Governor Tamilisai Vs Telangana Government : అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణలో హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. 125 అడుగుల రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు తాను ఎందుకు హాజరు కాలేదో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొనేందుకు తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని గవర్నర్ తమిళిసై తెలిపారు. గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ.. ఆహ్వానం అంది ఉంటే, ఇలాంటి కార్యక్రమానికి తాను కచ్చితంగా హాజరు అవుతానని స్పష్టం చేశారు. గవర్నర్ అయిన తనకు ఆహ్వానం అందని కారణంగా, అంబేద్కర్ కు రాజ్ భవన్ లోనే నివాళులు అర్పించాల్సి వచ్చిందన్నారు.
‘అంబేద్కర్ విగ్రహావిష్కరణ చాలా పెద్ద కార్యక్రమం. కానీ నాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదు. మహనీయుడు అంబేద్కర్ మహిళలు, దళితుల అభ్యున్నతి కోసం ఎంతో పాటుపడ్డారు. అందరికి ఫలాలు అందాలని ప్రయత్నించిన వ్యక్తి అంబేద్కర్. మహిళా సాధికారత కోసం అంబేద్కర్ ఎక్కువగా ఆలోచించేవారు, వారి కోసం మాట్లాడేవారు. కానీ అలాంటి మహనీయుడి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఓ మహిళా గవర్నర్ నైన తనను ఆహ్వానించలేదు. ఇది చాలా బాధాకరం. ఒకవేళ తనను ఆహ్వానిస్తే, కచ్చితంగా అంబేద్కర్ మహా విగ్రహ ఆవిష్కరణకు హాజరుయ్యేదాన్ని అని’ గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించారు.
గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ వివాదం ఇంకా ముగియలేదా ?
తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య ఏర్పడిన వివాదం బడ్జెట్ సమావేశాల సందర్భంగా జరిగిన పరిణామాలతో ముగిసిపోయిందని అనుకున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం అనూహ్యంగా సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో గవర్నర్, ప్రభుత్వం మధ్య సానుకూల వాతావరణం ఏర్పడలేదని స్పష్టయింది. ఇప్పుడు ప్రభుత్వం కోర్టుకు వెళ్లడంతో వివాదం మరింత ముదిరినట్లయింది. ఢిల్లీకి వెళ్లే బదులు రాజ్ భవన్‌కు రావాల్సిందని గవర్నర్ తమిళిసై.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. సీఎస్ అసలు గౌరవించడం లేదని ఆమె అంటున్నారు. దీంతో అసలు సమస్య ఏమిటన్నది రాజకీయ వర్గాలకూ అంతుబట్టడం లేదు.
ప్రోటోకాల్ దగ్గరే వివాదం ఏర్పడుతోందా ?
బడ్జెట్ సమావేశాల దగ్గర సఖ్యత కుదిరినా తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ కు కల్పించాల్సిన ప్రోటోకాల్ కల్పించకపోవడంతోనే గవర్నర్ గుర్రుగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. చీఫ్ సెక్రటరీ తనను మర్యాదపూర్వకంగా కూడా కలవడం లేదని.. ఇవ్వాల్సిన ప్రోటోకాల్ కూడా ఇవ్వడం లేదని భావిస్తున్నారు. మామూలుగా కొత్త సీఎస్ వస్తే గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలుస్తారు. కానీ సీఎస్ శాంతి కుమారి కలవలేదు. రిపబ్లిక్ డే వేడుకల్లో హైకోర్టు ఆదేశాల మేరకు పాల్గొన్నారు కానీ.. ప్రత్యేకంగా సమావేశం కాలేదు. అలాగే గవర్నర్ ..రాజకీయం చేస్తున్నారని ఆమెకు ప్రోటోకాల్ ఇవ్వాల్సిన అవసరం ఏమిటన్న భావనలో బీఆర్ఎస్ నేతలుున్నారు. దీంతో వివాదం మళ్లీ ప్రారంభమయిందని భావిస్తున్నారు.
గవర్నర్ బిల్లులను తిరస్కరిస్తే మరోసారి అసెంబ్లీలో ఆమోదించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించే అవకాశం ఉంది. ఆమోదిస్తే సమస్య ఉండదు. అటు ఆమోదించకుండా.. ఇటు తిరస్కరించకుండాపెండింగ్‌లో పెట్టడంతో ఆ చట్టాలను అసెంబ్లీ పాస్ చేసినా.. అమల్లోకి రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన అనంతరం గవర్నర్ కొన్ని బిల్లులను ఆమోదించగా, 2 బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. కొన్ని బిల్లులకు రాష్ట్ర ప్రభుత్వానికి తిప్పి పంపించారు.