తెలంగాణలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. నిన్నటి వరకు తగ్గినట్టే కనిపించిన మహమ్మారి విరుచుకుపడుతోంది. భారీగా కేసులు పెరుగుతున్నాయి. అదేస్థాయిలో పాజిటివిటీ రేటు కూడా పైపైకి ఎగబాకుతోంది.
తెలంగాణలో 24 గంటల్లో కొత్తగా ఐదువందల కేసులు నమోదయ్యాయి. ఎక్కువ కేసులు హైదరాబాద్‌లోనే రిజిస్టర్ అయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా 494 కేసులు వెలుగులోకి వస్తే.. అందులో 315 కేసులు ఒక్క హైదరాబాద్‌లో బయటపడ్డవే. తెలంగాణ రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 1.71శాతానికి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య మూడు వేలు దాటింది.
తెలంగాణలో వారం రోజుల నుంచి కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అందుకే అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్‌లో ఎక్కువ కేసులు వస్తున్న వేళ... వైద్యశాఖ కీలక సూచనలు చేసింది. ముఖ్యంగా ఐటీ ఆఫీసులపై వైద్యాధికారులు దృష్టి పెట్టారు. హైదరాబాద్‌లోని ఐటీసంస్థల్లో కరోనా ప్రోటోకాల్ తప్పనిసరి చేశారు. మాస్కులు ధరించడం.. ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం, శానిటైజేషన్ రూల్స్ కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
బుధవారం కూడా తెలంగాణలో నాలుగు వందలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. 27, 754 మందికి పరీక్షించగా 434 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో 292 కేసులు హైదరాబాద్‌లోనే నమోదయ్యాయి.