Telangana News: తెలంగామ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు సిద్ధమయ్యారు. పెండింగ్‌లో చాలా సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆరోపించారు ఉద్యోగులు. ఆర్టీసీ ఎండీతో సమావేశమైన ఉద్యోగులు 21 డిమాండ్లతో నోటీసులు ఇచ్చారు. వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వాటిని పరిష్కరించకుంటే సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 14 నెలలు అయినప్పటికీ సమస్యల పరిష్కారంపై శ్రద్ధ చూపలేదని ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదని ఉద్యోగులు విమర్శించారు. విధి లేని పరిస్థితుల్లోనే సమ్మెకు వెళ్తున్నట్టు పేర్కొన్నారు. 


ప్రభుత్వంలో ఆర్టీసి విలీనం, 2021 జీతభత్యాల సవరణ, కండక్టర్, డ్రైవర్ల ఉద్యోగ భద్రత, ఎలక్ట్రిక్ బస్సులు ప్రభుత్వమే కొని ఆర్టీసీకి ఇవ్వాలనే డిమాండ్‌లపై ఈ నోటీసు ఇచ్చారు. డిమాండ్ల పత్రంలోని సమస్యల పరిష్కారానికి పారిశ్రామిక వివాదాల చట్టం 1947 సెక్షన్ 22 (1) లోని నిబంధనలకు అనుగుణంగా సమ్మె నోటీస్ జారీ చేస్తున్నామన్నారు. ఈ సమ్మె తెలంగాణలోని అన్ని డిపో/యూనిట్లలో ఫిబ్రవరి 9 నుంచి సమ్మె ప్రారంభమవుతుందన్నారు. 


దాదాపు నాలుగేళ్ల క్రితం తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. అప్పట్లో ఈ సమ్మె పెను సంచలనాలనే సృష్టించింది. ప్రభుత్వానికి, ఆర్టీసీకి మధ్య వార్‌ లాంటి పరిస్థితి కనిపించింది. అప్పట్లో ఇచ్చిన డిమాండ్లు కొన్నింటిని నాటి ప్రభుత్వం విస్మరించిందని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. కొత్తప్రభుత్వం వచ్చిన తర్వాత వాటికి పరిష్కార లభిస్తుందని ఇంత కాలం ఎదురు చూశామని అంటున్నారు. అయినా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతోనే సమ్మెకు నోటీసు ఇవ్వాల్సి వచ్చిందని అంటున్నారు. 


ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న డిమాండ్స్ ఇవే
1. మేనిఫెస్టోలో ఆర్టీసి ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ఆర్థికపరమైన అంశాలను అమలు చేస్తూ ప్రస్తుత సౌకర్యాలను కొనసాగిస్తూ ప్రభుత్వంలో విలీనం చేయాలి. ప్రభుత్వోద్యోగులతో సమానంగా జీతాలు అమలు చేయాలి. 2017 వేతన సవరణ బకాయిలను చెల్లించి, రిటైర్డ్ ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేయాలి. కొత్త బస్సుల కొనుగోలు ద్వారా ఆర్టీసిని అభివృద్ధి చేసి ఆధునీకరించాలి.


2. సంస్థ అప్పులను ప్రభుత్వమే టేకోవర్ వేసి, రాయితీలకు సంస్థ అభివృద్ధికి ప్రతియేటా బడ్జెట్లో 3% కేటాయించాలి. 


3. విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి, ఆర్టీసికి ఇవ్వాలి.


4 యాజమాన్యం వాడుకున్న సిసిఎస్, ఎస్ఆర్బిఎస్, పిఎఫ్ నిధులను వెంటనే విడుదల చేస్తూ, సిసిఎస్ లో ఎన్నికలు నిర్వహించి, ఆఫీసు సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలి.


5. మహాలక్ష్మి పథకంలో జీరో టికెట్ బదులు మహిళలకు స్మార్ట్ కార్డు ఇవ్వాలి. రద్దీకనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి. 


6 బ్రెడ్ విన్నర్, మెడికల్ ఇన్వాలిడేషన్ ఉద్యోగుల కుటుంబాలకు ఇచ్చే ఉద్యోగాలు, రెగ్యులర్ ప్రాతిపదికన నియమించాలి. ప్రస్తుతం కన్సాలిడేటెడ్ కింద పనిచేస్తున్న ఉద్యోగులకు పర్మెనెంట్ చేయాలి. ప్రభత్వ జీవో ఎం.ఎస్ చెం. 30. తేది 08-07-2024 ప్రకారం వయోపరిమితిని 44 సంవత్సరాలకు పెంచాలి. ఈ స్కీమ్‌లో జూనియర్ అసిస్టెంట్, అటెండర్ వంటి పోస్టులను కూడా ఇవ్వాలి. 


7. అన్ని కేటగిరీల్లో ఖాళీలను భర్తీ చేసి అర్హులైనవారికి ప్రమోషన్లు ఇవ్వాలి. 


8. ప్రతి కార్మికునికి 21 రోజుల హాజర్‌తో ఇన్సెంటివ్ ఇవ్వాలి. బస్‌బాడీ బిల్డింగ్‌తోపాటు మిగిలిన వర్క్స్లను బలోపేతం చేయాలి. ప్రొడక్షన్ యూనిట్లలో 2013 నుంచి రావలసిన మ్యాన్ అవర్ రేటు అమలు చేయాలి.


9. తార్నాక హాస్పిటల్లో అన్ని విభాగాల్లో సిబ్బందిని రెగ్యులర్ ప్రాతిపదికన నియమించాలి. రోగులు, వారి వెంట వస్తున్న అటెండెంట్లకు భోజన, వసతి సౌకర్యం కల్పించాలి.


10 ఆర్టీసి ఉద్యోగులకు తార్నాక హాస్పిటల్లో మెరుగైన వైద్య సౌకర్యం కల్పిస్తూ, ఉద్యోగి ఫ్యామిలీతోపాటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో వారి తల్లిదండ్రులకు కూడా వైద్య సౌకర్యం కల్పించాలి.


11. సంస్థలో రిటైరైన ఉద్యోగులకు సరిపడా మందులు సరఫరా చేయాలి. వైద్య పరీక్షలకయ్యే ఖర్చు యాజమాన్యమే భరించాలి.


12. రిటైరైన ఉద్యోగులకు రావలసిన అన్ని బకాయిలను వెంటనే చెల్లించాలి. రిటైర్ కాబోతున్న ఉద్యోగులకు అదేరోజు అన్ని సెటిల్మెంట్ మొత్తాలను చెల్లించాలి.


13 అకౌంట్స్ విభాగంలో సెంట్రలైజేషన్ విధానం రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలి


14. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న డిటైర్డ్ అధికారులు సూపర్వైజర్లను తీసివేసి వారి స్థానంలో ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలి అవుటోర్సింగ్ ద్వారా కన్సల్టెన్సీల పేరు మీద జరుగుతున్న ఆర్థిక దుబారాను అరికట్టాలి.


15. అన్ని యూనిట్లలో మహిళలతోపాటు పురుషులకు కూడా అన్ని వసతులతో పాటు తాగునీరు, వాహనాల పార్కింగ్కు సరిపడ షెడ్స్ నిర్మించాలి.


16. పాత రెగ్యులేషన్స్ సమూలంగా మార్చి డ్రైవర్‌ కిండక్టర్, మెయిన్టినెన్స్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి,


17. అక్రమ సస్పెన్షన్, రిమూవల్ అయినవారిని మరియు అమ్మీట్ రిజెక్ట్ అయినవారిని విధులలోకి తీసుకోవాలి.


18. జూనియర్ అసిస్టెంట్ టెస్ట్ పాస్ అయి ఉన్నవారికి పోస్టింగ్ ఇవ్వాలి. మిగిలిన ఖాళీలకు డిపార్టుమెంట్ టెస్ట్లు నిర్వహించి భర్తీ వేయాలి.


19. 2019వ సంవత్సరం సమ్మెకాలంలో ఉద్యోగులపై నమోదు చేసిన పోలీస్ కేసులను ఎత్తి వేయాలి.


20. అద్దె బస్సు డ్రైవర్లకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఇఎస్ఐఐ ఆస్పత్రులలో వైద్య సౌకర్యం కల్పించాలి. పిఎఫ్ కాంట్రిబ్యూషన్ రికవరీ చేయాలి.


21. ఎంటిడబ్ల్యు యాక్ట్ ప్రకారం 8 గంటల పని దినాలు (సిటీ సర్వీసులలో 7 గంటలు) అమలు చేసి మహిళా కండక్టర్లకు రాత్రి 8 గంటల లోపు డ్యూటీ పూర్తయ్యేలా డ్యూటీలు ఇవ్వాలి. ప్రతి కార్మికునికి నెలకు 3 రోజులు సెలవులు మంజూరు చేయాలి.