Vijayawada News : బెజవాడ దుర్గమ్మకు హైదరాబాద్ లోని ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ బంగారు బోనం ఆనవాయితీగా సమర్పిస్తుంది. ఈ ఏడాది బంగారు బోనాన్ని జులై 3న ఇంద్రకీలాద్రిపై కొలువై కనకదుర్గమ్మకు అందించాలని నిర్ణయించారు. ఈ కమిటీ సభ్యులు బుధవారం విజయవాడలో దుర్గగుడి ఈవో భ్రమరాంబతో సమావేశమై ఈ విషయాన్ని చర్చించారు. బంగారు బోనం అందించే కార్యక్రమ వివరాలను దుర్గ గుడి ఆలయ ఈవో, ఇంజినీరింగ్ అధికారులకు వివరించారు. ఈ ఏడాది బంగారు బోనం సమర్పించే కార్యక్రమాన్ని మరింత వైభవంగా నిర్వహించేలా చర్యలు చేపడుతున్నట్లు కమిటీ ప్రతినిధులు ఈవోకు తెలిపారు.
శాకంబరీ ఉత్సవాలు
ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో శాకాంబరీదేవి ఉత్సవాలు జులై 11 నుంచి 13 వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ఆషాఢమాసాన్ని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ప్రతిష్ఠాత్మకంగా శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా కనకదుర్గ అమ్మవారిని ఆకుకూరలు, పండ్లు, కూరగాయలతో అమ్మవారికి అలంకరిస్తారు.
కార్యక్రమాల వివరాలు ఇలా :
- 11.07.2022(సోమవారం) : ఉదయం గం.7.30లకు విఘ్నేశ్వర పూజ, రుత్విక్ వరుణ, పుణ్యాహవచనము, అఖండ దీపారాధన, అంకురార్పణ. సాయంత్రం గం.4 లకు కలశస్థాపన, అగ్నిప్రతిష్టాపన, మండపారాధన హారతి, మంత్రపుష్పము, ప్రసాద వితరణ.
- 12.07.2022(మంగళవారం): ఉదయం గం.08.00లకు సప్తశతీ పారాయణం, మహావిద్యా పారాయణం, హోమాలు, సాయంత్రం గం.4 లకు మూల మంత్రహవనాలు, మండప పూజ,
హారతి, మంత్రపుష్పం, ప్రసాద వితరణ. - 13.07.2022(బుధవారం) : ఉదయం గం.08.00లకు సప్తశతీ పారాయణం, మహావిద్యా పారాయణం, హోమం, శాంతి పౌష్టిక హోమములు, మంటపపూజ అనంతరం గం.10లకు మహా పూర్ణాహుతి, కలశోద్వాసన, మార్జనం, ప్రసాద వితరణ, ఉత్సవ సమాప్తి.
ఈ మూడు రోజులు అమ్మవారి మూల స్వరూపానికి పండ్లు, కాయగూరలు, ఆకుకూరలతో శాకంబరీ దేవిగా ప్రత్యేక అలంకరణ చేస్తారు. ఈ మూడు రోజులు భక్తులు అందరికీ కదంబం ప్రసాదాన్ని ప్రత్యేకంగా అందిస్తారని ఆలయ అధికారులు తెలిపారు.
శాకంబరీ ఉత్సవాలు ఎందుకు చేస్తారు?
పూర్వం దుర్గమాసురుడనె రాక్షసుడు బ్రహ్మదేవుని కోసం వందల సంవత్సరాల తపస్సు చేశారు. ఆ తపస్సు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమనగా వేదాలు అందరూ మర్చిపోవాలని, వేద జ్ఞానం అంతా తనకే రావాలని వరం కోరుతాడు. బ్రహ్మ వరంతో అతి తక్కువ సమయంలో అందరు వేదాలు మర్చిపోయారు. యజ్ఞయాగాదులు లేక దేవతలకు పూజలు లేక వర్షాలు కురవడం లేదు. ప్రపంచమంతా కరువు కాటకాలు సంభవించాయి. అది చూసిన రుషులు చలించిపోయి సుమేరు పర్వతం గుహలలోకి వెళ్లి జగన్మాతను ప్రార్థిస్తారు. వారి ప్రార్థన విన్న ఆ తల్లి విని వారి ఎదుట నీలివర్ణంతో అనేకమైన కళ్లతో శతాక్షి అనే నామంతో చతుర్భుజములుతో కనిపించింది. ధనుర్బణాలతో ఉన్న ఆ తల్లి ఈ దుర్గతిని చూసి తొమ్మిది రోజులపాటు కన్నుల నీరు కార్చింది. ఆమె కన్నిటితో అన్ని నదులు నిండిపోయాయి. వారి దుస్థితిని చూడలేక ఆ తల్లి శాకంబరీగా అవతరించింది. అమ్మ శరీరభాగాలుగా కూరలను, పండ్లను, గింజలను, గడ్డి మొదలైనవి ఉండగా తన శరీరభాగాలను అంటే శాకములను అన్ని జీవాలకు ఇచ్చింది. ఆ రాక్షసుడిని చంపి అమ్మవారు శాకంబరీదేవిగా ఆవిర్భవించి ప్రజల ఆకలిని తీర్చింది అని చెబుతారు. అందుకే ఆషాఢమాసంలో దేవీక్షేత్రాలలో అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరించి పూజిస్తారు.