TSSPDCL JLM Exams: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(South Telangana Power Distribution Company)లో జూనియర్ లైన్ మెన్(JLM) పోస్టుల భర్తీకి జులై 17వ తేదీ 2022న పరీక్షలు నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ రాత పరీక్షలో విద్యుత్ సంస్థలకు చెందిన ఐదుగురు ఉద్యోగులు చేతివాటం చూపించారు. విషయం తెలుసుకున్నపై అధికారులు వారిని సస్పెండ్ చేశారు.


ఐదుగురు అధికారుల సస్పెన్షన్..! 


అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో పని చేస్తున్న మలక్ పేట్ ఏడీఈ(ADE) మహమ్మద్ ఫిరోజ్ ఖాన్, విద్యా నగర్ లైన్ మెన్ ను సపావత్ శ్రీనివాస్, రెతిబౌలి సెక్షన్ లో ప్రైవేట్ మీటర్ రీడర్ గా పని చేస్తున్న కేతావత్, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(North Telangana Power Distribution Company)లో పని చేస్తున్న జగిత్యాల సబ్ ఇంజినీర్ షేక్ సాజన్, తెలంగాణ ట్రాన్స్ కోలో పని చేస్తున్న మిర్యాలగూడ ఏడీఈ(ADE) మంగళగిరి సైదురు అనే వారిని విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు విద్యుత్ శాఖ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ జి. రఘుమా రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... పరీక్షలో మాల్ ప్రాక్టీస్ కు పాల్పడిన ఐదుగురు అధికారులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. 


అక్రమాలకు పాల్పడితే డిస్మిస్ చేస్తాం..!


అంతే కాకుండా వీరిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసినట్లు తెలిపారు. విద్యుత్ సంస్థలో పని చేసే ఉద్యోగులు ఎవరైనా భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన క్రమ శిక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు, ఉద్యోగంలో నుంచి తొలగిస్తామని రఘుమా రెడ్డి హెచ్చరించారు.  ఇంకెప్పుడూ ఎవరూ ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని హెచ్చరించారు. 


గత నాలుగేళ్లుగా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలు..


అలాగే జూనియర్ లైన్ మెన్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు అధికారులు నాలుగేళ్ల నుంచి దందా కొనసాగిస్తున్నారని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆధారాలు సేకరించారు. ఇద్దరు సహాయ డిప్యూటీ ఇంజినీర్లు, నలుగు సహాయ ఇంజినీర్లు తొమ్మిది మంది లైన్ మెన్లు అక్రమాలకు పాల్పడుతున్నారని తెలుసుకున్నారు. ఇందులో ఏడీఈ(ADE)ల్లో ఒకరు ఉమ్మడి నల్గొండ, మరొకరు హైదరాబాద్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. వీరు నాలుగేళ్ల క్రితం పలువురు అభ్యర్థుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారని


పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు..


వీరిందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. కోర్టుకు అప్పగించి జైలు శిక్ష అనుభవించేలా చేస్తామన్నారు. ప్రజలు కూడా డబ్బులు ఇస్తే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వాళ్లని నమ్మొద్దని.. అలాంటివి ఏమైనాతెలిస్తే.. వెంటనే పోలీసులకు సమాచారం అందిచాలని సూచించారు.