Girl Suicide: హైదరాబాద్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ ఆశ్రమంలో చిన్నారి ఆత్మహత్య చేసుకుంది. ఎవరూ లేని ఓ గదిలోకి వెళ్లిన పాప చున్నీతో ఉరి వేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే నిర్వాహకుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. పాప మృతికి ఆశ్రమ నిర్వాహకులే కారణం అంటూ మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 


అసలేం జరిగిందంటే..


హైదరాబాద్ శివార్లలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్పూర్తి పౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థలో ఉన్న 12 ఏళ్ల పావని.. ఆరో తరగతి చదువుతోంది. అయితే నిన్న సాయంత్రం ఎవరూ లేని గదిలోకి వెళ్లిన ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్వచ్చంధ సంస్థ నిర్వాహకుల సమాచారంతో దుండిగల్ పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


తండ్రి మరణంతో తల్లి కువైట్ కు...


ఆరు సంవత్సరాల క్రితం పావని తండ్రి చనిపోయాడు. దీంతో తన ఇద్దరు పిల్లల్ని పోషించలేని తల్లి.. వారిద్దరినీ దుండిగల్ స్పూర్తి ఫౌండేషన్ లో చేర్పించింది. అనంతరం వారి కోసం బాగా సంపాదించాలనే ఉద్దేశంతో కువైట్ వెళ్లింది. తరచుగా ఫోన్ చేస్తూ.. వీరి బాగోగులు కనుక్కుంటూ ఉంటుంది. అయితే ఆరేళ్లుగా అక్కడే ఉంటున్న పావనికి ఏమైందో తెలియదు. నిన్న సాయంత్రం ఎవరూ లేని సమయం చూసి ఆత్మహత్య చేసుకుందని నిర్వాహకులు చెబుతున్నారు. 


దేవరకద్రకు చెందిన పావని.. 


అయితే ప్రాథమిక దర్యాప్తులో మృతురాలు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలానికి చెందిన పాపగా గుర్తించారు. ఇదే అడ్రస్ స్వచ్ఛంద సంస్థ రికార్డులో ఉంది. అయితే పావని నిజంగానే ఉరి వేసుకొని చనిపోయిందా... లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత పావని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 


అనుమానంతో బంధువులకు ఫోన్... 


ఆ తర్వాత పావని చనిపోయిన విషయాన్ని కువైట్ లో ఉన్న ఆమె తల్లికి తెలిపారు. దీంతో ఒక్కసారిగా షాక్ కి గురైన ఆమె చాలాసేపు ఏమీ మాట్లాడలేకపోయారు. ఆ తర్వాత కాసేపటికి కన్నీరుమున్నీరుగా విలపిస్తూ... నా పాపకు ఏమైందంటూ నిర్వాహకులను ప్రశ్నించారు. ఆత్మహత్య చేసుకుందని చెప్పగా ఆమె నమ్మలేదు. వెంటనే స్థానికంగా ఉన్న తన బంధువులకు ఫోన్ చేసి సమాచారం అందించింది. హుటాహుటిన ఆశ్రమం వద్దకు చేరుకున్న పావని బంధువులు.. ఆందోళన చేపట్టారు. ఆరేళ్ల పాటు ఇక్కడే ఉన్న పాప.. ఇప్పుడెలా ఆత్మహత్య చేసుకుంటుందని ప్రశ్నించారు. మీరే ఏదో చేశారంటూ ఆరోపించారు. పాప మృతికి కారణం తెలిసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ నినదించారు. చివరకు పోలీసుల రంగ ప్రవేశంతో బంధువులు కాస్త శాంతించారు. పాప మృతికి సరైన కారణం ఏంటో తెలుసుకొని నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. నిజంగా హత్యే జరిగి ఉంటే త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో.. బంధువులంతా వెనుదిరిగారు.