Telangana Formation Day : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి నేటితో పదేళ్లు పూర్తి అయింది. ఈ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణను ఇచ్చిన పార్టీ కూడా కావడంతో అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి రాష్ట్ర అవతరణ ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా, మాజీ సీఎం కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు, ఉద్యమకారులకు ఆహ్వానాలను పంపించారు. అయితే అనారోగ్యం కారణంగా సోనియా వేడుకలకు హాజరు కావడం లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ కార్యక్రమంలో తాము పాల్గొనబోమని కేసీఆర్ ప్రకటించారు.
ట్యాంక్ బండ్ పై అంబరాన్నంటిన సంబరాలు
తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన సంబురాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలకు విశిష్ట అతిథిగా రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ హాజరయ్యారు. గవర్నర్‌తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు రాష్ట్రమంత్రులు, సీఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు. ఈ సమయంలో ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను వారు పరిశీలించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి కళాకారులు తరలివచ్చారు. వారు తెలంగాణ చరిత్ర, సంస్కృతిని చాటిచెప్పేలా 17 రకాల కళలను ప్రదర్శించారు. నేడు ఆవిష్కరించిన జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతానికి ఐదు వేల మంది ట్రైనీ పోలీసులతో నిర్వహించిన ఫ్లాగ్ వాక్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాలను వీక్షించేందుకు ప్రజలు భారీగా తరలిరావడంతో ట్యాంక్‌బండ్ పరిసరాలు కిక్కిరిపోయాయి. వేడుకలు జరుగుతున్న తరుణంలో వాన పడడంతో సాంస్కృతిక కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది.
వానను సైతం లెక్క చేయకుండా భారీగా వీక్షకులు
ఓ వైపు నగరంలో భారీగా వాన పడుతున్నా వేడుకలను చూసేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. దీంతో ట్యాంక్ బండ్ జనసంద్రంగా మారింది. ప్రేక్షకుల కోసం ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. కళాకారులు తెలంగాణ కళారూపాలను ప్రదర్శిస్తున్నారు. సాయంత్రం 6:30 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. కార్నివాల్, లేజర్ షో, ఫుడ్, గేమింగ్ స్టాల్స్ జనాలకు ఆకట్టుకుంటున్నాయి. వానలో తడుస్తూ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తున్నారు. 8:50 నిమిషాల నుంచి పది నిమిషాల పాటు ట్యాంక్ బండ్ పై క్రాకర్స్ షో ప్రదర్శించారు. తెలంగాణకు సంబంధించిన ముఖ్యమైన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేశారు. వేడుకలకు వస్తున్న వారికోసం 80కి పైగా ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. రాత్రి 7.30 నిమిషాలకు లేజర్ షోను అద్భుతంగా నిర్వహించారు.
70నిమిషాల నృత్య ప్రదర్శన
వేదికపై 70 నిమిషాల పాటు కళాకారులు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ప్రదర్శించారు. స్టేజ్ షో అనంతరం జాతీయ జెండాలతో ట్యాంక్‌బండ్ పై ఆ చివర నుంచి ఈ చివర వరకు భారీ ఫ్లాగ్‌వాక్ నిర్వహించనున్నారు. ఈ వాక్ లో సుమారు ఐదు వేల మంది పాల్గొన్నారు. ఫ్లాగ్‌వాక్ జరుగుతున్నంత సేపు జయ జయహే తెలంగాణ ఫుల్వర్షన్ గీతం ఆలపించనున్నారు. ఈ వేదికపై సీఎం రేవంత్‌రెడ్డి.. కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణికి సన్మానం చేయనున్నారు.
ట్రాఫిక్ డైవర్షన్
ట్యాంక్ బండ్ వైపునకు వెళ్లే వాహనాలను పోలీసులు దారి మళ్లించారు. ట్యాంక్ బండ్ పై సుమారు 1.5 కిలోమీటరు పొడవున కళారూపాల ప్రదర్శన ఏర్పాటు చేశారు.