Hyderabad Police Arrested Two Engineering Students Who Supply Ganza: జల్సాలకు అలవాటు పడిన ఆ విద్యార్థులు పక్కదారి పట్టారు. గంజాయి సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కారు. హైదరాబాద్ (Hyderabad) నగర శివారు ఘట్ కేసర్ లో గంజాయి అక్రమ రవాణా చేస్తోన్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులను అబ్కారీ పోలీసులు అరెస్ట్ చేశారు. నల్గొండకు చెందిన నరేందర్, మెదక్ కు చెందిన విద్యాన్ సింగ్ ఘట్ కేసర్ సమీపంలోని ఓ కళాశాలలో బీటెక్ రెండో ఏడాది చదువుతున్నారు. అన్నోజిగూడలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. వీరికి గంజాయి తాగే అలవాటు ఉండగా.. అదే అలవాటున్న సాయికుమార్ అనే యువకుడితో వీరికి పరిచయం ఏర్పడింది. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నానని నమ్మించి విద్యార్థులతో కలిసి ఉంటున్నాడు. గంజాయికి భారీ డిమాండ్ ఉందని.. తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని వారికి చెప్పగా విద్యార్థులు ఆ ఊబిలోకి దిగారు. సాయికుమార్ ఏపీలోని అరకు నుంచి గుట్టుచప్పుడు కాకుండా గంజాయి తీసుకొచ్చి విద్యార్థులకు అందిస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా ఆబ్కారీ ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేసి మూడున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించామని.. సాయికుమార్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.
గంజాయి సాగు.. రైతు అరెస్ట్
మరోవైపు, వ్యవసాయ భూమిలో గంజాయి సాగు చేస్తోన్న ఓ రైతును పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి (Rangareddy) జిల్లా శంకర్పల్లి మండలం రావులపల్లి కలాన్ గ్రామంలో సుధీర్ అనే రైతుల కొన్నాళ్ల నుంచి ఇతర పంటల మాటున గంజాయి సాగు చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న సైబరాబాద్ SOT పోలీసులు బుధవారం ఉదయం గ్రామానికి వెళ్లి తనిఖీలు చేపట్టారు. పొలంలో వందల సంఖ్యలో గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు గుర్తించారు. సదరు రైతును అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Hyderabad News: రష్యా - ఉక్రెయిన్ యుద్ధంలో హైదరాబాద్ యువకుడు మృతి