చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాటం చేశామని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి, ఆయన సన్నిహితులకు నియామకాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

దేశంలో ఎవరూ రైతులకు చేయని విధంగా తెలంగాణలో రైతులకు కేసీఆర్ మేలు చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రపంచస్థాయిలో గుర్తింపు లభించిందని తెలిపారు. వాటి గురించి తెలంగాణలో ఏ చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారని అన్నారు. చేసింది చెప్పుకోలేని రేవంత్ రెడ్డి సభ పెట్టి బూతులు తిడుతూ ఛాలెంజ్‌లు విసురుతున్నారని మండిపడ్డారు. హామీలు అమలు చేయడం లేదని అడిగితే విమర్శలు చేసే రేవంత్ రెడ్డి... బనకచర్లతో గోదావరి తరలించుకుపోతున్నా గట్టిగా అగడం లేదని అన్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎరువుల కోసం రైతులు క్యూలో నిల్చుంటున్నారని తెలిపారు. ఈ ప్రబుత్వానికి ఎరువుల పంపిణీ కూడా చేతకావడం లేదని విమర్శించారు. 

"తెలంగాణలో రైతు బంధు విప్లవాత్మక స్కీం. రైతు బంధుపై ఆక్స్‌ఫర్డ్‌లో చెబితే ఆశ్చర్యపోయారు. అలాంటిది ఎరువులు కూడా ఇవ్వలేని ముఖ్యమంత్రి మమ్మల్ని విమర్శిస్తారా? ఇందిరమ్మ రాజ్యంలో చెరువులు ఎండిపోతే మేము కళకళలాడేలా చేశాం. చంద్రబాబు రైతులు గొంతు కోస్తున్నా జల దోపిడీని సీఎం రేవంత్‌ రెడ్డి అడ్డుకోలేకపోతున్నారు. ఫ్లోరైడ్‌ మహమ్మరిని కేసీఆర్‌ తరిమికొట్టలేదా? తెలంగాణ ఏర్పాటైన కొత్తలోనే రూ.30వేల కోట్ల రైతు రుణమాఫీ చేశాం. కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ రూపురేఖలు మార్చాం" అని కేటీఆర్‌ చెప్పుకొచ్చారు.