ఉప్పలగుప్తం: ఆడపిల్లలకు రక్షణ కరవవుతోంది.. కంటికి రెప్పలా కాపాడాల్సిన వారే అత్యంత హేయమైన చర్యలకు పాల్పడుతున్నారు.. మైనర్ బాలికలపై పెరుగుతోన్న అఘాయిత్యాల్లో ఎక్కువగా అయినవారే ఉండడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.. తాజాగా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన ఓ సంఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసింది..
కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే కామాంధుడై..
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కామాంధుడై కుమార్తెను లైంగికంగా వేధించాడు.. మాయమాటలతో లొంగదీసుకుని ఆపై బెదిరిస్తూ మైనర్ బాలికపై ఏడాది నుంచి తన లైంగిక వాంఛ తీర్చుకుంటున్నాడు.. ఈ దారుణ ఘటన అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం కూనవరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. ఈ ఘాతుకానికి పాల్పడ్డ తండ్రి అయితాబత్తుల బాలయ్య పై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత బాలిక సోదరుడు ఈ అమానవీయ చర్యను గమనించడంతో విషయం బహిర్గతం అయింది. కన్న తండ్రే లైంగిక వేధింపులకు పాల్పడుతూ పశువులా మారి వేధిస్తుండగా బయటకు చెబితే ఏమవుతోందోనన్న భయంతో ఆ బాలిక బయట పెట్టకుండా ఉండిపోయింది..
తల్లి స్థానికంగా లేకపోవడంతో బరితెగించి..
బాధిత బాలిక తల్లి ఉపాధి నిమిత్తం ఏడాది క్రింతం కువైట్‌కు వెళ్లింది. కష్టం ద్వారా వచ్చిన డబ్బుతో తాగి తందనాలు ఆడే భర్తతో పిల్లల్ని ఎలా పెంచుకోవాలో తెలియని స్థితిలో కువైట్ వెళ్లి కుటుంబాన్ని తీర్చిదిద్దుకోవాలనకున్న తల్లికి ఆశలన్నీ అడియాశలే అయ్యాయి. తల్లి ఏడాదిగా కువైట్‌లో ఉంటుండగా తండ్రి బాలయ్య వద్దనే కుమారుడు, పదిహేనేళ్ల కుమార్తె కలిసి ఉంటున్నారు. భార్య లేకపోవడంతో ఇక మరింత మద్యానికి బానిసైన బాలయ్య ఎదుగుతోన్న కుమార్తెపై కన్నేశాడు. ఏడాది కాలంగా బాలికను బెదిరించి లైంగిక వాంఛ తీర్చుకుంటున్నాడు.
ఇటీవల ఈ విషయాన్ని గమనించిన బాలిక సోదరుడు తండ్రి పాల్పడుతున్న దుర్మార్గపు చర్యను సమీప బంధువులకు తెలపడంతో ఈ విషయం బట్టబయలయ్యింది.. విస్తుపోయిన బంధువులు, సమీపస్తులు వెంటనే ఈ విషయాన్ని గ్రామ మహిళ పోలీసుకు సమాచారం అందివ్వడంతో ఆమె వచ్చి బాధిత బాలికను తొలుత విచారించింది. దీంతో అసలు విషయం బట్టబయలైంది. తనపై కన్న తండ్రి చేస్తున్న అఘాయిత్యాన్ని మహిళా పోలీస్‌కు వివరించిన ఆ బాలిక బయటకు చెబితే చంపేస్థానని బెదిరించాడని వాపోయింది. దీంతో ఉన్నతాధికారులకు మహిళా పోలీసుల తెలపడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు..
తండ్రి చేస్తున్న అమానవీయ చర్యను గల్ఫ్‌లో ఉంటోన్న తల్లికి తెలిపాడు కుమారుడు. దీంతో కుటుంబికుల సహకారంతో బాధితురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే శనివారం అమలాపురం టీఎస్‌కే ప్రసాద్, రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్, ఎస్సై సీహెచ్ రాజేష్ కూనవరం వచ్చి విచారణ చేపట్టారు. బాలికను విచారించిన పోలీసులు నిందితుడైన తండ్రి బాలయ్యపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఉప్పలగుప్తం ఎస్సై రాజేష్‌కుమార్ తెలిపారు.