Telangana Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ప్రభుత్వం కీలక అప్‌డేట్ ఇచ్చింది. కొలతల్లో తేడా వస్తే మాత్రం కేంద్రం ఇచ్చే నిధులకు అనర్హులు అవుతారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గాల్లో ఎంపిక ప్రక్రియ చాలా వేగంగా జరుగుతోందని అన్నారు. ఎప్పటికప్పడు నిరంతరం పర్యవేక్షిస్తూ పనులు వేగంగా జరిగే చూస్తున్నట్టు వెల్లడించారు.
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిర్మాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆరు వందల చదరపు అడుగులకు మించి నిర్మించొద్దని సూచించారు. అంత కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మిస్తే మాత్రం కేంద్రం నుంచి వచ్చే నిధులు రావని అప్పుడు కేవలం రాష్ట్రం ఇచ్చే నిధులతోనే ఇల్లు నిర్మించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి అవగాహన సదస్సులపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో చాలా అంశాలపై చర్చించారు. ప్రతి నియోజకవర్గానికి మూడవేల ఐదు వందల ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక చాలా వేగంగా జరగాలని సూచించారు మంత్రి. ఇలా ఎంపిక చేసిన వారిలో ఐదు వందల మంది పట్టణ ప్రాంతం ఉండేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటి వరకు ఎంపికైన వాళ్ల జాబితా సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. దీని కోసం ఇంఛార్జ్ మంత్రులతో చర్చించాలని అధికారులకు సూచించారు. అర్హులందర్నీ ఎంపిక చేయాలని అదే టైంలో అనర్హులను కూడా గుర్తించాలని సూచించారు మంత్రి. లిస్ట్‌లతో సంబంధం లేకుండా అర్హులు ఎప్పటికప్పుడు గుర్తిస్తూ ప్రభుత్వానికి పంపించాలని అన్నారు. నిరంతరం ఈ ప్రక్రియ జరగాలన్నారు.
భూ సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం చేపట్టిన భూభారతి నూతన ఆర్ ఓ ఆర్ చట్టంలో భాగంగా ఈ నెల 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జిల్లాకు ఒక మండలంలో నిర్వహించే రెవెన్యూ సదస్సులను పకడ్బందీగా చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం చేపట్టిన భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టంపై మొదటి విడతగా రాష్ట్రంలోని 4 జిల్లాల్లో 4 మండలాల్లోని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలన్నారు. ఇందులో వివిధ రకాల సమస్యలపై అర్జీలు స్వీకరించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జూన్ 2వ తేదీ వరకు పైలట్ ప్రాజెక్టు కింద వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన 4 మండలాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలపై 12 వేల 759 దరఖాస్తులు వచ్చాయని, రాష్ట్రవ్యాప్తంగా జరిగే రెవెన్యూ సదస్సుల్లో దాదాపు 15 లక్షల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. భూ భారతి చట్టంలో దరఖాస్తు సక్రమంగా జరిగేందుకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ భూముల్లో పొజిషన్ ఉన్న రైతుల దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించాలని, భూమిలేని అర్హులైన నిరుపేదలు ఉన్నట్లయితే పట్టాలు ఇచ్చేందుకు సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. భూభారతి చట్టం అమలులో అధికారులు అందుబాటులో ఉన్న సమయాన్ని దృష్టిలో ఉంచుకొని దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని, ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. ఈ నెల 4వ తేదీన నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, రాష్ట్రంలోని 24 జిల్లాల్లో 190 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, 72 వేల 507 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సమర్థవంతంగా పరీక్షలు నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.