తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె సీఎస్‌గా నియామకం అయిన తర్వాత ఒక్కరోజు కూడా రాజ్ భవన్‌ను సందర్శించలేదని అసహనం వ్యక్తం చేశారు. ఆమెకు ఎలాంటి ప్రోటోకాల్ లేదని, పిలిచినా కూడా మర్యాద లేదని అన్నారు. రాజ్ భవన్‌ను సందర్శించడానికి సమయం లేదా అని ప్రశ్నించారు. ఢిల్లీ కన్నా రాజ్ భవన్‌ దగ్గరే కదా అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసై తెలంగాణ సీఎస్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేశారు.






నేడు గవర్నర్ తమిళిసై మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో ప్రధాన మంత్రి భారతీయ జనఔషధి పరియోజన (PMBJP) పథకం కింద వారంపాటు నిర్వహించే మెడికల్ క్యాంప్ ను ప్రారంభించనున్నారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని రాజబొల్లారం తండాలో మధ్యాహ్నం 3.15 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుంది.






రాజ్ భవన్‌లో నెలల తరబడి పెండింగ్‌లో బిల్లులు


గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభలు ఆమోదముద్ర వేసిన 8 బిల్లుల్లో ఒక్క బిల్లును మాత్రమే గవర్నర్ ఆమోదించారు. ఏడు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించిన బిల్లుల్లో ద్రవ్య వినిమయ బిల్లుకు వెంటనే ఆమోదముద్ర వేసిన గవర్నర్‌ తమిళి సై మరో మూడు బిల్లులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో పది బిల్లులపై గవర్నర్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. బడ్జెట్‌ సమావేశాల ముందు రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌ మధ్య విభేదాలు తలెత్తాయి. బడ్జెట్‌ను ఆమోదించకపోవడంతో తెలంగాణ సర్కార్ హైకోర్టుకెు వెళ్లింది. హైకోర్టు సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది, రాజ్‌భవన్‌ తరఫున న్యాయవాది చర్చల జరిపారు. ఇరువురి మధ్య సఖ్యత కుదరడంతో బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గవర్నర్‌ ప్రసంగానికి తెలంగాణ సర్కార్ ఆమోదం తెలిపింది.


ఇటీవల పరిస్థితులు మెరుగుపడినట్లుగా కనిపించినా బిల్లులను ఆమోదించని గవర్నర్ తమిళిసై ప్రభుత్వం, గవర్నర్ మధ్య ఉన్న వివాదాలు ఇక కొలిక్కి వచ్చినట్లేనని కొన్నినెలలుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులకు కూడా ఆమోద ముద్ర పడుతుందని ప్రభుత్వం భావించింది. కానీ ఇప్పటికీ గవర్నర్‌ ఆమోదం తెలుపలేదు. పైగా మరో మూడు బిల్లులపైనా నిర్ణయం తీసుకోలేదు. విశ్వవిద్యాలయాల్లో నియామకాల కోసం తెచ్చిన కామన్‌ రిక్రూట్‌మెంట్‌బోర్డు ఏర్పాటు కోసం , సిద్దిపేట జిల్లా ములుగులో ఏర్పాటు చేసిన అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను అటవీ విశ్వవిద్యాలయంగా మారుస్తూ తెచ్చిన బిల్లు. ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ, జీహెచ్‌ఎంసీ, పురపాలక చట్టాలకు సవరణ, పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ చట్ట సవరణ, అజామాబాద్‌ ఇండస్ట్రియల్‌ ఏరియా చట్ట సవరణ, జీఎస్టీ చట్ట సవరణ ఇలా ఏడు బిల్లులను ప్రభుత్వం తెచ్చింది.


వీటిని అసెంబ్లీ, మండలిలో ఆమోదించి గవర్నర్‌ ఆమోదం కోసం పంపింది.వీటిలో జీఎస్టీ చట్ట సవరణ బిల్లును మాత్రమే గవర్నర్‌ ఆమోదించడంతో చట్టంగా రూపుదాల్చింది. మిగిలినవి పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా ఉభయ సభలు వ్యవసాయ విశ్వవిద్యాలయం, పురపాలక, పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లులు ఆమోదం తెలిపాయి. వీటికి గవర్నర్‌ ఆమోదం తెలపలేదు. బడ్జెట్‌కు సంబంధించిన రెండు ద్రవ్య వినిమయ బిల్లులకు నిన్న గవర్నర్‌ ఆమోదం తెలిపారు. గత సమావేశాల్లోని 7, తాజాగా 3 కలిపి మొత్తం పది బిల్లులపై గవర్నర్‌ ఆమోదించలేదు. వీటి కోసం సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్ వెళ్లింది.