Review on Pending Irrigation Projects in Telangana: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.2400 కోట్ల రూపాయలతో చేపట్టిన ఇందిరా, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను రీ డిజైనింగ్ పేరిట 13 వేల కోట్లకు ఎందుకు పెంచాల్సి వచ్చిందని భట్టి విక్రమార్క అధికారులను ప్రశ్నించారు. ప్రాజెక్ట్ అంచనా వ్యయం పెంచడం వల్ల అదనంగా ఆయకట్టు పెరిగిందా? అని అడగ్గా.. అధికారులు ఏమాత్రం పెరగలేదని.. అంతే ఆయకట్టు ఉందని సమాధానం చెప్పారు. ఆయకట్టు పెంచకుండా రీ డిజైనింగ్ పేరుతో ప్రాజెక్టు అంచనాలను పెంచి ప్రజల సంపదను దుర్వినియోగం చేయడం సరికాదని అన్నారు. ఇప్పటి వరకు సీతారామ ప్రాజెక్టులో జరిగిన పనుల గురించి వాస్తవాలు చెప్పాలని ఆదేశించడంతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇరిగేషన్ అధికారులు వివరించారు.
రాష్ట్ర సచివాలయంలోని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఛాంబర్ లో ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఇరిగేషన్ అధికారులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని డిండి, ఉదయ సముద్రం, బ్రాహ్మణ వెళ్ళంల, ఎస్ ఎల్బీసీ టన్నెల్, నక్కలగండి, చర్ల, రిజర్వార్లు, బునాది గాని పిలాయిపల్లి, ధర్మారెడ్డి పల్లి మూసి కాలువల పెండింగ్ పనులు పురోగతి గురించి వాడి వేడిగా చర్చించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తయిన బ్యారేజీ కెనాల్స్ పనులు, పెండింగ్లో ఉన్న పనులు, చేయాల్సిన భూసేకరణ, కోర్టు కేసులు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతుల గురించి మంత్రులకు వివరించారు. బ్యారేజ్ నిర్మాణానికి ఇంకా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రావాల్సి ఉందని, రెండు నెలల్లో వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. హెడ్ వర్క్ దగ్గర పనులు పూర్తి చేయకుండా చివరి కాలువల వద్ద పనులు పూర్తి చేసి ప్రాజెక్టు పురోగతిలో ఉందని చెప్పడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి అన్న దానిపై అధికారులు సమాధానం చెప్పకుండా నీళ్లు మింగారు. నిజాలను దాచిపెట్టకండి వాస్తవాలు చెప్పండి అంటూ అధికారులను సుతిమెత్తగా మందలించారు. శబరి, గోదావరి నదులు కలిసిన చోట 365 రోజుల పాటు గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే ప్రాంతాన్ని విస్మరించి సీతారామ ప్రాజెక్టుగా రీడిజైనింగ్ చేసి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టడం వల్ల అంచనా వ్యయం పెరిగింది తప్పా పది సంవత్సరాలుగా అదనంగా ఒక ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా అని అధికారులను నిలదీశారు. గతంలో రూపొందించిన ఇందిరా సాగర్ ప్రాజెక్టును యధావిధిగా కొనసాగిస్తే ఇప్పటివరకు పనులు పూర్తయ్యి నీళ్లు వచ్చే అవకాశం ఉండేదని, ఇందిరా సాగర్ ప్రాజెక్టు డిజైనింగ్ కరెక్టుగా నే రూపొందించారని అధికారులు చెప్పారు.
ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ హెడ్ వర్డ్స్ పూర్తి చేయకుండా చివరి కాలువలు పూర్తి చేసుకుంటే ఫలితం ఏముంటుందని అధికారులను ప్రశ్నించారు. గత ప్రభుత్వం రెండు మూడు వందల కోట్ల రూపాయలతో పూర్తయ్యే సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యానికి గురిచేసి వేల కోట్లతో కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం వల్ల ప్రజలపై భారం మోపిందన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను నాలుగు రకాలుగా విభజించాలని ఆదేశించారు. ఆరు నెలల్లో పూర్తయ్యే ప్రాజెక్టులు, ఏడాదిలోగా పూర్తయ్యే ప్రాజెక్టులు, 18 నెలల్లోగా ప్రాజెక్టులు 24 నెలల్లో పూర్తయ్యే ప్రాజెక్టులు గుర్తించి వాటి కావాల్సిన బడ్జెట్ అంచనా వ్యయాన్ని రూపొందించి వెంటనే నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. ఇరిగేషన్ శాఖలో ఎన్నికలకు ముందు పిలిచిన టెండర్లను వెంటనే నిలిపివేయాలని, వర్క్ అలాట్మెంట్ చేసిన వాటిని కూడా ఆపివేయాలని ఆదేశించారు. చెరువుల మరమ్మతులు, చెక్ డ్యాముల నిర్మాణం కోసం, ఎమ్మెల్యే నుంచి వచ్చే సిఫారసులను స్వీకరించి వాటికి కావలసిన నిధుల మంజూరుకి కృషి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గత ప్రభుత్వం రీడిజైనింగ్ చేసిన సీతారామ ప్రాజెక్టు వల్ల వెనక్కి పోలేము, ముందుకు పోలేమన్నట్టుగా ఉందని ఇది బ్యాడ్ రీ డిజైనింగ్ లా ఉందని అసంతృప్తిని వ్యక్తం చేశారు.
అధికారులపై పొంగులేటి ఆగ్రహం
సీతారామ ప్రాజెక్టు పనులకు సంబంధించిన వివరాలు సమగ్రంగా చెప్పని అధికారులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యారేజీ హెడ్ వర్క్ నుంచి చివరి కెనాల్ వరకు ఫేజ్ ల వారీగా ఆయన జరిగిన పనుల గురించి అధికారులను అడిగారు. తత్తరపాటు సమాధానాలు చెప్పడంతో మీరు చేసే పని పైనే మీకు అవగాహన లేకుంటే ఎలా అంటూ ఈఈని మందలించారు. ప్రతి సాగునీటి ప్రాజెక్టు గురించి చాలా లోతుగా మంత్రులు చర్చించారు. అదేవిధంగా నాగర్జున సాగర్ జలాశయంలో ఉన్న నీటి నిల్వలు వాటి వాడకం గురించి తెలుసుకున్నారు. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు కలగకుండా ఇప్పటినుంచే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.