తెలంగాణ ( Telangana )ఉభయసభల్ని ఉద్దేశించి గవర్నర్ ( Governer ) తమిళిసై సౌందరరాజన్ ( Tamilisai Soundararajan )  ప్రసంగించనున్నారు. కాంగ్రెస్ సర్కార్ (Congress Government) కొలువుదీరిన తర్వాత గవర్నర్ తొలి ప్రసంగం కావడంతో...ఏం మాట్లాడుతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ హాల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సుమారు గంటపాటు సాగిన సమావేశానికి డిప్యూటీ సీఎంతోపాటు మంత్రులు హాజరయ్యారు. ప్రస్తుతం తెలంగాణలోని వాస్తవ పరిస్థితులు ప్రతిబింబించేలా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఉండాలని మంత్రిమండలి నిర్ణయించినట్లు తెలుస్తోంది. 


గవర్నర్ ప్రసంగంలో పొందుపర్చాల్సిన అంశాలు, అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన వ్యూహంపై సమాలోచనలు జరిపినట్టు మంత్రివర్గం ఇప్పటికే చర్చించింది. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గవర్నర్ తొలి ప్రసంగం కావడం ఉత్కంఠ రేపుతోంది.  ప్రభుత్వ ఆలోచన విధానాన్ని ఈ ప్రసంగం ద్వారా ప్రజలకు చేరవేసే అవకాశం ఉంటడంతో ఇందులో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది.ఎన్నికల మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీలను ప్రకటించిన నేపథ్యంలో వీటి అమలుపై ప్రభుత్వం కార్యచరణ సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే ఆయా శాఖల ఆర్థిక పరిస్థితులపై నివేదికలను తెప్పించుకున్న సర్కార్.. ఆరు గ్యారెంటీల అమలుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు తెలుస్తోంది.


గత ప్రభుత్వం హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రేవంత్ రెడ్డి సర్కార్ మొదటి నుంచి ఆరా తీస్తోంది. దీంతో తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసి అసలు విషయాలను ప్రజల ముందు ఉంచేలా ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు గవర్నర్ ప్రసంగంలో స్టేట్ ఫినాన్సియల్ సిట్యుయేషన్‌ను ప్రధానంగా ఫోకస్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీఏసీ సమావేశం కూడా జరగనుంది. అసెంబ్లీ సమావేశాల్ని ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై ఇందులో నిర్ణయిస్తారు.