Bandi Sanjay On KCR: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మహిళలు అంటే అలుసని, వారికి ఏమాత్రం గౌరవం ఇవ్వరంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కామెంట్లు చేశారు. గవర్నర్ తమిళిసై బిల్లులను ఆమోదించడం లేదంటూ రాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టుకు వెళ్లడం సిగ్గుచేటని అన్నారు. గవర్నర్ వ్యవస్థను అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందంటూ ఆయన విమర్శించారు. గవర్నర్ కు వ్యతిరేకంగా గతంలో హైకోర్టుకు వెళ్తే ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్లుగా ప్రభుత్వం తీరు ఉందని దుయ్యబట్టారు. నిజంగా ప్రజలపై ప్రేమే ఉంటే ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్న మీపై సుప్రీంకోర్టులో ఎన్ని కేసులు వేయాలని ప్రశ్నించారు.  రాజ్యాంగంపై ప్రమాణం చేసి ఝూఠా మాటలతో, తల తిక్క నిర్ణయాలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న మిమ్మల్ని ఏం చేయాలంటూ ప్రశ్నించారు. 50 వేల జీవోలను వెబ్ సైట్ లో పెట్టకుండా సమాచార హక్కు చట్టాన్ని కాలరాస్తున్న బీఆర్ఎస్ సర్కారుపై ఎన్ని కేసులు వేయాలని ఫైర్ అయ్యారు. 



సీఎం కేసీఆర్ కు మొదటి నుంచి మహిళలు అంటే అలుసని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. మహిళలు వంటింటికే పరిమితం కావాలనే సంకుచిత మనస్తత్వం కేసీఆర్ ది అంటూ వ్యాఖ్యానించారు. గతంలో నరసింహన్ గవర్నర్ గా ఉన్నప్పుడు వంగి వంగి పాదాభివందనాలు చేసిన సీఎం కేసీఆర్.. ఉన్నత విద్యావంతురాలైన తమిళిసై సౌందర రాజన్ గవర్నర్ అయితే మాత్రం జీర్ణించుకోలేక పోతున్నారని విమర్శించారు. ఆమెకు కనీస మర్యాద ఇవ్వాలనే ఆలోచన కూడా లేకపోవడం దారుణం అని బండి సంజయ్ వివరించారు. కేవలం ఆమెను అవమానించడమే లభ్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. 80 వేల పుస్తకాలు చదివానని చెప్పుకునే సీఎం కేసీఆర్.. రాష్ట్ర ప్రథమ పౌరురాలి పట్ల ఎలా వ్యవహరించాలో కూడా తెలియకపోవడం విడ్డూరంగా ఉందంటూ చెప్పారు. అసలు గవర్నర్ తమిళిసై చేసిన తప్పేంటని ప్రశ్నించారు. క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తిని ఎమ్మెల్సీగా సిఫార్సు చేస్తే ఆ ప్రతిపాదను తిరస్కరించడమే ఆమె చేసిన నేరమా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రజలను కలవకుండా, ప్రజా సమస్యలను గాలి కొదిలేసి ఫాంహౌజ్, ప్రగతి భవన్ కే పరిమితమైతే.. గవర్నర్ గా ప్రజలను కలుస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే ఆమె చేసిన తప్పా అన్నారు. 


కనీస సౌకర్యాల్లేక ఇబ్బందుల్లో కూరుకుపోయిన విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు, వైద్య రంగానికి తనవంతు సాయం చేసేందుకు ప్రయత్నించడమే గవర్నర్ తమిళి సై చేసిన తప్పా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ముఖ్యమంత్రిగా నిర్వర్తించాల్సిన బాధ్యతను విస్మరిస్తూ, రాక్షస పాలన కొనసాగిస్తుంటే.... ప్రజా సమస్యల పరిష్కారానికి యత్నిస్తూ రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడుతున్న గవర్నర్ తమిళిసై అంటే కేసీఆర్ కు కడుపు మంట అని చెప్పారు. స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల సందర్భంలోనూ ప్రొటోకాల్ పాటించకుండా గవర్నర్ ను అవమానించారు. ఇలాగైతే మీపై సుప్రీంకోర్టులో ఎన్ని కేసులు వేయాలని ఫైర్ అయ్యారు. ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను ఇబ్బందులగు గురి చేస్తున్నారని ఆరోపించారు. 2014 నుంచి మొన్నటి వరకు మీరు తీసుకున్న నిర్ణయాలను తప్పు పడుతూ... హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసిందో గుర్తు తెచ్చుకోండని ధ్వజమెత్తారు.