మార్చి 10న ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద దీక్ష చేయబోతున్నట్టు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. భారత్‌ జాగృతి ఆధ్వర్యంలో ఈ ఒక్క రోజు దీక్ష చేస్తామన్నారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్‌ ప్రవేశ పెట్టాలన్న డిమాండ్‌తో ఈ దీక్ష చేయబోతున్నట్టు తెలిపారు. ఈ బడ్జెట్‌ సమావేశాల్లోనే దీన్ని ప్రవేశ పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. 


29 రాష్ట్రాల్లో ఉన్న మహిళా సంఘాల నాయకులు, రాజకీయా పార్టీలకు చెందిన మహిళా నాయకుల ఈ దీక్షలు మద్దతు తెలపనున్నారని కవిత వెల్లడించారు. తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆమె... 1992లే చేసిన 72వ రాజ్యాంగ సవరణ స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అవకాశం కల్పించిందని గుర్తు చేశారు. తర్వాత సంవత్సరం చేసిన 73వ రాజ్యాంగ సవరణతో పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో కూడా ఆ రిజర్వేషన్ వర్తించేలా చేశారని తెలిపారు. ఇప్పుడు పార్లమెంట్‌, అసెంబ్లీలో కూడా 33 శాతం ఇచ్చేలా చట్టం తీసుకురావాలన్నారు. గత 27 ఏళ్ల నుంచి ఇది పెండింగ్‌లో ఉందని గుర్తు చేశారు. 1996లో చట్టానికి ప్రయత్నాలు జరిగినా ఇప్పటి వరకు రిజర్వేషన్ కలగానే మిగిలిపోయిందన్నారు. 


1952 నాటి మొదటి లోక్‌సభలో 24మంది మహిళా ఎంపీలు ఉన్నారని... స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన తర్వాత ఇప్పుడు చూస్తే.. 78 మంది మాత్రమే ఎంపీలుగా ఉన్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది ఏమాత్రం సరిపడా నెంబర్ కాదన్నారు. 
2014, 2019లో ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీల్లో చాలా వాటిని అమలు చేయలేదన్నారు కవిత. పార్లమెంట్‌లో ఎప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టినా మద్దతు ఇస్తామని  కేసీఆర్ నాయకత్వంలో తాము అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టిన సంగతిని గుర్తు చేశారు కవిత. 


బీజేపీపై విమర్శలు 


కేంద్ర దర్యాప్తు సంస్థల తీరుపై భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత విమర్శలు గుప్పించారు. ఇటీవల తెలంగాణ బీజేపీ నేతలు కొంత మంది .. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాను అరెస్ట్ చేసినట్లుగానే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేస్తారని ప్రకటిస్తారని..  బీజేపీ నేతలు చెప్పినంతనే దర్యాప్తు సంస్థలు  అరెస్ట్ చేస్తాయా అని ప్రశ్నించారు. 


మోదీ వైఫల్యాలపై నిలదీస్తే దర్యాప్తు సంస్థలతో దాడులు


దర్యాప్తు సంస్థలు పూర్తిగా విపక్ష నేతలనే టార్గెట్ చేశాయన్నారు. భారీ స్కాంకు పాల్పడిన అదానీ విషంయలో సీబీఐ, ఈడీ ఎందుకు దర్యాప్తు చేయడం లేదని కవిత ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాల కారణంగానే సెబీతో పాటు .. ఓ కమిటీ విచారణకు ఏర్పాటయిందన్నారు. ప్రధానమంత్రి మోదీ వైఫల్యాలపై నిలదీస్తే దర్యాప్తు ఏజెన్సీలతో భయపెడుతున్నారని మండిపడ్డారు. తనను అరెస్ట్ చేస్తారని బీజేపీ నేతలు ప్రకటిస్తున్నారని.. అలా చేస్తారా లేదా అన్నది దర్యాప్తు  సంస్థలే చెప్పాలన్నారు. ఒక వేళ బీజేపీ నేతలే అన్నీ చెబితే ఇక దర్యాప్తు ఏజెన్సీలు ఎందుకని కవిత ప్రశ్నించారు. 


కవితను అరెస్ట్ చేస్తారని ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలు                       


ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కల్వకుంట్ల కవిత పేరును ఇప్పటికి పలుమార్లు చార్జిషీట్లతో పాటు కోర్టుకు సమర్పించిన వివిధ పత్రాల్లో సీబీఐ ప్రస్తావించింది.   సౌత్ లాబీలో ఆమె బినామీ పేర్లతో వ్యాపారం నిర్వహిస్తున్నరారని సీబీఐ ఆరోపించింది. ఇప్పటికే ఓ సారి కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. మరోసారి విచారణకు  రావాల్సి ఉంటుందని నోటీసులు ఇచ్చారు కానీ ఇప్పటి వరకూ ఎప్పుడు రావాలో సమాచారం ఇవ్వలేదు. కానీఈ కేసులో సీబీఐ, ఈడీ వరుసగా అరెస్టులు చేస్తున్నాయి. బీజేపీ నేతలు తర్వాత కవితనే అరెస్ట్ చేస్తారని ప్రకటనలు చేస్తున్నారు.