హైదరాబాద్: GOAT లియోనెల్ మెస్సీ, అలాగే ఫుట్‌బాల్ దిగ్గజాలైన లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ మా ఆహ్వానాన్ని మన్నించి హైదరాబాద్‌కు విచ్చేసి, క్రీడాభిమానులను, ముఖ్యంగా యువతను ఉర్రూతలూగించినందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. జీవితకాలం గుర్తుండిపోయే జ్ఞాపకంగా మార్చినందుకు, మా లీడర్ రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు.

Continues below advertisement

ఈవెంట్ సక్సెస్ చేసిన వారికి సీఎం అభినందనలు‘ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన అధికారులు, భద్రతా సిబ్బంది, నిర్వాహకులు, విధుల్లో ఉన్న సిబ్బంది అందరికీ నా కృతజ్ఞతలు, అభినందనలు. దీని ద్వారా తెలంగాణ అంటే క్రీడలు, తెలంగాణ అంటే ఎక్సలెన్స్, తెలంగాణ అంటే ఆతిథ్యం అని ప్రపంచానికి చూపించగలిగాం. మా ప్రభుత్వం తరఫున, మా అతిథులకు ఆతిథ్యం ఇచ్చే విషయంలో అద్భుతంగా వ్యవహరించిన, అత్యుత్తమ ప్రవర్తన, క్రమశిక్షణను కనబరచిన క్రీడాభిమానులు, అభిమానులందరికీ ధన్యవాదాలు’ అని రేవంత్ రెడ్డి ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. 

ఘనంగా ముగిసిన లియోనెల్ మెస్సీ హైదరాబాద్ టూర్

హైదరాబాద్: ప్రపంచ పుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ పర్యటన ఘనంగా ముగిసింది. దీనిపై తెలంగాణ సీఎంఓ స్పందించింది. ఎన్నో రోజులుగా ఉత్కంఠగా ఎదురుచూసిన అర్జెంటినా కెప్టెన్ లియోనెల్ మెస్సీ (Lionel Messi) హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం (Uppal Stadium)లో క్రీడాభిమానులను ఉర్రూతలూగించారు. ఉప్పల్ స్టేడియంలోకి  మెస్సీ అడుగుపెట్టడం నుంచి ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఎగ్జిబిషన్‌ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో సింగరేణి ఆర్ఆర్-9 టీమ్ తరఫున బరిలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి గోల్ సాధించి హైలైట్‌గా నిలిచారు.

ఫుట్‌బాల్ దిగ్గజాలు రోడ్రిగో డి పాల్ (అర్జెంటీనా), లూయిస్ సువారెజ్ (ఉరుగ్వే) లతో కలిసి శనివారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న లియోనెల్ మెస్సీ ఉప్పల్ స్టేడియంలో అడుగుపెట్టినప్పటి నుంచి చివరి వరకు గ్యాలరీలో ఉన్న క్రీడాభిమానులకు అభివాదం చేస్తూ వారిలో జోష్ నింపారు. ప్రారంభంలో సింగరేణి ఆర్ఆర్ 9 టీమ్‌కు, అపర్ణ ఆల్ స్టార్స్ టీమ్‌కు మధ్యన సాగిన ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ను సాకర్ దిగ్గజం మెస్సీ ఆసక్తిగా తిలకించారు.

మెస్సీ టీంపై రేవంత్ రెడ్డి టీం ఘన విజయం

ఆ తరువాత అపర్ణ టీం తరఫున మెస్సీ, సింగరేణి జట్టు తరఫున రేవంత్ రెడ్డి బరిలోకి దిగి అభిమానుల్లో ఉత్సాహం నింపారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆర్ఆర్-9 టీమ్ 4-0 గోల్స్‌తో విజయం సాధించింది. ఆర్ఆర్ టీమ్‌ తరఫున మధ్యలో చేరిన రేవంత్ రెడ్డి నాలుగో గోల్ సాధించినప్పుడు అభిమానులు, రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున కేరింతలు కొట్టారు. అతిధిగా హాజరైన లోక్‌సభ ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ మ్యాచ్‌ జరుగుతున్నంత సేపు గ్యాలరీ నుంచి తిలకించారు.

రేవంత్ రెడ్డి గోల్ చేసిన అనంతరం మెస్సీ (Lionel Messi) మైదానంలోకి వచ్చారు. మెస్సీకి క్రీడాభిమానుల హర్షధ్వానాలతో స్వాగతం పలకడంతో స్టేడియం దద్దరిల్లింది. మొదట ఫుట్‌బాల్ టీమ్‌లకు చెందిన పిల్లలతో మెస్సీ కరచాలనం చేస్తూ సరదాగా గడిపారు. ఎగ్జిబిషన్ ఫుట్‌బాల్ మ్యాచ్‌ అనంతరం మెస్సీ బృందాల వారిగా పిల్లలతో ఫుట్‌బాల్‌ డ్రిబ్లింగ్ చేస్తూ ఆడారు. ఆ తరువాత ఉప్పల్ స్టేడియమంతా కలియతిరుగుతూ క్రీడాభిమానుల్లో జోష్‌ను నింపారు మెస్సీ, రోడ్రిగో డి పాల్ (అర్జెంటీనా), లూయిస్ సువారెజ్ (ఉరుగ్వే). ఒకచోట కాకుండా స్టేడియం నలుమూల తిరుగుతూ ఫుట్‌బాల్‌ను గ్యాలరీలోకి కిక్ చేస్తూ ప్రేక్షకులకు ఫుట్‌బాళ్లను అభిమానులకు బహూకరించారు.

మెస్సీతో పాటు రొడ్రిగో, సువారెజ్‌లు సైతం ఫుట్‌బాల్ అభిమానులను అలరించారు. వారు ఉప్పల్ స్టేడియంలో అన్ని వైపుల తిరుగుతూ ఫుట్‌బాల్ టీమ్‌లకు చెందిన పిల్లలతో బృందాల వారిగా రౌండప్‌ చేసి ఆడుతూ జోష్ నింపారు. 14 సంవత్సరాల తర్వాత భారత్‌లో అడుగు పెట్టిన లియోనెల్ మెస్సీ క్రీడాభిమానులను మెప్పించారు. మెస్సీ హైదరాబాద్ పర్యటన (#MessiInHyderabad) అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో విజయవంతంగా సాగింది. మెస్సీతో పాటు హైదరాబాద్‌కు చేరుకున్న ఫుట్‌బాల్ క్రీడాకారులు సువారెజ్‌ (#LuisSuarez), రోడ్రిగో డి పాల్ (#RodrigaDePaul) లు, రేవంత్ రెడ్డి ఉప్పల్ స్టేడియంలో దిగిన సమయంలో మెస్సీ.. మెస్సీ.. అంటూ స్టేడియం దద్దరిల్లింది.

చివరగా మెస్సీ పిల్లల టీములతో విడివిడిగా ఫోటోలు దిగారు. మెస్సీ చేతుల మీదుగా ఆర్ఆర్ 9 టీమ్ GOAT కప్‌ను అందుకుంది. అలాగే అపర్ణ ఆల్ స్టార్స్ టీమ్‌కు రన్నరప్ కప్ అందజేశారు. అర్జెంటినా టీమ్ (నంబర్ 10) టీమ్ జర్సీని రాహుల్ గాంధీకి, సీఎం రేవంత్ రెడ్డికి మెస్సీ బహూకరించారు.

ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌కు ముందు మ్యూజిక్ కన్సర్ట్, అద్బుతమైన లేజర్ షోతో కార్యక్రమం నిర్వహించారు. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul sipligunj) నాటు నాటు... పాటతో అభిమానులను అలరించారు. అలాగే సింగర్ మంగ్లీ (Mangli) తన పాటలతో అభిమానుల్లో జోష్ నింపారు. ప్రతాప్ రాణా ప్రత్యేకంగా కంపోజ్ చేసిన పాటను లియోనెల్ మెస్సీ కోసం అంకితం చేయడం తెలిసిందే.

భారత్‌ పర్యటన, అభిమానులు చూపిన ఆదరణ తనకెంతో ఆనందం కలిగించిందని లియోనెల్ మెస్సీ వ్యాఖ్యానించారు. మీతో గడపడాన్ని ఎంతో గౌరవంగా, అదృష్టంగా భావిస్తున్నానని, చూపించిన ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణకు స్వాగతం, తెలంగాణ ఈజ్‌ రైజింగ్‌.. కమ్ జాయిన్ ద రైజ్‌... అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ బృందాన్ని ఉద్దేశించి మాట్లాడారు. క్రీడాభిమానులకు మెస్సీ బృందం అభివాదంతో కార్యక్రమం ఘనంగా ముగిసింది. కోల్‌కతా తరహా ఘటనలు జరగకుండా తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయడంతో నగరంలో మెస్సీ పర్యటన విజయవంతమైంది పేర్కొన్నారు. #GOATIndiaTour #MessiInIndia #TelanganaRising