Telangana panchayat Elections 2025 | హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. అందులోనూ ఆదివారం కావడంతో హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు ఓటు వేసేందుకు గ్రామాలకు తరలివెళ్లారు. రెండో విడతలో 193 మండలాల పరిధిలోని 3,911 గ్రామ పంచాయతీ సర్పంచులు, 29,917 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 38,337 పోలింగ్ కేంద్రాలలో మొత్తం 57,22,465 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
సర్పంచ్ పదవుల కోసం 12,782 మంది అభ్యర్థులు, వార్డు సభ్యుల స్థానాల కోసం 71,071 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతుంది. అనంతరం నేటి మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించి, తరువాత ఫలితాలను ప్రకటిస్తారు. ఫలితాలు వచ్చాక, వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉపసర్పంచ్ ఎన్నికను పూర్తి చేస్తారు.
రెండో విడతలో ఏకగ్రీవాలు, ఎన్నికల నిర్వహణ వివరాలురెండో దశ ఎన్నికల కోసం మొత్తం 4,333 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలు, 38,350 వార్డు సభ్యుల పదవులకు నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే, పలు చోట్ల ఏకాభిప్రాయం కుదరడంతో 415 గ్రామ సర్పంచ్ పదవులతో పాటు 8,307 వార్డు సభ్యుల పదవులు ఏకగ్రీవమయ్యాయి. మరో 5 గ్రామాలు, 108 వార్డుల్లో నామినేషన్లు రాకకపోవడంతో ఎన్నికలు జరగడం లేదు. అలాగే, మరో 2 గ్రామాలు, 18 వార్డుల్లో ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేశారు. మిగతా అన్ని పంచాయతీల్లోనూ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 4,593 మంది రిటర్నింగ్ అధికారులు, 30,661 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు 2,489 మంది సూక్ష్మ పరిశీలకులు ఉన్నారు. ఈ దశలో మొత్తం 40,626 బ్యాలెట్ పత్రాలను ఉపయోగిస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, సున్నితమైన 3,769 కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియను వెబ్‌కాస్టింగ్ ద్వారా అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
తెలంగాణ పంచాయతీ ఎన్నికల మొదటి దశ వివరాలురెండో దశకు ముందు, తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ డిసెంబర్ 11, 2025న విజయవంతంగా జరిగింది. ఈ దశలో మొత్తం 4,236 గ్రామ పంచాయతీలు, 37,440 వార్డులకు నోటిఫికేషన్ విడుదల కాగా, 3,836 సర్పంచ్, 27,960 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ మొదటి దశలో కూడా 395 సర్పంచులు, 9,331 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మొదటి దశ ఎన్నికల్లో సుమారు 84.28 శాతం ఓటింగ్ నమోదైంది. ఆరోజు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిపి, అదే రోజు ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలను ప్రకటించారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ మద్దతుదారులు అధిక స్థానాల్లో విజయం సాధించగా, ప్రతిపక్ష బీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితమైంది.