BRS MLA Jagadeesh Reddy Suspended: తెలంగాణ రాజకీయాలు మరింత హీటెక్కాయి. సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న కారణంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనకుండా సస్పెండ్ చేశారు. స్పీకర్ పదవికి భంగం కలిగేలా వ్యవహరించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సభలో ప్రకటించారు.  ఉదయం నుంచి తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సభలో ప్రతిపక్షానికి తక్కువ అవకాశాలు ఇస్తున్నారని ఆరోపిస్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. సభ మీ ఒక్కరిది కాదని అందరిది అని అన్నారు. ఇది స్పీకర్‌ను ఉద్దేశించి అన్నట్టు కాంగ్రెస్‌ నాయకులు ఆందోళన చేపట్టారు. దీనికి బీఆర్‌ఎస్ నేతలు కూడా కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే గందరగోళం నెలకొంది.  సభను పదిహేను నిమిషాల పాటు వాయిదా వేసిన తర్వాత పలు కీలక పరిమామాలు చోటు చేసుకున్నాయి. 


బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు..  అసలు జగదీష్ రెడ్డి ఏం మాట్లాడారో బయట పెట్టాలని కోరారు. సభ్యుడు మాట్లాడిన ఇష్యూని చూపుతూ 15 నిమిషాలు అని చెప్పి ఇన్ని గంటల సేపు వాయిదా వేయడం సభా సంప్రదాయాలకు మంచిది కాదని స్పీకర్ వాయిదా సమయంలో చెప్పారు. ఆల్ పార్టీ ఫ్లోర్ లీడర్లను పిలిచి సభలో జగదీష్ రెడ్డి మాట్లాడింది వీడియో ప్లే చేసి చూపండని స్పీకర్ నీ కోరామని ఆయన చెప్పారు. 
నిజంగానే జగదీష్ రెడ్డి గారు తప్పు మాట్లాడి ఉంటే విచారం వ్యక్తం చేస్తామని.. సభ్యుడు తప్పు మాట్లాడాడని మీరు భావిస్తే వాక్యాలు వెనక్కి తీసుకుంటామన్నారు. ముందు సభ నడపండి అని విజ్ఞప్తి చేశామని.. సభా సమయం వృధా అవుతందని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లామని హరీష్ రావు చెప్పారు. 


 సభ ప్రారంభమైన తర్వాత అధికార పార్టీ సభ్యులు జగదీష్ రెడ్డి తీరును ఖండించారు. ఆయనను సభ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. సభ్యుల విజ్ఞప్తి మేరకు ఈ సెషన్ వరకూ ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఓ దశలో ఆయనపై అనర్హతా వేటు వేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. జగదీష్ రెడ్డి విషయాన్ని తేలికగా తీసుకోకూడదని నిర్ణయించుకున్న  అధికార పక్షం.. ఈ విషయంలో    కఠినంగా వ్యవహరించడం ద్వారా అసెంబ్లీలో వారు వ్యవహరించిన విధానం మరితం బలంగా ప్రజల్లోకి వెళ్లేలా చేయాలని అనుకున్నారు. ఆ ప్రకారం ఎలాంటి చర్యలు  తీసుకోవాలో చర్చించినట్లుగా తెలుస్తోంది.


గతంలో శాసనమండలి చైర్మన్ పై గవర్నర్ ప్రసంగం సందర్భంగా హెడ్ ఫోన్లు విసిరేశారన్న కారణంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ అభ్యర్థిత్వాలను రద్దు చేశారు.  అలాంటి చర్య తీసుకుంటే ఎలా ఉంటుందని కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది. అయితే మరోసారి అలాంటి తప్పు చేస్తే కఠిన చర్యలు  తీసుకోవచ్చని.. ఈ సారికి సస్పెన్షన్ కు ప్రతిపాదిద్దామని అందరూ అభిప్రాయానికి వచ్చి ఆ మేరకు సభ ప్రారంభమైన తర్వాత సస్పెన్షన్ అంశాన్ని డిమాండ్ చేసినట్లుగా కనిపిస్తోంది.