Telangana Formation Day: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి నేటితో పదేళ్లు అవుతోంది. ఈ సందర్భంగానే అన్ని రాజకీయ పార్టీలు ఘనంగా వేడుకలు చేసేందుకు సిద్ధమైంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అటు పార్టీ తరఫున, ఇటు ప్రభుత్వం తరఫున పండుగ చేస్తుంటే... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గోల్కొండ కోటలో అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా తెలంగాణను ఇచ్చింది తామేనంటూ ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు అనేక కార్యక్రమాలు చేస్తోంది. వామపక్షాలతో పాటు మిగతా పార్టీలు కూడా వేడుకలకు ఏర్పాట్లు చేసుకున్నాయి. మరికొన్ని నెలల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్న క్రమంలో.. ప్రజలకు దగ్గరయ్యేందుకు రాజకీయ పార్టీలన్నీ దూకుడుగా ముందుకు వెళ్తుండడం చర్చనీయాంశంగా మారింది. 




నూతన సచివాలయంలో బీఆర్ఎస్ వేడుకలు


నూతన సచివాలయం వేదికగా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ అవతరణ వేడుకలను నిర్వహిస్తోంది. శుక్రవారం సీఎం కేసీఆర్ సచివాలయంలో జాతీయ జెండాను ఎగుర వేసి.. గత తొమ్మిదేళ్ల ప్రగతి వివరించనున్నారు. అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమాల్లో ఆయా జిల్లాల మంత్రులు, ముఖ్య ప్రజాప్రతినిధులు జాతీయ పతకాలు ఆవిష్కరిస్తారు. 






గోల్కొండ కోటలో బీజేపీ వేడుకలు


కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను గోల్కొండ కోటలో అధికారికంగా నిర్వహిస్తోంది. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకల్లో గోల్కొండ కోటపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. గతేడాది ఢిల్లీలో ఈ వేడుకలను నిర్వహించిన కేంద్రం తొలిసారిగా హైదరాబాద్ లో నిర్వహిస్తోంది. ఎంతో మంది అమరవీరుల బలిదానాలు, మరెందరో పోరాటాల ఫలితంగా తెలంగాణ ఏర్పడింది. ఈ పోరాటాలు, త్యాగాలను అంతా కలిసి స్మరించుకుందాం, వేడుకలు చేస్తామని కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రకటించడం గమనార్హం. 










గాంధీభవన్ లో కాంగ్రెస్ వేడుకలు


తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ లో నిర్వహిస్తోంది. అయితే బిల్లు పాస్ అయిన సమయంలో లోక్ సభ స్పీకర్ గా ఉన్న మీరాకుమార్ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల్లో పాల్గొనడానికి వస్తున్నారు. కేవలం గాంధీ భవన్ లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహించేందుకు టీపీసీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అంతేకాకుండా ప్రజల్లోకి వెళ్లేలా పలు కార్యక్రమాలను రూపొందించింది. 






రాజ్ భవన్ లోనూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు


తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ రాష్ట్ర ప్రథమ పౌరురాలి హోదాలో రాజ్ భవన్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి అవతరణ వేడుకలను నిర్వహించబోతున్నారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహణలో ప్రజలతో.. వారి సమస్యల గురించి చర్చించనున్నారు. రాజ్ భవన్ వేడుకల్లో గవర్నర్ ప్రసంగం ఏ విధంగా ఉండనుందో చూడాలి మరి.