Telangana RTI Commissioner:తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, కమిషనర్‌ల ఎంపిక రేవంత్ సర్కారు కసరత్తు ముమ్మరం చేసింది. ఇవాళ (శనివారం, 5 ఏప్రిల్ 2025) ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గైర్హాజరు అయ్యారు.
సెక్రటేరియట్‌లో జరిగిన సమావేశంలో ఆర్టీఐ టీంతోపాటు లోకాయుక్త, ఉపలోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్, సభ్యుల ఎంపికపైన కూడా చర్చ నడిచింది. ఆయా రంగాల్లో నిపుణులైన వారి పేర్లు ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్టు సమాచారం.
కొత్త బాధ్యల్లోకి శాంతి కుమారి
ఆర్టీఐ ప్రధాన కమిషనర్‌గా మాత్రం శాంతికుమారి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆమె ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఈ ఏడాది చివరికి ఆమె రిటైర్ కాబోతున్నారు. ఇంతలోనే ఆమెను ఆర్టీఐ ప్రధాన కమిషనర్‌గా నియమించే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. ఆమె స్థానం కొత్త సీఎస్‌గా అందరి కంటే ముందు ఉన్న రామకృష్ణారావును నియమించబోతున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
కొత్త సీఎస్‌గా రామకృష్ణ
1989 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన శాంతి కుమారి ఏప్రిల్ 30న రిటైర్ కాబోతున్నారు. ఆమెను కేసీఆర్ 2023 జనవరి 11వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అప్పటి వరకు సీఎస్‌గా సోమేష్ కుమార్ ఉండే వాళ్లు. వాస్తవంగా సోమేశ్ కుమార్ ఏపీకి కేటాయించిన ఉద్యోగి. అక్కడ పని చేయడం ఇష్టంలేకపోవడంతో తెలంగాణలోనే ఉంటానంటూ కోర్టులో పోరాడుతూ వచ్చారు. చివరకు అక్కడ ఎదురు దెబ్బ తగలడంతో సీఎస్ పదవికి అకస్మాత్తుగా రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో ఆయన స్థానంలో సీఎస్‌గా శాంతికుమారికి అవకాశం లభించింది. కొత్త ప్రభుత్వం వచ్చినప్పటికీ ఆమెను మార్చకుండా కొనసాగించారు. ఇప్పుడు ఆమె రిటైర్ కానుండటంతో ఆమెను ఆర్టీఐ ప్రధాన కమిషనర్‌గా పంపిస్తారు. ఆమె స్థానం రామకృష్ణారావును నియమించే అవకాశం ఉంది.
ప్రస్తుతం రామకృష్ణ ఆర్థిక, ప్రణాళిక విభాగానికి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. 1991 బ్యాచ్‌కు చెందిన తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు 10 బడ్జెట్‌లు ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (CGG) డైరెక్టర్ జనరల్‌గా కూడా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆదిలాబాద్, గుంటూరు కలెక్టర్‌గా సేవలు అందించారు. ఆయన కాన్పూర్, ఢిల్లీలోని IITల్లో గ్రాడ్యుయేట్, మాస్టర్స్ డిగ్రీలు పొందారు.
రెండేళ్లుగా ఆర్టీఐ ప్రధాన కమిషనర్ పదవి ఖాళీ
ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్న ప్రధాన సమాచార కమిషన్ పదవీ కాలంలో ఫిబ్రవరితో ముగిసింది. ఇప్పటి వరకు కొత్త వ్యక్తులను నియమించలేదు. ఇప్పుడు దీనిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఒకట్రెండు రోజుల్లో దీనిపై క్లారీటీ రానున్నట్టు తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఖాళీ అయిన సమాచార కమిషన్ సభ్యులను కమిషనర్‌ను రెండు నెలల్లో ఎంపిక చేయాలి. కానీ తెలంగాణ సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ పదవీ కాలం 2023లోనే ముగిసింది. ఇప్పటి వరకు నియామకం చేపట్టలేదు.
రెండేళ్లుగా ఖాళీగా ఉన్న ఆర్టీఐ ప్రధాన కమిషనర్ పదవులు భర్తీ చేయడానికి గతేడాదే తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. దీనికి వివిధ వర్గాల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. చాలా మంది అప్లై చేసుకున్నట్టు సమాచారం. వాటిలో చాలా వరకు అధికారురు స్క్రూట్నీ చేశారు. ఇప్పుడు ప్రభుత్వం ఫైనల్ వడపోతకు శ్రీకారం చుట్టింది. ఈ పేర్లను ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రానుంది.