Telangana State song writer Ande sri Dies | హైదరాబాద్: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మరణం సాహితీలోకానికి తీరని లోటును మిగిల్చింది. నేటి ( సోమవారం) ఉదయం 7.20 గంటలకు అపస్మారక స్థితిలో అందెశ్రీని కుటుంబసభ్యులు గాంధీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన గుండెపోటుతో చనిపోయారని నిర్ధారించారు. ఈ విషయాన్ని గాంధీలో డాక్టర్ సునీల్ కుమార్ తెలిపారు.
చనిపోయిన 5, 6 గంటలకు తీసుకొచ్చారు.ప్రముఖ రచయిత అందెశ్రీ అర్ధరాత్రి సమయంలో చనిపోయి ఉంటారు. గాంధీ హాస్పిటల్‌కు తీసుకురావడానికి కొన్ని గంటల ముందే ఆయన చనిపోయరు. ఆయన చనిపోయిన దాదాపు 5 లేదా 6 గంటలు అయిన తరువాత కుటుంబసభ్యులు గుర్తించి ఇక్కడికి తీసుకున్నారు. రాత్రి భోజనం చేశాక ఎప్పటిలాగానే నిద్రపోయారు. ఉదయం కుటుంబసభ్యులు గమనించగా ఆయన వాష్ రూమ్ వద్దకు వెళ్లి కిందపడి ఉన్నారు. దాంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు ఆయనను చికిత్స కోసం తీసుకొచ్చినా ప్రయోజనం లేకపోయింది. అందెశ్రీకి దశాబ్దంన్నర కాలం నుంచి హైబీపీ ఉంది. కొన్ని రోజులుగా ఆయన మెడిసిన్ తీసుకోవడం లేదు. గత 3 రోజులుగా ఆయాసం, సహ పలు అనారోగ్య సమస్యలతో అందెశ్రీ బాధపడుతున్నారని’ అని సునీల్ కుమార్ తెలిపారు.
ప్రభుత్వ లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు
కుటుంబ సభ్యులు ఆసుపత్రి నుంచి లాలాపేటలోని నివాసానికి ఆయన భౌతిక కాయాన్ని తరలించారు. అనంతరం లాలాపేటలోని జీహెచ్‌ఎంసీ ఇండోర్ స్టేడియంలో అభిమానుల సందర్శనార్థం అందెశ్రీ భౌతికకాయాన్ని ఉంచారు. అధికారిక లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 1961 జులై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించిన అందె ఎల్లయ్య గొర్రెల కాపరిగా తన ప్రస్థానం ప్రారంభించారు. చదువు లేకున్నా తన తెలివి, పద సంపద, సాహిత్యంతో కవిగా మారారు. పాటల రచయితగా విజయాలు అందుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర గీతం 'జయ జయహే తెలంగాణ' రచించి గుర్తింపు పొందారు.
అందెశ్రీ పార్థివ దేహాన్ని జయశంకర్ స్టేడియంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఈ క్రమంలోనే అందెశ్రీకి కడసారి నివాళులర్పించేందుకు పలువురు ప్రముఖులు, నేతలు లాలాపేటలోనీ స్టేడియంకి తరలివస్తున్నారు. ఇప్పటికే అందెశ్రీ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్ రామకృష్ణారావును సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు.. కవి డా. అందెశ్రీ పార్థివ దేహానికి నివాళులర్పించారు. బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు కేటీఆర్ వెంట ఉన్నారు ఈ సందర్భంగా కేటీఆర్ అందెశ్రీ గురించి మాట్లాడారు. అందెశ్రీ సేవలు, రచనలు, పాటలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆయన చనిపోయారని పద్మారావు గౌడ్ చెప్పగానే, వెంటనే నేను నా అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని వచ్చాను. అందెశ్రీ మరణం తెలంగాణ సమాజానికి, సాహిత్యానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. అందెశ్రీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు కేటీఆర్.