Group 1 mains aspirants protesting for the reschedule of the examination | హైదరాబాద్: త్వరలో తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. హైకోర్టు సైతం పరీక్షల నిర్వహణకు లైన్ క్లియర్ చేసింది. అయితే గ్రూప్ 1 మెయిన్స్ రద్దు చేయాలని అభ్యర్థులు రోడ్డెక్కారు. హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో గ్రూప్ 1 మెయిర్స్ అభ్యర్థులు భారీ సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. అక్టోబర్  21 నుంచి వారం రోజులపాటు జరగనున్న టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. 


గ్రూప్ 1 అభ్యర్థుల డిమాండ్లు ఇవే
రాష్ట్రంలో ఇదివరకే నిర్వహించిన రెండు సార్లు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రద్దు చేశారు. మూడోసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్వహించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఫలితాలు వచ్చాయి. మెయిన్స్ కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల్ని ఎంపిక చేశారు. అయితే ప్రిలిమ్స్ పరీక్షలో తప్పులు జరిగాయిని, తప్పుగా ఇచ్చిన ప్రశ్నలలో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 29ను సవరించిన తర్వాతే గ్రూప్ 1 మెయిన్స్ సహా ఇతర గ్రూప్స్ పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు అశోక్ నగర్‌లో చేస్తున్న నిరసనలో డిమాండ్ చేస్తున్నారు. 


గ్రూప్స్ అభ్యర్థుల అరెస్టులను ఖండించిన కేటీఆర్..


అక్రమంగా అరెస్టు చేసిన ప్రతి ఒక్కరిని వెంటనే విడుదల చేయాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులు కోరుతున్న మేరకు వెంటనే పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. సుదీర్ఘకాలంగా గ్రూప్స్ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్న పరీక్షల రీ షెడ్యూల్ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా అశోక్ నగర్ లో అభ్యర్థులు శాంతియుతంగా నిరసన తెలిపారని.. గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగ విద్యార్థులు, యువతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజా పాలన అంటూ చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, ఉన్నత విద్యావంతులైన యువతి యువకుల నిరసన తెలియజేసే హక్కులను కూడా హరించి వేస్తోందన్నారు.


ప్రభుత్వ నిర్ణయం దారుణమంటూ మండిపాటు


గ్రూప్స్ అభ్యర్థులు తమకు న్యాయం చేయాలంటూ హైకోర్టులో పలు కేసులు వేసి న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం ఒక కేసులో వచ్చిన తీర్పుని అడ్డుగా పెట్టుకుని ఈనెల 21 నుంచి గ్రూప్స్ మెయిన్స్ నిర్వహించేందుకు ప్రయత్నం చేయడం దారుణమన్నారు. స్వయంగా విద్యార్థులే గ్రూప్స్ పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలని కోరుతుంటే, ఇక రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. ఇదే అశోక్ నగర్ యువతీ యువకుల వద్దకు వచ్చి రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నాయకులు వచ్చి ఓట్లు వేయించుకున్నారని కేటీఆర్ గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారి ఆకాంక్షలను పక్కనపెట్టి నిరసన నిరంకుశంగా వ్యవహరించడం దారుణమన్నారు. అశోక్ నగర్ వెళ్లి సుద్దులు చెప్పిన గాంధీ సహా కాంగ్రెస్ పార్టీ పెద్దలు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక వైఖరిని గమనించాలన్నారు.


Also Read: Telangana News: సీఎం రేవంత్ రెడ్డిపై ప్రధాని మోదీకి ఫిర్యాదు, అసలేం జరిగింది?


గ్రూప్ అభ్యర్థులు నిరసన తెలుపుతున్న ప్రతిసారి పోలీసుల అరెస్టులు, దాడులతో ప్రభుత్వ క్రూరమైన వ్యవహారాన్ని తెలంగాణ సమాజం గమనిస్తుందని కేటీఆర్ అన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న గ్రూప్స్ అభ్యర్థులను, మహిళలని కూడా చూడకుండా అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు.