తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు ఈ నెల 26న వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఫలితాలను విడుదల చేయడానికి తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఇంటర్ బోర్డు అధికారులు అనుమతి కోరినట్లు సమాచారం.


ఇప్పటకే ఇంటర్ ఫలితాల ప్రకటనపై అధికారులు ట్రయల్‌ రన్‌ చేస్తున్నారు. ఈ నెల 25నే ఇంటర్‌ ఫలితాలు వెల్లడించాలని మొదట అధికారులు భావించారు. అయితే, కొంతమంది విద్యార్థుల మార్కులను కంప్యూటర్‌ ద్వారా ఫీడ్ చేయడంలో తప్పులు దొర్లినట్లు తెలుస్తోంది. దీంతో వాటిని సరిచేసేందుకు అధికారులు ప్రయత్నాలు జరిపారు. కాగా, ఇంటర్ పరీక్షల ఫలితాల వెల్లడి ఆలస్యమైనా ఫర్వాలేదని, తప్పులు మాత్రం దొర్లకూడదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారలుకు తెలిపినట్లు సమాచారం. 


గత ఏడాది కరోనా నేపథ్యంలో ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం 49 శాతం మాత్రమే రావడం కలకలం రేపిన విషయం తెలిసిందే. చివరకు కనీస మార్కులతో అందరినీ పాస్ చేశారు. ఇలాంటి పరిస్థితి మరోసారి రాకూడదని అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే ఫలితాలను పరిశీలించి సక్రమంగా ప్రక్రియ ముగిసిందని నిర్థారించుకుంటేనే ఈ నెల 26వ తేదీన ఫలితాలను విడుదల చేయాలని మంత్రి చెప్పినట్లు తెలిసింది. 


ఇంటర్‌ ఫలితాలు ఎప్పుడు వస్తాయా అని తల్లిదండ్రులు, విద్యార్థులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మొత్తం ఈ సంవత్సరం ఇంటర్‌ పరీక్షలను 9,07,393 మంది రాశారు. ఇందులో 4,42,768 మంది సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులు ఉన్నారు. మిగిలిన వాళ్లు మొదటి సంవత్సరం విద్యార్థులు.


ఇంటర్‌ పరీక్షలు మే 6న ప్రారంభమై 24 నాటికి పూర్తయ్యాయి. పరీక్షలు పూర్తైన ఇరవై రోజుల్లో ఫలితాలు ఇస్తామని గతంలోనే తెలంగాణ ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. దీనిబట్టి జూన్‌ 25 లోపు ఫలితాలు వస్తాయని అంతా భావించారు కానీ.. ఇంత వరకు ఇంటర్‌బోర్డు మాత్రం అధికారికంగా ఎలాంటి తేదీ ప్రకటించలేదు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వచ్చిన తేదీలను కూడా బోర్డు ఖండించింది. 


ఫలితాలు విడుదలయ్యాక కేవలం 15 రోజుల్లోనే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. తద్వారా ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు.