Munugode Voter List News: మునుగోడులో కొత్త ఓట్ల నమోదు వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. పెండింగ్ లో ఉన్న ఓటరు జాబితాను నిలిపివేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఇటీవల 25 వేల వరకూ కొత్త ఓటర్ల నమోదు కాగా, అందులో 12 వేలకు ఓటర్ల నమోదుకు మాత్రమే అనుమతించింది. మరో 7 వేల దరఖాస్తులను తిరస్కరించింది. మరో 6 వేల వరకూ అప్లికేషన్లు ఇంకా పెండింగులో ఉంచింది. ఈ పెండింగ్ లో ఉంచిన దరఖాస్తులను నిలిపివేయాలని సూచించింది. అయితే, నేడు సాయంత్రం వరకూ వచ్చిన దరఖాస్తుల వివరాలపై 21వ తేదీ కల్లా నివేదిక ఇవ్వాలని హైకోర్టు (Telangana High Court) ధర్మాసనం ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తర్వాతి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.


మునుగోడు నియోజకవర్గంలో (Munugode News) ఇప్పటికే బోగస్‌ ఓట్లు నమోదయ్యాయని బీజేపీ ఆరోపిస్తోంది. టీఆర్ఎస్‌కు లాభం చేకూర్చుకొనేలా ఆ ఫేక్ ఓట్లు నమోదు చేయించారంటూ హైకోర్టును ఆశ్రయించింది. ఓట్ల నమోదుకు సంబంధించి హైకోర్టులో రిట్‌ పిటిషన్ దాఖలు చేసింది. ఉప ఎన్నికకు జులై 31 వరకు ఉన్న జాబితానే పరిగణించాలని కోర్టును బీజేపీ కోరింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ లో అభ్యర్థించింది. గత కొద్ది నెలల  సమయంలోనే మునుగోడులో 25 వేల వరకూ కొత్త ఓటర్ల దరఖాస్తులు వచ్చాయని వివరించింది. ఫాం-6 కింద వచ్చిన దరఖాస్తుల్లో తప్పుడు ఓటర్లు ఉన్నారని ఆరోపణ చేసింది. ఈ నెల 14న మునుగోడు ఓటరు జాబితాను ఎన్నికల సంఘం ప్రకటిస్తుందని, ఆ లిస్ట్‌ ప్రకటించకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును బీజేపీ కోరింది.


Also Read: సీఎం కేసీఆర్ విమానం కొనుగోలుపై ఈడీకి ఫిర్యాదు


ఏడు నెలల్లో 1,500 దరఖాస్తులే..
కొత్తగా ఓట్ల కోసం అప్లై చేసుకుంటున్న వారి సంఖ్య ఈ 2 నెలల్లోనే 25 వేలు దాటిందని బీజేపీ (Telangana BJP) చెబుతోంది. బీజేపీ తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్‌రెడ్డి రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అంతకుముందు 7 నెలల కాలంలో 1,500 మంది కూడా కొత్త ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోలేదని, ఈ మధ్య కాలంలోనే పెద్ద మొత్తంలో ఏకంగా 24,781 దరఖాస్తులు వచ్చాయని బీజేపీ వాదిస్తోంది. జూలై 31 నాటికి ఉన్న ఓటర్ల జాబితా ఆధారంగానే మునుగోడు ఎన్నికలు నిర్వహించాలని కూడా కోరింది. ఆ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరింది. 


నిన్న ఓటర్ల జాబితా (Munugode Voter List News) విషయంలో హైకోర్టు (Telangana High Court) ధర్మాసనం విచారణ చేసింది. నియోజకవర్గంలో పూర్తి ఓటర్ల జాబితాకు సంబంధించి రిపోర్టును సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఆ పిటిషన్ పై నేడు విచారణ చేసిన హైకోర్టు ధర్మాసనం నేటికి వాయిదా వేసింది. నేడు కీలక ఆదేశాలు ఇస్తూ తీర్పు ఇచ్చింది. తదుపరి విచారణను అక్టోబరు 21వ తేదీకి వాయిదా వేసింది.