Telangana BJP President N Ramchander Rao: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్‌రామచందర్‌రావు పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం మీడిమాతో మాట్లాడారు. పార్టీలో విబేధాలపై మాట్లాడారు. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓపెన్ లెటర్ రాశారు. ఎన్నికల హామీల అమలుకు ఇంకా ఎన్ని రోజులు కావాలని నిలదీశారు. ఇప్పటికే ఆరు వందల రోజులు పూర్తి అయ్యాయని హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. 

చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా రామచందర్‌రావు పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయనతోపాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితోపాటు ఇతర సీనియర్ నేతలు ఉన్నారు. పార్టీలో ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అంతా ఒకటేనని చెప్పుకొచ్చారు. కష్టపడే వాళ్లకు గుర్తింపు ఉంటుదని చెప్పడానికి తనకు వచ్చిన పదవే ఎగ్జాంపుల్ అన్నారు. 

పార్టీకి రాజీనామా చేస్తున్న వారిపై స్పందించిన రామచందర్‌రావు... బీజేపీ విధానాలు నిర్ణయాలు నచ్చనివారు వెళ్లిపోవడం వల్ల జరిగే నష్టమేమీ లేదని అన్నారు. పార్టీలో పార్టీ పటిష్ఠానికి పనిచేసే వాళ్లకు కచ్చితంగా గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు. బీజేపీలో ఎలాంటి విభేదాలు లేవని అంతా కలిసికట్టుగానే ఉన్నామని తెలిపారు. 

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాక ప్రత్యర్థులపై నెపాన్ని నెట్టేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు రామచందర్‌రావు. అసెంబ్లీలో బీసీ బిల్లుకు తమ పార్టీ ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో రాజీనామా చేయించి బీసీని ఆ ఛైర్‌లో కూర్చోబెడితే తాను రాజీనామాకు సిద్ధమని రామచందర్‌రావు సవాల్ చేశారు. 

పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నికల హామీలపై నిలదీస్తూ లెట్ రాశారు. బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడం మానేసి ఎన్నికల హామీలపై ఫోకస్ చేయాలని హితవుపలికారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎన్నికల హామీలు అమలు చేస్తామని ప్రచారం చేసిన కాంగ్రెస్ ఇంత వరకు ఆ పని చేయలేదన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామనే హామీ సంగతేంటని ప్రశ్నించారు. 

కాంగ్రెస్‌ ప్రకటించిన 6 గ్యారంటీలను నమ్మి ఓటు వేశారని రామచందర్‌రావు అన్నారు. ఆరు గ్యారంటీలను వందల రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఆరు వందల రోజులైనా అమలు చేయలేదు ఎందుకని ప్రశ్నించారు. సంక్షేమ పథకాల పేరుతో ఊరూరా ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేదన్నారు. ఫ్రీ బస్ మినహా ఒక్కటంటే ఒక్క హామీ అమలు కాలేదని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామన్నారు రామచందర్‌రావు.