Minister KTR News: తెలంగాణ పోలింగ్‌కు రోజులు దగ్గర పడుతున్నాయి. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు, స్వతంత్రులు సైతం గల్లీ, గల్లీకి తిరుగుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. బజ్జీలు చేస్తున్నారు, ఇడ్లీలు వేస్తున్నారు, రోడ్లు ఊడుస్తున్నారు, బట్టలు ఇస్త్రీ చేస్తున్నారు. ఓటరు మహాశయులను తమ వైపు తిప్పుకోవడానికి ఎన్ని దారులు ఉన్నాయో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో మంత్రి కేటీఆర్ తీరే వేరు. మిగతా వారితో పోలిస్తే ఈయన ఎప్పుడు ప్రత్యేకంగానే కనిపిస్తారు.
ఎన్నికల ప్రచారాన్ని సరికొత్త పుంతలు తొక్కిస్తున్నారు. గత ఎన్నికల్లో సోషల్ మీడియాను ఉపయోగించుకున్న కేటీఆర్, ఈ ఎన్నికల్లో సరికొత్త పంథాను ఎన్నుకున్నారు. మంత్రి అంటే కాన్వాయ్, సెక్యూరిటీ, ప్రొటోకాల్ అంటూ చాలా తంతులు ఉంటాయి. కానీ కేటీఆర్ వాటన్నింటిని వదిలేసి రోడ్లపైకి వస్తున్నారు. గత శుక్రవారం రాత్రి ఉన్నట్టుండి పాతబస్తీలో సందడి చేశారు. ఆ సమయంలో ఆయన చుట్టూ ఎలాంటి ప్రొటోకాల్ లేదు. సెక్యూరిటీ లేకుండా ఆ ప్రాంతంలో పర్యటించి స్థానికులను ఆశ్చర్యపరిచారు.
ముందుగా మదీనాలోని షాదాబ్ హోటల్‌కు వెళ్లిన ఆయన వేడి వేడిగా ఇరానీ ఛాయ్ ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ తీసుకుంటున్న వెయిటర్ కేటీఆర్‌ను గుర్తుపట్టేశాడు. సార్.. మీరు మినిస్టర్ గారు కదా.. అంటూ అడిగే సరికి అందరూ ఆయన్ను చూసేశారు. హోటల్ యాజమాన్యం కేటీఆర్‌ను ఏసీ రూంకు తీసుకెళ్లి అక్కడ బిర్యానీ ఆర్దర్ ఇచ్చారు. బిర్యాని తిన్న తరువాత ఆయన ఇరానీ ఛాయ్ తాగారు. హోటల్ సిబ్బందితో పాటు పలువురు కస్టమర్లు కేటీఆర్‌తో సెల్ఫీలు తీసుకున్నా రు.
ఈ సందర్భంగా హోటల్‌కు వచ్చిన వారితో ఆప్యాయంగా మాట్లాడారు. చికెన్ బిర్యానీ తిన్నారా.. ఇక్కడ భలే ఉంటుంది కదా, అంటూ ముచ్చటించారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ నాయకులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. కేటీఆర్ జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్, కారు గుర్తుకే మన ఓటు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలలో తమపార్టీ విజయం తథ్య మని ధీమా వ్య క్తం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. అంతకుముందు కేటీఆర్ మొజంజాహీ మార్కెట్‌కు వెళ్లారు. ఐస్‌క్రీం రిఫ్రెష్‌మెంట్ ఏరియాలోకి వెళ్లి ఐస్‌క్రీం తిన్నారు.
ఎవరి పడితే వారి చేతుల్లో తెలంగాణ పెడదామా?
ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రాన్ని పదేళ్లలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన బీఆర్ఎస్‌కు ప్రజలు అండగా నిలవాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీ ఢిల్లీ నేతలను నమ్ముకున్నాయని, తాము మాత్రం తెలంగాణ ప్రజలనే నమ్ముకుని ముందుకెళ్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో 46 లక్షల మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు వస్తున్నాయని, కాంగ్రెస్ (Congress) హయాంలో కేవలం 29 లక్షల మందికి మాత్రమే పింఛన్లు వచ్చేవని గుర్తు చేశారు.
మంచిగా నడిచే ప్రభుత్వాన్ని.. ప్రగతిలో దూసుకెళ్తోన్న రాష్ట్రాన్ని ఎవరు పడితే వారి చేతుల్లో పెడదామా? అనిప్రశ్నించారు. గత 50 ఏళ్లలో తెలంగాణను కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందన్నారు. ప్రజలు ఆలోచించాలని కోరారు. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు నుంచి బీజేపీ నేతలు ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వస్తున్నారని.. వారందరి అజెండా ఒక్కటేనన్నారు. ఎలాగైనా కేసీఆర్ గొంతు నొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు.