Telangana High Court Shock To Government : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగిలింది. గవర్నర్ కోటా (Governor quota)లో శాసనమండలి సభ్యుల (Legislative Council) నియామకాలపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం (Kodandram ), ఆమిర్ అలీఖాన్ (Amir Alikhan) లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కోదండరాం, అలీఖాన్ నియామకంపై హైకోర్టును ఆశ్రయించిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ
గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం మంత్రిమండలిలో కూడా తీర్మానం చేసింది. దాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్...గతేడాది సెప్టెంబర్ 19న తిరస్కరించారు. గవర్నర్ నిర్ణయాన్ని దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ, హైకోర్టులో సవాల్ చేశారు. గవర్నర్ పరిధి దాటి వ్యవహరించారని, మంత్రిమండలికి ఎమ్మెల్సీలను నామినేట్ చేసే హక్కు ఉంటుందని పిటిషన్ లో ప్రస్తావించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
మంత్రి మండలి సిఫార్సు, గవర్నర్ ఆమోదముద్ర
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో...నామినేటెడ్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం, ఆమిర్ అలీఖాన్‌లను శాసనమండలికి నామినేట్ చేసింది. వీరిద్దరి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తూ...ఫైల్ ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పంపింది. రాష్ట్ర మంత్రిమండలి సిఫార్సు చేయడంతో కోదండరాం, అలీఖాన్ పేర్లను గవర్నర్ ఆమోదముద్ర వేశారు. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం కూడా లభించడంతో...వారిద్దరు మండలికి ఎన్నికైనట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 156, 157, 74 సెక్షన్ల ప్రకారం వీరిద్దరి పదవీకాలం నోటిఫికేషన్ జారీ అయిన తేదీ నుంచి ఆరేళ్లు ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు
ప్రొఫెసర్ కోదండరాం, ఆమిర్ అలీఖాన్‌లను నియామకాన్ని సవాల్ చేస్తూ...బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తాము వేసిన పిటిషన్‌పై నిర్ణయం ఇంకా రాలేదని, అప్పటి వరకు వరకు ఎమ్మెల్సీ నియామకాలను ఆపాలని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై పిటిషనర్లు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ న్యాయవాదులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ కార్యాలయం తరఫున న్యాయవాదులు సుదీర్ఘంగా వాదనల వినిపించారు. మూడు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం...రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ను కొట్టివేస్తూ తీర్పు ప్రకటించింది. ప్రొఫెసర్ కోదండరాం, ఆమిర్ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియామించడంపై ప్రభుత్వం పునఃసమీక్షించాలని సూచించింది. గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం చెప్పిన న్యాయస్థానం...గత మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ నేరుగా తిరస్కరించాల్సి కాదని, వెనక్కి పంపి ఉంటే బాగుండేదని కోర్టు అభిప్రాయపడింది.