TS High Court: హైదరాబాద్‌: తెలంగాణలో ఏళ్ల తరబడి సమస్యగా ఉన్న పోడు భూములకు పట్టాల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తుండగా.. పోడు భూములను క్రమబద్ధీకరించడం చట్ట విరుద్ధమని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడి పిటిషన్ ను రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారించింది. పోడు భూములకు పట్టాల పంపిణీపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. కానీ పోడు భూముల క్రమబద్దీకరణ జరగాలంటే ఆదివాసీల అటవీ హక్కుల చట్టం, నిబంధనలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.


పోడు భూములను క్రమబద్ధీకరించడం చట్ట విరుద్ధమని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అభిప్రాయపడుతోంది. ఇదే విషయాన్ని వారి తరఫు న్యాయవాది హైకోర్టులో నేడు వాదనలు వినిపించారు. ఈ భూముల క్రమబద్దీకరణ చేయడం అనేది సుప్రీంకోర్టు తీర్పునకు సైతం ప్రభుత్వ మెమో విరుద్ధంగా ఉందని లాయర్ వాదించారు. మరోవైపు సాగు చేసుకుంటున్న వారికే పోడు భూముల పట్టాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ ములుగు జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త కె. శ్రవణ్ కుమార్ ఇంప్లీడ్ పిటిషన్‌ వేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డుకోకూడదని, సాగు చేసుకుంటున్న వారికి పోడు భూమి పట్టాలు ఇచ్చేలా సమర్థించాలని కోర్టును శ్రవణ్ కుమార్ కోరారు. 


అడవులు, పోడు భూములపై ఆధారపడిన గిరిజనులకు ప్రయోజనాలు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం భావించడం ఆదివాసీల అటవీ హక్కుల చట్టం ఉద్దేశమని శ్రవణ్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్, శ్రవణ్ కుమార్ తరఫు లాయర్ వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం పోడు భూముల పట్టాల పంపిణీపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. తదుపరి విచారణను జూన్ 22కి వాయిదా వేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.


తెలంగాణలో లక్షల కుటుంబాలు పోడు భూములపై ఆధారపడి బతుకుతున్నాయి. ఈ భూములు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. ఆ భూమిపై తమకు హక్కులు కల్పించాలని ఎన్నో ఏళ్ల నుంచి ఆదివాసీలు, గిరిజనులు పోరాడుతున్నారు. తెలంగాణలోనూ దాదాపు 10 జిల్లాల్లో పోడు భూములు ఉన్నాయి. ప్రభుత్వం హరితహారం పథకం తీసుకొచ్చి అటవీ భూముల్లో మొక్కులు నాటుతోంది. దీని వల్ల అటవీ అధికారులు, ఆ ప్రాంతంలోని గిరిజనులకు మధ్య వివాదం కొనసాగుతోంది. గత ఏడాది పోడు భూముల పరిరక్షణకు వెళ్లిన ఓ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే..


నవంబర్ లో విషాదం.. 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం జరిగింది. ఓ ప్రభుత్వ అధికారి గ్రామస్థుల ఆగ్రహానికి గురై ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. పోడు భూముల వివాదం నేపథ్యంలో వలస గొత్తికోయలు దాడి చేయడంతో తీవ్ర గాయాలు పాలైన ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి శ్రీనివాసరావు మృతి చెందారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామం ఎర్రబోడులో ప్లాంటేషన్‌ మొక్కలను గుత్తికోయలు నరుకుతుండటంతో వాటిని అడ్డుకునేందుకు ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి శ్రీనివాసరావు తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. మొక్కలను నరకవద్దని గుత్తికోయలను హెచ్చరించడంతో గుత్తికోయలు ఆగ్రహం చెందారు. సహనం  కోల్పోయి ఒక్కసారిగా వేట కొడవళ్లతో ఫారెస్ట్ రేంజ్‌ అధికారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి తీవ్ర గాయాల పాలు అయ్యారు. వెంటనే తోటి సిబ్బంది ఆయన్ను చండ్రుగొండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.