New Ration Card Telangana: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఇప్పటి వరకు రేషన్ కార్డుల పంపిణీ కోసం ఉన్న అడ్డంకి తొలగిపోయింది. దీంతో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. త్వరలోనే కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పనుంది. తెలంగాణ ప్రభుత్వం కొత్త కార్డుల పంపిణీకి చర్యలు ప్రారంభించింది. క్యూఆర్‌ కోడ్‌తో ఉన్న కొత్త స్మార్ట్ కార్డులను ప్రజలకు ఇవ్వబోతోంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు ఈ క్యూర్ కోడ్‌తో ఉన్న కార్డులు ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు. వివిధ రకాల డిజైన్‌లను అధికారులు ప్రభుత్వానికి సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి చూసి ఫైనల్‌ చేసిన డిజైన్‌ను ఫైనల్‌ చేస్తారు.

పూర్తైన రేషన్ కార్దు దరఖాస్తుదారుల ఫిల్టరేషన్ 

తెలంగాణలో కొత్త కార్డుల కోసం లక్షల దరఖాస్తులు వచ్చాయి. అందులో అనర్హులను వేరు చేసి కొన్నింటిని ప్రభుత్వం ఫైనలైజ్ చేసింది. వాళ్లకు మొదట క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త రేషన్ కార్డులు ఇవ్వనుంది. అనంతరం ఇప్పటికే కార్డులు కలిగిన 90 లక్షల మందికి కూడా కార్డులు మార్చనుంది. అందరికీ స్మార్ట్ కార్డు మాదిరి కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 

కొత్త రేషన్ కార్డుల కోసం టెండర్లు

మార్చి మొదటి వారం నుంచే కొత్త కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. దీనికి ఎమ్మెల్సీ కోడ్ అడ్డంకిగా మారింది. కానీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో పంపిణీ చేయాలని భావించారు. అయితే తొలిసారిగా క్యూఆర్‌ కోడ్ ఉన్న స్మార్ట్ కార్డులు ఇస్తున్నందున ప్రక్రియ ఆలస్యమైంది. అందుకే స్మార్ట్ కార్డుల కోసం టెండర్లు పిలిచింది ప్రభుత్వం. ఇందులో పాల్గొనే కంపెనీలు మార్చి 25 వరకు టెండర్లు వేయవచ్చు. ప్రీబిడ్డింగ సమావేశం మార్చి 17 నిర్వహిస్తారు. ఇది ఖరారు అయిన తర్వాత రేషన్ కార్డుల పంపిణీపై క్లారిటీ వస్తుంది. 

కొత్త కార్డులు మహిళల పేరుతోనే 

కొత్తగా వచ్చే స్మార్ట్ కార్డులు ఇంట్లో ఉండే మహిళల పేరుతోనే వస్తాయి. కార్డుపై ఆమె ఫోటోను ముద్రిస్తారు. ఒకవైపు సీఎం ఫొటో ఉంటుంది. మరోవైపు పౌరసరఫరాల శాఖ మంత్రి ఫొటో చిన్నగా ఉంటాయి. పెద్ద ఫోటో కార్డు యజమానురాలదే ఉంటుంది. 

ప్రతి కార్డుపై క్యూఆర్ కోడ్ 

ఈ కార్డులకు QR కోడ్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. దీన్‌ని రేషన్ దుకాణాలలో స్కాన్ చేసినప్పుడు కుటుంబం సభ్యుల వివరాలు ఉంటాయి. ఆ రేషన్ కార్డు ఏ షాపు పరిధిలోకి వస్తుందో కూడా తెలుస్తుంది.  ఈ రేషన్ కార్డుల కోసం అధికారులపై అధికారులు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేశారు. రాజస్థాన్, కర్ణాటక, హర్యానా, గుజరాత్‌లో  అమలులో ఉన్న విధానాలు పరిశీలించారు. వాటిలో ఉత్తమమైన పద్దతులు గురించి తెలుసుకున్నారు. వాటిని ఇక్కడ అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  

ఇప్పుడు తీసుకొస్తున్న కొత్త కార్డులతో పంపిణీలో పారదర్శకత మెరుగుపడుతుంది. ప్రక్రియ కూడా వేగవంతం అవుతుంది. మోసాలు జరిగే అవకాశాలు తగ్గుతాయి. దుర్వినియోగానికి అవకాశం ఉండదని అధికారులు అంటున్నారు.