రోజూ పెరుగుతున్న పెట్రోల్ డీజిల్(Petrol price) ధరలపై కేంద్రానికి కేటీఆర్(KTR) బహిరంగ లేఖ రాశారు. ప్రతీ రోజూ ప్రజల రక్తం పీల్చేలా పెంచుతున్న పెట్రో ధరల పెంపుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. ఒకవైపు నిరంతరం ధరలను పెంచుతూనే మరోవైపు ఆ పాపాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై నెట్టే ఒక కుటిల ప్రయత్నానికి కేంద్రంలోని బిజెపి(BJP) ఒడిగట్టిందన్నారు. నిజం చెప్పులేసుకునేలోపు అబద్ధం ఊరంతా బలాదూర్‌గా తిరిగొస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే  దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అత్యంత భారీగా పెట్రో రేట్లు పెంచిన కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలు, అది చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజల ముందు ఎండగట్టేందుకే  లేఖ రాసినట్టు వెల్లడించారు కేటీఆర్.


అప్పుడు అలా ఇప్పుడు ఇలా 
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలపై ఎక్కడలేని ప్రేమను ఒలకబోసి, పేదల బాధల పట్ల మొసలి కన్నీరు కార్చారాని  నరేంద్రమోదీ(Narendra Modi)పై ఫైర్ అయ్యారు కేటీఆర్. అధికారంలోకి వచ్చినంక ప్రజల్ని లెక్కచేయకుండా, ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలి పాలిస్తున్నారని మండిపడ్డారు. నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తొలినాళ్ళ నుంచే తన చేతకానితనం, తమకు తెలియని ఆర్థిక విధానాలతో ప్రజల్ని పీడించుకు తింటోందని కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారాయన. 


సబ్ కా సత్తేనాశ్


తానిలా విమర్శించడానికి అడ్డూ అదుపు లేకుండా రోజువారీగా పెరుగుతున్న పెట్రో రేట్లు, ఆకాశాన్ని దాటి అంతరిక్షానికి చేరుకుంటున్న నిత్యావసరాల ధరలే కారణమన్నారు కేటీఆర్. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అని గప్పాలు చెప్పుకునే మోదీ పాలనలో సబ్ కా సత్తేనాశ్ అయిందన్నారు. ధరలను అదుపు చేయడం చేతగాని మోదీ ప్రభుత్వం అందుకు కారణాలుగా చెపుతున్న అంశాలన్నీ శుద్ధ అబద్దాలేనన్నారు. 


శ్రీలంక బెటర్


అంతర్జాతీయ ముడి చమురు సరఫరాలో తలెత్తుతున్న ఇబ్బందులనీ కొన్నిరోజులు, ముడి చమురు ధరల పెరుగుదల అని ఇంకొసారి, రష్యా ఉక్రేయిన్ యుద్ధం అని ఇంకొన్ని రోజులు బీజేపీ నేతలు కహానీలు చెప్పారన్నారన్నారు కేటీఆర్‌. కానీ ఇదంతా నిజం కాదన్నారు. అమెరికా, కెనడా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్‌లో కూడా ధరలు పెరుగుతున్నాయని చెపుతున్న కేంద్రమంత్రులు అక్కడ లీటర్ పెట్రోల్ రేట్ మనకంటే తక్కువే అన్న సంగతిని కావాలనే దాస్తున్నారన్నారు. పకనున్న దాయాది దేశాలతోపాటు, అర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలోనూ ఇప్పటికీ అత్యంత చవక ధరకే పెట్రో ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. 


ఎక్సైజ్‌ సుంకం పేరుతో దోపిడీ


2014లో బిజేపీ ప్రభుత్వం గద్దెనెక్కిన నాటికి అంతర్జాతీయంగా ఉన్న ముడిచమురు ధర సుమారు 105 డాలర్లని గుర్తు చేశారు కేటీఆర్. ఆ తర్వాత వివిధ కారణాల వలన ఒకానొక దశలో సుమారు 40 డాలర్ల దిగువకు ముడిచమురు ధరలు తగ్గినా దేశంలో మాత్రం పెట్రో ధరలను బీజేపీ ప్రభుత్వం పెంచుతూనే ఉందన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలంటే కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వానికి కనికరం లేదనడానికి కరోనా సంక్షోభం కాలంలో పెంచిన ఎక్సైజ్ సుంకమే సాక్ష్యమని విమర్శించారు. కరోనా సంక్షోభంలో బ్యారెల్ ముడిచమురు ధర 20 డాలర్ల కంటే తక్కువకు పడిపోయిందని వెల్లడించారు. ఫలితంగా దేశంలో భారీగా పెట్రో రేట్లు తగ్గాల్సి ఉండేవని కానీ మోదీ ప్రభుత్వం మాత్రం ఎక్సైజ్ సుంకాన్ని 20 రూపాయలు పెంచిందన్నారు. 


సమాధానం చెప్పాలి


2014లో సుమారు 70.51 రూపాయలుగా ఉన్న పెట్రోల్ ధరను రు.53.78గా ఉన్న డీజిల్ ధరను క్రమంగా పెంచుతూ రూ. 118.19కి, డీజిల్‌ను రూ. 104.62కు పెంచిందన్నారు కేటీఆర్. అంతర్జాతీయంగా ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధర 106 డాలర్లుగా ఉందని తెలిపారు. 2014లో క్రూడ్ ఆయిల్‌కు ఎంత ధర ఉందో ఇప్పుడు కూడా అంతే ఉందని కాని  2014లో మనదేశంలో లీటర్ పెట్రోల్ ఎంత ధరకు దొరికేదో ఇప్పుడు మాత్రం అంతకు దొరకడం లేదన్నారు. రెట్టింపు అయిందని విమర్శించారు. ఇది ఎలా అయింది? ఎందుకు అయింది? ఏ ప్రయోజనాల కోసం ఇలా ధరలను ఇష్టం వచ్చినట్టు పెంచుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీజేపీ నాయకులపై ఉందన్నారు కేటీఆర్. 


చేతకాని విధానాలతోనే సమస్య 


దేశ ఆర్థిక వ్యవస్థను నడపలేక బీజేపీ అవలంబిస్తున్న అసమర్థ విధానాలే ప్రస్తుత ఈ దుస్థితికి కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. సంపదను సృష్టించే తెలివి లేక, చేతిలో ఉన్న అధికారంతో విపరీతంగా పన్నులు పెంచుతూ దాన్నే సుపరిపాలనగా భావిస్తున్న భావ దారిద్ర్యంలో కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఉన్నారన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా దేశంలో ఉన్న  26 కోట్ల కుటుంబాలపై ఏడున్నర సంవత్సరాలుగా 26.51 లక్షల కోట్ల రూపాయల పెట్రో పన్నును వేసిన పనికి మాలిన ప్రభుత్వం బీజీపిదేనన్నారు. అంటే సగటున ఒక్క కుటుంబం నుంచి లక్ష రూపాయలను దౌర్జన్యంగా పెట్రో ధరల పెంపు పేరుతో లూఠీ చేసింది మోడీ ప్రభుత్వమని వివరించారు. ప్రతీది దేశం కోసం  ధర్మం కోసం అంటారని... ఈ దోపిడీ కూడా దేశం కోసం ధర్మం కోసమేనా? దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 


బట్టేబాజ్ సర్కార్ 
అంతర్జాతీయంగా చవక ధరలకు పెట్రో ఉత్పత్తులను కొని అధిక ధరలకు దేశ ప్రజలకు అమ్ముకుంటున్న దళారి ప్రభుత్వం నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వమన్నారు కేటీఆర్. బహిరంగంగా తాను చేస్తున్న దోపిడిని రాష్ట్ర ప్రభుత్వాలపైకి నెట్టి చేతులు దులుపుకుంటున్న బట్టేబాజ్ సర్కార్ కేంద్రంలో ఉందన్నారు. ఒకవైపు భారీగా పెట్రో ధరలను పెంచుతున్న కేంద్రం నీతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించాలన్న వితండ వాదాన్ని తీసుకొచ్చిందని ఆరోపించారు. ఇందులోని మర్మాన్ని సవిరంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.  


రాష్ట్రాలకు వచ్చేది ఆఠాణా


2014కు ముందుకు పెట్రోల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ రూ.9.48గా ఉండేదని అధికారంలోకి వచ్చినంక మోదీ దాన్ని రూ.32.98కి పెంచారన్నారు కేటీఆర్. గతేడాది కాస్త తగ్గించి దాన్ని రూ.27.90 చేశారుని వివరించారు. ఈ ఎక్సైజ్ డ్యూటీలో 41 శాతం రాష్ట్రాలకే తిరిగి వస్తుందంటూ కేంద్రమంత్రులతోపాటు వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ సోషల్ మీడియాలో డప్పు కొడుతున్నదని అది పచ్చి అబద్ధమని తెలిపారు. పెట్రోల్ ధరలో ఎక్సైజ్ డ్యూటీ పేరుతో కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న దాంట్లో అన్ని రాష్ట్రాలతో పంచుకునేది బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ మాత్రమేనన్నారు. ఇప్పుడున్న పెట్రో ధరలో బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ ఒక రూపాయి 40 పైసలు మాత్రమేనని పేర్కొన్నారు. ఇందులో నుంచి 41 శాతాన్ని అంటే అక్షరాల 57 పైసల్ని  కేంద్రం, అన్ని రాష్ట్రాలకు పంచుతుందన్నారు. ఇందులో తెలంగాణ వాటా 2.133 శాతం అంటే లీటరుకు 0.01 పైసలే వస్తుందన్నారు.కానీ 28 రూపాయల ఎక్సైజ్ డ్యూటీ ముక్కుపిండి వసూలు చేస్తున్న మోదీ సర్కార్, అందులో నుంచి ఆఠాణా మాత్రమే రాష్ట్రాలకు ఇస్తూ ఏదో ఘనకార్యం చేస్తున్నట్టు గప్పాలు కొట్టుకుంటుందని ఫైర్ అయ్యారు కేటీఆర్. 


సెస్‌ల పేరుతో దోపిడీ            


రాష్ట్రాలను బలహీనపరిచే కుట్రలను అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి అమలు చేస్తున్న నరేంద్రమోదీ, పెరుగుతున్న పెట్రోధరలతో కేంద్ర ప్రభుత్వ ఖజానా మాత్రమే నిండేలా చూసుకుంటున్నారన్నారు కేటీఆర్. అందుకే బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుంకాల రూపంలో కాకుండా సెస్సుల రూపంలో పెట్రో రేట్లు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం 18 రూపాయలు, వ్యవసాయ, మౌలిక వసతులు అభివృద్ధి పేరిట రెండున్నర రూపాయలు, ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ పేరిట పదకొండు రూపాయలను ఇలా ప్రతి దానికి ఒక్కో పేరు చెప్పి దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అత్యంత భారీగా 30 రూపాయలకు పైగా సెస్సులను పెట్రో ధరల పేరుతో వసూలు చేస్తోందని వివరించారు. ఇందులో నుంచి రాష్ట్రాలకు దక్కేది గుండు సున్నానే అని వెల్లడించారు. 


అచ్చేదిన్ కాదు అందర్నీ ముంచే దిన్


ఒకవైపు కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి దాదాపు పెట్రో ధరలను రెట్టింపు చేసినా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం 2015 నుంచి ఇప్పటి దాకా వ్యాట్ టాక్స్ ఒక్క నయాపైసా కూడా పెంచలేదన్న సంగతిని ప్రజలంతా గమనించాలన్నారు కేటీఆర్. పెట్రో ధరల పేరిట పట్టపగలు ప్రజల జేబులను దోచుకుంటున్న పార్టీ బిజెపి అన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు. అందుకే అచ్చేదిన్ కాదు అందర్నీ ముంచే దిన్ అనుకుంటున్నారని సెటైర్లు వేశారు. 


తరుచూ ఎలక్షన్‌ రావాలని ప్రజల కోరిక 


దేశంలో రాజ్యాంగబద్ధంగా ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలు రావాలి కానీ... కానీ బిజెపి అవకాశవాద, అసమర్థ విధానాలను చూసిన ప్రజలు తరచూ ఎన్నికలు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారని విమర్శించారు కేటీఆర్. అట్లయిన పెట్రోలు ధరల పెంపు ఆగుతుందన్న ఆలోచనల్లోకి ప్రజలు వచ్చారన్నారు. పెట్రో ధరల పెంపును ఒక రాజకీయ అంశంగా వాడుకుంటున్న బిజెపి ఎన్నికల తర్వాత అత్యంత కర్కశంగా వరుసగా పెట్రో ధరలను పెంచుకుంటూ పోవడాన్ని అలవాటుగా మార్చుకుందన్నారు. 2017 గుజరాత్ ఎన్నికలు, 2019 సాధారణ ఎన్నికలు, 2020లో 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా కొన్ని వారాలు, నెలలపాటు పెట్రో ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచలేదని గుర్తు చేశారు. కానీ ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచి దాదాపు ప్రతీ రోజూ పెట్రో ధరల్ని మోదీ సర్కార్ పెంచుకుంటూ పోతున్నదని వివరించారు. 


పెట్రో ధరల పెంపు అలవాటు


గత పదిహేను రోజుల్లో 13 సార్లు పెట్రోల్ ధరలను పెంచి ప్రజలన్నా, ప్రజల కష్టాలన్నా తనకు ఎంత చులకనభావం ఉందో మోదీ సర్కార్ చాటుకుందన్నారు కేటీఆర్. నాలుగు రాష్ట్రాల్లో గెలిపించిన పాపానికి ప్రజలకు మోదీ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదేనన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం తనకు చేతకాని పాలనను పక్కనపెట్టి కేవలం పెట్రో ధరలను పెంచడాన్నే అలవాటుగా మార్చుకుందంటే  అతిశయోక్తి కాదన్నారు కేటీఆర్.                 


పెట్రో ధరలు ఎందుకు పెరుగుతున్నాయని అడిగిన ప్రతీసారి అదరకుండా, బెదరకుండా అబద్దాన్ని చెప్పే దొంగ నేర్పు ప్రస్తుత కేంద్ర మోదీ సర్కార్‌కు పుష్కలంగా ఉందని ఎద్దేవా చేశారు కేటీఆర్. అందుకే తాజా ధరల పెరుగుదలకు రష్యా, ఉక్రేయిన్ సంక్షోభాన్ని సాకుగా కేంద్ర మంత్రులు చూపిస్తున్నారన్నారు. లోక్ సభలో పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రి రామేశ్వర్ తేలి చేసిన ప్రకటన ప్రకారం రష్యా నుంచి కేవలం ఒక్క శాతం కన్నా తక్కువ క్రూడాయిల్ దిగుమతి చేసుకుంటున్నామని గుర్తు చేశారు కేటీఆర్. ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, నైజీరియా, అమెరికా నుంచే అత్యధికంగా పెట్రో ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకుంటున్నామమన్నారు. రష్యా, ఉక్రేయిన్ యుద్ధంతో ఈ దేశాల నుంచి మనకు పెట్రో ఉత్పత్తులు రావడంలో ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. కాని రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఒక్కశాతాన్ని చూపించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం బీజేపీ నాయకులు చేస్తున్నారన్నారు. ఇలా పదే పదే అబద్దాలను వల్లె వేసీ..వేసీ.. బీజేపీ నాయకుల నోట్లోని నాలుకలు కూడా సిగ్గుపడుతున్నాయన్నారు. 


పన్నులు వసూలు చేయడమే పని


మానవత్వం అస్సలు లేని ప్రభుత్వం దేశ ప్రజల నెత్తి మీద తిష్ట వేసుకుని కూర్చుందన్నారు కేటీఆర్. కరోనా సంక్షోభాన్ని అత్యంత్య దారుణంగా మార్చిన మోదీ సర్కార్, ఆ టైంలో పంపిణీ చేసిన ఆహార ధాన్యాలు, వ్యాక్క్షిన్ల ఖర్చును పెట్రోల్ ధరలతో వసూలు చేసుకుంటామని సిగ్గులేకుండా ప్రకటించిందన్నారు. ప్రభుత్వ పరిపాలన అంటే ప్రజలపై భారీగా పన్నులు వసూలు చేయడమే అన్న స్ఫూర్తితోనే  నరేంద్ర మోదీ సర్కార్ పని చేస్తున్నట్టు కనిపిస్తోందన్నారు. 


ప్రజలను దోపిడి చేయడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రధానమంత్రి పెట్రో పన్ను యోజన పథకాన్ని ప్రవేశపెట్టిందనిపిస్తుందన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. సమర్థ విధానాలు, నిర్ణయాలతో సంపదను సృష్టించి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ.. సృష్టించిన సంపదను ప్రజలకు పంపిణీ చేయాలి కానీ కేవలం పన్నుల పేరిట ప్రజలను పీల్చిపిప్పి చేయడమే పరిపాలనగా భావిస్తున్నారని మండిపడ్డారు. బిజెపి ప్రభుత్వాన్ని కచ్చితంగా ప్రజలు సాగనంపే రోజు దగ్గర పడిందన్నారు. పెట్రో ధరల బాదుడు ఆపకపోతే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించడం ఖాయమన్నారు. 


పెట్రో రేట్ల పెరుగుదలతో ప్రతీ ఒక్కరి దైనందిత జీవితం తీవ్రంగా ప్రభావితం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్. ఇంట్లో వాడే గ్యాస్, పప్పు, ఉప్పు, ఔషధాల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయన్నారు. సామాన్యుడి బతుకు దిన దిన గండంగా మారిందన్నారు. బీజేపీ హయాంలో గ్యాస్ బండ.. మోయలేని గుదిబండగా మారిందని తెలిపారు. దీంతో మోదీ చెప్పిన పకోడీలు అమ్ముకుని బతికే పరిస్థితి కూడా లేదని ఎద్దేవా చేశారు. పెట్రో ధరల పెంపుతో దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమన దశలోకి వచ్చిందన్నారు. ప్రజలు బైకులు, కారులు వదిలేసే పరిస్ధితి నెలకొంటున్నదన్నారు. వంట గ్యాస్ వెయ్యి దాటడంతో మళ్లీ కట్టెల పొయ్యే దిక్కైందని సెటైర్లు వేశారు. వ్యవసాయ పెట్టుబడివ్యయం పెరిగిపోతుందన్నారు. ఇన్నేళ్ల పాలనలో బీజేపీ సాధించిన ఘనకార్యాలు ఏమన్నా ఉన్నాయా అంటే అవి పెట్రో వాతలు.. ధరల మోతలేనన్నారు. 


నాటి మాటలు ఏమయ్యాయి


అధికారంలోకి రావడానికి ముందు పెట్రో ధరల పెంపును రాజకీయాస్త్రంగా మార్చుకున్న నరేంద్ర మోదీ ఆనాటి తన మాటలు, చేతలను ఒకసారి గుర్తు తెచ్చుకోవాలన్నారు కేటీఆర్. కరోనా సంక్షోభంతో ఉద్యోగాలు పోయి ఆదాయాలు తగ్గి, నిరుద్యోగిత పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రో రేట్ల పెంపుతో ప్రజా జీవితం అస్తవ్యస్తం అవుతున్న విషయాన్ని ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోదీ గుర్తించాలన్నారు. తన అసమర్థ ప్రభుత్వ పనితీరు, వైఫల్యాలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెట్రో ధరల పెంపును అడ్డుకోవడంలో విఫలమయ్యామని దేశ ప్రజలను క్షమాపణ చెప్పాలన్నారు. పెట్రో ధరల పెంపు ధర్మసంకటం అన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మాటల్ని ప్రజలు సీరియస్‌గా పట్టించుకున్న రోజు, ధర్మ సంకటాన్ని వీడి కేంద్ర ప్రభుత్వంపై తిరగబడే పరిస్థితి త్వరలోనే వస్తదాన్నారు. పెట్రో ధరల బాదుడు ఆపకపోతే.. ప్రజాక్షేత్రంలో తిరస్కారం తప్పదు అన్న సంగతిని గుర్తుంచుకుని వెంటనే పెట్రో, గ్యాస్ ధరల పెంపుని ఆపాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ప్రయోజనం కలిగేలా పెట్రో రేట్లను తగ్గించేందుకు వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దేశ ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తున్నానన్నారు కేటీఆర్.