Telangana Maoists: తెలంగాణలో మావోయిస్టు ఉద్యమంపై ఆపరేషన్ కగార్ ప్రభావం గట్టిగానే ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకో వారం వ్యవధిలోనే నలుగురు కీలక మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. తెలంగాణలో ఉద్యమం చివరి దశకు వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. మరికొందరు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా అంటున్నారు.
మావోయిస్టు ఉద్యమాన్ని అంతం చేసే లక్ష్యంతో 2024 జనవరి నుంచి అడవిని జల్లెడ పడుతోంది కేంద్రం. ఈ ఆపరేషన్‌తో మావోయిస్టులోని కీలక నేతలను హతమార్చారు. దీంతో ఉద్యమం క్షీణిస్తూ వస్తోంది. ఈ మధ్య ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టలలో జరిగిన దాడులు ఉద్యాన్ని మరింతగా భయపెట్టింది.
పరిణామాలు గ్రహించిన కొందరు మావోయిస్టులు ఉద్యమంలో ఉండలేకపోతున్నారు. వారంతా జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. గత ఆరు నెలల్లో భారీ సంఖ్యలో ఉద్యమ తుపాకీ వదిలి పోలీసుల ముందు లొంగిపోతున్నారు. ఆపరేషన్ కగార్ ప్రారంభమైనప్పటి నుంచి తెలంగాణలో మావోయిస్టు ఉద్యమంపై ఒత్తిడి పెరిగింది. అందుకే ఆరు నెలలలో సుమారు 120 మంది మావోయిస్టులు ఆయుధాలు విడిచిపెట్టారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఆదిలాబాద్ జిల్లాలు ముందు నిలిచాయి. ప్రభుత్వం చేపట్టిన ‘పునరావాస యోజన’ నగదు ప్రోత్సాహకాలు కూడా లొంగుబాటుకు కారణమవుతున్నాయి.
ఆపరేషన్ కగార్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన వివిధ ఎన్‌కౌంటర్‌లలో 85 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్‌లు కర్రెగుట్టలు, వాజెడు అటవీ ప్రాంతాల్లో ఎక్కువ జరిగాయి. కొన్ని సందర్భాల్లో ఐఈడీ దాడుల్లో భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు.
‘ఆపరేషన్ కగార్’ ప్రభావం మావోయిస్టు పార్టీపై స్పష్టంగా కనిపిస్తోంది. కేంద్ర భద్రతా బలగాలు డ్రోన్‌లు, ఉన్నత సాంకేతికత, 20,000కుపైగా జవాన్‌లతో ఈ ఆపరేషన్ చేపడుతోంది. మావోయిస్టులు ఎటూ తప్పించుకోకుండా అష్టదిగ్బంధం చేస్తోంది. వారికి నిలువ నాడ లేకుండా ఆహారం, మందులు దొరక్కుండా కట్టడి చేస్తున్నారు. ఈ కారణంతోనే ఆరు నెలల్లో 400కుపైగా మావోయిస్టు శిబిరాలు ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు.
ఇలాంటి పరిస్థితుల్లో మావోయిస్టు ఉద్యమం ఆర్థికంగా మానసికంగా బలహీనపడుతోంది. ఈ పరిస్థితి గమనించిన మావోయిస్టులు జనంబాట పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీలను తీసుకొని ప్రశాంతమైన జీవితం గడుపుతామని అంటున్నారు. ఈ వారం వ్యవధిలోనే నలుగురు కీలకమైన మావోయిస్టుల నేతలు లొంగిపోయారు.
జన నాట్య మండలి వ్యవస్థాపకుడు సంజీవ్, ఆయన భార్య డీనా రాచకొండ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీళ్లిద్దరు గద్దర్‌తోపాటు పని చేశారు. జన నాట్య మండలి వ్యవస్థాపకుడుగా ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. రెండు రోజుల క్రితం ఆత్రం లచ్చన్న, చౌదరీ అంకు భాయి రామగుండం పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇలా వారం వ్యవధిలోనే నలుగుర కీలకమైన నేతలు లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీ ఎంత ఒత్తిడిలో ఉందో అర్థమవుతోంది.