Hyderabad News: మూసీ బ్యూటిఫికేషన్, హైడ్రా దూకుడుపై పోరాటానికి బీఆర్‌ఎస్ పార్టీ సిద్ధమైంది. హైదరాబాద్‌లోని హైడ్రా, మూసీ బాధితులకు అండగా ఉంటామని కేటీఆర్ ప్రకటించారు. ఈ ఉదయం హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులతో సమావేశమైన ఆయన ఉద్యమకార్యాచరణపై చర్చించారు. 


పార్టీ నేతలతో సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వ ఆనాలోచిత నిర్ణయాల కారణంగా హైదరాబాద్‌లో పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. ప్రణాళిక లేకుండా పేదలకు ఎవరూ అండగా లేరన్నట్లుగా దూకుడుగా వెళ్తోందని విమర్శిచారు.  


నోట్ల రద్దు చేసినప్పుడు మోడీ ఏ విధంగా రకరకాల కారణాలు చెప్పారో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పద్దతిలో ప్రజలను మోసం చేస్తుందన్నారు కేటీఆర్. ఒక రోజు మూసీ సుందరీకరణ అంటారని... ఒక రోజు నల్గొండకు నీళ్లు అని, మరో రోజు రూ. లక్షా 50 వేల కోట్లు ఎక్కడివి అని డీపీఆర్ లేనే లేదంటూ రోజుకో మాటమాట్లాడుతున్నారని మండిపడ్డారు.
మూసీ చుట్టుపక్కల నిర్మించుకున్న ఇళ్లకు ప్రభుత్వమే 50 ఏళ్ల క్రితమే పర్మిషన్లు ఇచ్చిందని ఇప్పుడు కూల్చడం ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు.  కూలగొడతామని దుందుడుకుగా పోతామంటే కుదరదని అన్నారు. హైడ్రా, మూసీ ప్రాజెక్ట్ విషయంలో ఒక భయానక వాతావారణాన్ని సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 






హైడ్రాను పెద్ద, పెద్ద బిల్డర్లను బెదిరించేందుకే ఉపయోగిస్తున్నారని తాము నమ్ముతున్నామన్నారు కేటీఆర్. మూసీ పేరిట ఏ విధంగా లూటీ చేస్తున్నారో ప్రజల దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. మూసీకి సంబంధించి 100 శాతం మురుగు నీటి శుద్ది ప్లాంట్లను రూ. 4 వేల కోట్లతో తాము నిర్మించామని తెలిపారు. 


మూసీ శుద్ది చేశామన్న కేటీఆర్‌... నల్గొండ జిల్లాకు శుద్ది చేసిన నీళ్లే వెళ్తాయన్నారు. దాని కోసం కొత్తగా ఖర్చు పెట్టాల్సిన పని లేదని చెప్పారు. కొండపోచమ్మ సాగర్ నుంచి గండిపేట్‌కు నీళ్లు తెచ్చేందుకు 11 వందల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించినట్టు వివరించారు. రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు.




అన్నీ పట్టించుకోకుండా నల్గొండకు నీళ్లు ఇచ్చేందుకు ఇష్టం లేదా అంటూ ముఖ్యమంత్రి ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదన్నారు కేటీఆర్. గతంలోనే మూసీ సుందరీకరణ చేపట్టాలని సుధీర్ రెడ్డి ఛైర్మన్‌గా ప్రయత్నం చేశామని గుర్తు చేశారు. అప్పుడే గరీబోళ్లకు అన్యాయం జరిగితే ఆ ప్రాజెక్ట్ వద్దని కేసీఆర్ చెప్పారని తెలిపారు. మానవీయ ముఖ్యమంత్రి ఉంటే ఆ విధంగా నిర్ణయాలు ఉంటాయన్నారు. 




 


ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి పంపే బుల్డోజర్లకు అడ్డుగా బీఆర్‌ఎస్ నాయకులు ఉంటారని తెలిపారు కేటీఆర్. తాము నిర్మించిన అన్ని ఎస్టీపీలను కూడా పర్యటిస్తామన్నారు. మా ఫామ్‌ హౌస్‌లు చట్ట విరుద్దంగా ఉంటే కూల్చేయాలన్నారు కేటీఆర్. వాటిని కూలగొడితే రేవంత్‌కు ఆనందం కలుగుతుందంటే ఆ పని చేయాలన్నారు. అంతే కానీ పేద ప్రజల జోలికి మాత్రం వెళ్లొద్దని హితవు పలికారు.