Director Rajamouli Praises Harish Rao: తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన గొప్ప వ్యక్తి రాజమౌళి అని తెలంగాణ మంత్రి హరీష్ రావు ప్రశంసించారు. బాహుబలి సినిమాతో మన కీర్తి దేశ వ్యాప్తం చేస్తే, RRR సినిమాతో తెలుగు వాడి ఖ్యాతిని టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి ప్రపంచ వ్యాప్తం చేశారని కొనియాడారు. బంజారాహిల్స్ లో లిటిల్ స్టార్స్ అండ్ షీ ప్రైవేటు ఆస్పత్రి ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్ రావు, ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి పాల్గొన్నారు.
టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ MNJ కేన్సర్ ఆసుపత్రిలో పేషెంట్ కేర్, సెక్యూరిటీ, వంటి విషయాల వ్యయం రెండేళ్ల పాటు తామే భరిస్తామని మంత్రి హరీష్ రావు ముందుకు వచ్చారు. రాజమౌళి సినిమాలో స్ఫూర్తి కనిపిస్తుంది. దేశ భక్తి, సామాజిక స్పృహ కనిపిస్తుంది అని మంత్రి అభినందించారు. అనంతరం ఆయన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రఖ్యాత ఆస్కార్ అవార్డు సాధించడం పట్ల రాజమౌళిని మంత్రి హరీశ్ రావు సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. రాజమౌళి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఇదే సందర్భంగా మంత్రి హరీశ్ రావు పనితీరుపై రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. హరీష్ రావు నాయకత్వంలో సిద్దిపేట నియోజక వర్గం ఎంతో అభివృద్ధి చెందింది అన్నారు. తాను గతంలో చూసినప్పటికీ, ఇప్పటికీ ఎంతో మార్పు వచ్చిందన్నారు. పని తీరు చూశాక హరీశ్ రావుకి తాను పెద్ద అభిమానిగా మరానని రాజమౌళి చెప్పుకొచ్చారు.
హెల్త్ హబ్ గా తెలంగాణ అభివృద్ధి
గ్లోబల్ సిటీగా హైదరాబాద్ ఎదిగిందని, సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో హైదరాబాద్ అభివృద్ధి చెందింది, అదే విధంగా అరోగ్య రంగంలో అభివృద్ధి చెందిందన్నారు మంత్రి హరీష్ రావు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు. అందుకే 10 వేల పడకల సూపర్ స్పెషాలిటీ పడకలు ఏర్పాటు చేస్తున్నాం. నీతి అయోగ్ నివేదిక ప్రకారం దేశంలోనే తెలంగాణ అగ్ర స్థానంలో ఉందన్నారు. సూపర్ స్పెషాలిటీ MCH లను గాంధీ, నిమ్స్ లో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వచ్చే నెలలో గాంధీలో ప్రారంభం అవుతుంది. కార్పొరేట్ ఆసుపత్రులతో తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులు పోటీ పడుతున్నాయని హరీష్ రావు పేర్కొన్నారు.
2014 లో ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీలు 30 శాతం ఉంటే, గత నెలలో 70 శాతానికి చేరాయి. ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ లో తెలంగాణ దేశంలో నెంబర్ 1గా నిలిచిందన్నారు. ఎనీమియా తగ్గించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 14 నుండి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. మాతా శిశు మరణాలు తగ్గించడంలో తెలంగాణ దేశంలో నెంబర్ 1 గా ఉంది. వంద శాతం ఆసుపత్రి డెలివరీలు జరుగుతున్నాయి. అనవసర సి సెక్షన్లు తగ్గించడంలో ప్రైవేటు ఆసుపత్రులు తోడ్పాటు అందించాలని, అనవసర సి సెక్షన్ల వల్ల అనేక ఇబ్బందులు ఉంటాయన్నారు. నాడు పేదలు రొట్టెలు తింటే, ధనికులు అన్నం తిన్నరు. నేడు అది రివర్స్ అయ్యింది. ఈ ఆసుపత్రి కూడా ప్రజలకు తక్కువ ఖర్చుతో మంచి వైద్య సేవలు అందించాలి అని మంత్రి హరీష్ రావు అన్నారు.