Telangana News: తెలంగాణలో శివుడి భక్తులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి భక్తులకు పండ్లు పంపిణీ చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. శైవక్షేత్రాల్లో పెద్దఎత్తున ఏర్పాట్లు చేయాలని ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 

మహాశివరాత్రి ఏర్పాట్లపై తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. జనం భారీగా వచ్చే ఆలయాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని భక్తులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కూడా అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఉపవాసంతో ఆలయాలకు వచ్చే భక్తులకు ఉచితంగా ఫలహారం అందివ్వాలని సూచించారు. 

Also Read: మినీ మేడారం జాతరలో వనదేవతలకు పూజలు మాత్రమే, గద్దెల పైకి రాని సమ్మక్క, సారలమ్మ

భక్తులకు ఉచితంగా అల్పాహారం ఇచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి కొండా సురేఖ ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఆయా ఆలయాలు వచ్చిన భక్తుల సంఖ్యను ఆధారంగా చేసుకొని చర్యలు తీసుకోవాలని సూచించారు. శివరాత్రికి జరిగే ఏర్పాట్లపై ఒక్క ఫిర్యాదు రావడానికి కూడా వీల్లేదని దిశానిర్దేశం చేశారు. 

కాళేశ్వరం, వేములవాడ, కీసర రామలింగేశ్వరస్వామి, ఏడుపాయల వనదుర్గాభవానీ అమ్మవారు, రామప్ప, మేళ్లచెరువు, పానగళ్లు, పాలకుర్తి, వేయి స్తంభాల గుడి, కాశీబుగ్గ, భద్రకాళి వంటి ఆలయాలపై ప్రత్యేక కృష్టి పెట్టాలని సూచించారు మంత్రి కొండా సురేఖ. ఈ ఆలయాలకు రద్దీ ఎక్కువగా ఉంటుందని ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, వచ్చిన వారందరికీ బాగా దర్శనం అయ్యేలా చూడాలన్నారు. ఎక్కడా ట్రాఫిక్ జామ్‌ ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. 

అన్ని ఆలయాలను సమన్వయం చేసుకొని హైదరాబాద్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. ఏం జరిగినా క్షణాల్లో రియాక్ట్ అయ్యే టీమ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. నదీ తీర ప్రాంతాల్లో నదీ హారతి చేపట్టేందుకు కూడా చర్యలు తీసుకోవలాని సూచించారు. హైదరాబాద్‌లో ఉన్న ఉన్నతాధికారులు, జిల్లాలో ఉన్న సిబ్బంది అంతా సమన్వయంతో పని చేసి భక్తులకు సమస్యల్లేకుండా చూడాలని చెప్పుకొచ్చారు. 

Also Read: తెలంగాణలో మరోసారి కులగణన - గత సర్వేలో నమోదు చేయించుకోని వారికే !