Telangana Assembly Budget Sessions | హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు బుధవారం నాడు ప్రారంభమయ్యాయి. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ ప్రజల అభివృద్ధి, అన్ని వర్గాల కలల సాకారానికే బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నాం అన్నారు. రైతులు, మహిళలు, యువత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఆరు గ్యారంటీ అమలు కోసం ప్రభుత్వం పనిచేస్తుందని గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్నారు. తెలంగాణ అంటే ఓ ప్రాంతం మాత్రమే కాదు, ఘనమైన సంస్కృతికి నిలయం అని కొనియాడారు.

తెలంగాణలో దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి అవుతుంది. వరి రైతులకు మేం రూ. 500 బోనస్ ఇస్తున్నాం. పేదలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. పేదల కోసం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. మహాలక్ష్మి స్కీం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టాం. రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం’ అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు.

గేమ్ ఛేంజర్‌గా మహాలక్ష్మీ పథకంతెలంగాణ తల్లి విగ్రహానికి అధికారికంగా విశిష్ట గుర్తింపు ఇచ్చాం. 25.35 లక్షల మంది రైతులకు రూ.20,616 కోట్లు లబ్ధి చేకూర్చేలా రూ.2 లక్షల వరకు రుణమాఫీని అమలు చేసింది. ఎకరాకు రూ.12 వేలు రైతులకు పంట ఆర్థిక సాయం అందించాం. కృష్ణా జలాలలో న్యాయపరంగా తెలంగాణ వాటా దక్కించుకునేందుకు కృష్ణా జలాల ట్రిబ్యునల్ 2 సమక్షంలో వాదనలు వినిపించారు. మహాలక్ష్మీ పథకం గేమ్ ఛేంజర్ గా మారింది. మహిళలకు 149.63 లక్షల ఉచిత బస్సు ట్రిప్పులను కల్పించి.. వారికి ప్రయాణం ద్వారా రూ.5005 కోట్లు ఆదా చేసింది. ఇందిరా మహిళా శక్తి మిషన్ ద్వారా మహిళలకు లక్ష కోట్ల ఆర్థిక సహాయం అందించి మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గవర్నర్ స్పీచ్ అనంతరం తెలంగాణ శాసన సభ రేపటికి వాయిదా పడింది.  మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ గవర్నర్ ప్రసంగంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది.