తెలంగాణ హైకోర్టులో కాంగ్రెస్‌కు ఊరట లభించింది. కాంగ్రెస్ వార్‌రూంపై దాడి కేసులో స్టే విధించింది. అందులో పని చేసే ముగ్గురు సిబ్బందికి పోలీసులు ఇచ్చిన నోటీస్‌పై కూడా స్టే విధించింది. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. 


ఈ మధ్య కాలంలో కాంగ్రెస్‌ నిర్వహిస్తున్న వార్‌రూంపై తెలంగాణ పోలీసులు దాడి చేశారు. నలుగురు సిబ్బందికి నోటీసులు జారీ చేశారు. దీనిపై ఆఫీస్‌లో పని చేసే ఇషాన్ శర్మ, ప్రతాప్‌, శశాంక్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు జారీ చేసిన నోటీసులు కొట్టేయాలని తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఇరు వర్గాల వాదనలు విన్న పిటిషనర్ల వాదనలతో ఏకీభవించింది. 


పూర్తిగా విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు విచారణ, నలుగురికి ఇచ్చిన నోటీసులపై స్టే విధించింది. హైదరాబాద్‌ నగర పోలీసు సైబర్‌ క్రైమ్‌ డిపార్ట్‌మెంట్‌ ఇచ్చిన సీఆర్‌పీసీ 41ఏ నోటీసులపై స్టే విధించింది. కేసు ఇన్వెస్టిగేషన్‌ను కూడా కోర్టు నిలుపుదల చేసింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.


తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కొనుగోలు కార్యాలయంపై పదిరోజుల క్రితం సైబర్ క్రైమ్ పోలీసులు దాడులు చేశారు. మాదాపూర్ ఇనార్బిట్ మాల్ సమీపంలో ఎస్ కే కార్యాలయంలో కంప్యూటర్, లాప్ టాప్‌లు సీజ్ చేశారు పోలీసులు. సీఎం కేసిఆర్ కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ లు పెడుతున్నారని ఆరోపణలతో పోలీసులు కార్యాలయానికి సీజ్ చేశారు. కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది బయటకు పంపించారు పోలీసులు. కొంత కాలంగా ఎస్కే టీమ్ కాంగ్రెస్ కోసం పని చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు నోటీసులు ఇవ్వకుండా కార్యాలయాన్ని సీజ్ చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు, కాంగ్రెస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. సునీల్ ఆపన్నహస్తం పేరిట రెండు ఫేస్ బుక్ పేజ్ లను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. 


సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ నేతలపై కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారన్న కారణంతో ఎస్కే ఆఫీస్‌పై దాడి చేశారు. కాంగ్రెస్ ఎన్నికల వ్యుహకర్త సునీల్ కనుగోలు నిర్వహిస్తున్న కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ప్రతాప్‌, శశాంక్‌, ఇషాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా సునీల్‌ కనుగోలును ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చినట్టుగా పోలీసులు తెలిపారు. వారికి సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీచేశారు.


కాంగ్రెస్  వ్యూహకర్త సునీల్ కొనుగోలు కార్యాలయాన్ని కుట్ర పూరితంగా సీజ్ చేశారని కాంగ్రెస్ సీనియర్ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వం, పోలీసు చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంపై పోలీసుల దాడి, సీజ్ చేయడాన్ని  తీవ్రంగా ఖండించారు. ఎలాంటి ఎఫ్ఐఆర్ లేకుండా ఎలా కార్యాలయాన్ని తనిఖీ చేస్తారని నేతలు నిలదీశారు.