Telangana CM Revanth Reddy: తెలంగాణ (Telangana )ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల శంఖారావం పూరించారు. నాయకులంతా ప్రజల్లో ఉంటూ పార్టీ విజయం కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. కొత్త వాచ్చిన వారితో ఎలాంటి సమస్య ఉండని వచ్చే ఎన్నికల్లో సీట్లు పెరగబోతున్నాయని అందరికీ పదవులు వస్తాయని చెప్పుకొచ్చారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన సామాజిక న్యాయ సభలో కీలక వ్యాఖ్యలు చేసారు. 

ఎన్నో ఆశలతో కాంగ్రెస్‌కు ఓటు వేసిన ప్రజలకు మంచి చేయడమే ధ్యేయంగా పాలన సాగుతోందని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి కాంగ్రెస్ తప్పులు చేస్తే బద్నాం చేద్దామని చాలా మంది ఎదురు చూశారని అన్నారు. కానీ వారికి ఎక్కడా దొరక్కుండే ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని వివరించారు. ఉద్యోగాల కల్పనలో కూడా ఎవరూ చేయని  విధంగా చేశామని తెలిపారు. అన్నింటిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ శ్రేణులపై ఉందని తెలిపారు. 

'ఎవరికి ఎవరి భయం వద్దు అందరికీ న్యాయం' 

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగిరేలా అంతా ఏకతాటిపైకి వచ్చి పని చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పక్క పార్టీ నుంచి వచ్చిన నేతలు, ఇప్పటికే ఉన్న నేతలతో విభేదాలు వద్దని సూచించారు. వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు పెరుగుతున్నాయని చెప్పారు. ప్రజల్లో ఉండి కష్టపడిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా న్యాయం చేసే బాధ్యత తాను తీసుకుంటానని వివరించారు. విభేదాలు పక్కన పెట్టి పార్టీ విజయం కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. 

నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీ ఎదుగుదల కోసం పని చేసవారికి తప్పక గుర్తింపు ఉంటుందన్నారు రేవంత్ రెడ్డి. మహిళా రిజర్వేషన్ అమలు అవుతుందని వచ్చే ఎన్నికల్లో 50మందికిపైగా మహిళా నాయకులు అసెంబ్లీ అడుగు పెట్టబోతున్నారని అన్నారు. అందులో చాలా మంది మంత్రులు కూడా అవుతారని తెలిపారు. ఇప్పటి నుంచి ఆ దిశగా ఆలోచన చేసి ప్రజల్లో ఉంటూ పార్టీ విజయం కోసం పని చేయాలని సూచించారు. 

'ప్రత్యర్థుల విమర్శలు తిప్పికొట్టండి'

కాంగ్రెస్ పార్టీని పలచన చేయడానికి, ప్రజల్లో కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడానికి సోషల్ మీడియా వేదికగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు రేవంత్ రెడ్డి. వాళ్లెవరూ తెలంగాణలో కానీ దేశంలో ఉండటం లేదన్నారు. విదేశాల్లో ఉంటూ ఇక్కడి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారని తెలిపారు. వాటికి గట్టిగానే కౌంటర్ ఇవ్వాలని చెప్పారు. ప్రతి ఒక్క నాయకుడు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలని ప్రజల్లో తిరుగుతూ జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని అన్నారు. కాంగ్రెస్ శ్రేణుల దెబ్బకు కల్వకుంట గడీలు కుంటలు కుంటలు అయిపోవాలని పిలుపునిచ్చారు. 

'నిలబడ్డాం ప్రజలను నిలబెట్టాం'

కాంగ్రెస్‌కు అధికారం మూన్నాళ్ల ముచ్చటే అని ఎద్దేవా చేశారని, వారిలో వారు కొట్టుకొని ప్రభుత్వాన్ని పడగొట్టేస్తారని విశ్లేషణలు చేశారని రేవంత్ గుర్తు చేశారు. కానీ విజయవంతంగా ప్రజలకు మంచి పాలన అందిస్తున్నామని తెలిపారు. విఫలం అవుతామని ఎదురు చూసిన వాళ్లకు ఇది ఎదురుదెబ్బ అని అన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయలేమని కూడా సవాళ్లు చేశారని తెలిపారు. విజయవంతంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని వివరించారు. రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. వరి వేస్తే ఉరి వేసుకున్నట్టేనంటూ నాటి సీఎం ప్రకటించారని తాము మాత్రం ఎంత వరి వేస్తే అంత బోనస్ ఇస్తామనని చెప్పి రైతులను రాజులుగా చేశామన్నారు. మహిళలకు కూడా పథకాలు అందిస్తున్నామని తెలిపారు. వారికి పథకాలు అందించడమే కాకుండా వారిని వ్యాపారవేత్తలుగా కూడా మారుస్తున్నామని అన్నారు. అన్నింటినీ వారినే భాగస్వాములను చేస్తున్నట్టు వివరించారు. 

ఆనాడు ఇందిరమ్మ పేదలను దృష్టిలో ఉంచుకొని ఇళ్ళు, భూములు ఇచ్చిందని.. ప్రతి పేదవాని ఇంట్లో ఏదో రకంగా ఇందిరమ్మ పేరు వినిపిస్తూనే ఉందని తెలిపారు. అందుకే తాము ఎలాంటి పథకాలు మొదలు పెట్టినా ఇందిరమ్మ పేరు పెడతామని, పేదవాళ్ళ కడుపు నింపే అన్నపూర్ణ క్యాంటీన్లకు ఇందిరమ్మ పేరు పెడితే ప్రతిపక్షాలు నానా యాగీ చేస్తున్నాయని మండిపడ్డారు. ఇందిరమ్మ వలెనే, ఆడపడుచులను తాము గౌరవిస్తామని.. అన్ని పథకాలలో మహిళలకే పెద్ద పీట వేస్తామని అన్నారు. యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూనే వారిలో స్కిల్‌ను కూడా డెవలప్ చేస్తున్నట్టు వెల్లడించారు. దీని కోసం ప్రత్యేక యూనివర్శిటీ ఏర్పాటు చేశామన్నారు. 

'చర్చకు మోదీ, కేసీఆర్ ఎవరు వచ్చినా రెడీ'తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఢిల్లీ నుంచి మోదీ, రాష్ట్రం నుంచి కేసీఆర్‌ ఎవరైనా వస్తే చర్చకు సిద్ధమని అన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలను ఉన్నంత నిలిపేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని అన్నారు. నాడు ఇందిర ఆశయాలకు తగ్గుట్టుగానే సంక్షేమ ఫలాలు ప్రజలకు అందజేస్తున్నామని వివరించారు. నేడు ప్రతి రైతులు ఎంతోకొంత భూమి సాగు చేస్తున్నాడంటే నాడు ఇందిరా గాంధీ చేసిన సంస్కరణలే కారణమని అన్నారు. అందుకే అలాంటి ఇందిర పేరును ఐదు రూపాయల భోజన పథకానికి పెడితే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వారిని బట్టలు ఊడదీసి కొడితే ఇందిరమ్మ గొప్పతనం తెలుస్తుందని ఘాటుగా స్పందించారు. 

'2036 ఒలింపిక్స్‌లో తెలంగాణ నుంచి బంగారు పతకాలు' వంద కోట్లకుపైగా జనాభా ఉన్న దేశంలో ఒలింపిక్స్‌లో పథకాలు సాధించకపోవడంపై రేవంత్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల ముందు ఇదో చిన్నచూపుగా అభిప్రాయపడ్డారు. అందుకే తెలంగాణలో స్పోర్ట్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు రేవంత్ రెడ్డి. దీని కోసం స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేయబోతున్నట్టు వెల్లడించారు. అందులో శిక్షణ పొందేవాళ్లు 2036 ఒలింపిక్స్‌లో కచ్చితంగా బంగారు పతకాలు సాధిస్తారని చెప్పారు.