Harish Rao shockened over Road Accident in Medak District శివంపేట: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు అదుపు తప్పి శివంపేట మండలంలోని రత్నాపూర్ వాగులోకి దూసుకెళ్లడంతో విషాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని స్థానికులు చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ఆసుత్రికి తరలించారు. మృతుల్లో నలుగురు మహిళలు ,ఇద్దరు బాలికలు, ఓ వ్యక్తి ఉన్నాడు. మృతులను రత్నాపూర్, తాళ్లపల్లి, పాము తండా వాసులుగా భావిస్తున్నారు. కారు అదుపుతప్పి కల్వర్టను ఢీకొని కాలువలో పడిపోవడంతో తీవ్ర ప్రాణనష్టం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.




పాముబండ తండాకు చెందిన వారు కారులో వెళ్తున్నారు. రోడ్డుపై గుంత రావడంతో కారు ఒక్కసారిగా అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టి, పక్కనే ఉన్న కాల్వలో పడిపోయింది. నీట మునిగి ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. తుప్రాన్ దగ్గర గ్రామ దేవతను దర్శించుకుని ఇంటికి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదం గురించి తెలియగానే సమీప ప్రాంతాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో అక్కడికి వచ్చారు. స్థానికుల సహాయంతో గజ ఈగతగాళ్లు మృతదేహాలను బయటకు తీశారు. వారి బంధువులు అక్కడికి చేరుకని కన్నీటి పర్యంతమయ్యారు. వారిని ఓదార్చడం అక్కడున్న వారి వల్ల కాలేదు. గుండె బరువెక్కించే ఈ ఘటన స్థానికుల్ని సైతం కలచివేసింది.





సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు దిగ్భ్రాంతి


మెదక్ జిల్లా శివంపేట మండలం ఉసిరికపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కారు వాగులో పడిన ప్రమాదంలో పాముబండ తండాకు చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు హరీష్ రావు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టి, వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గాయపడిన వారికి తక్షణం వైద్య సాయం అందించాలన్నారు.


Also Read: Hyderabad Crime: వివాహిత మీద కన్నేసి చివరికి దారుణం, బాలిక హత్య కేసు ఛేదించిన సూరారం పోలీసులు