Medak MP Kotha Prabhakar Reddy Injured: 


హైదరాబాద్‌: ఎన్నికల ప్రచారంలో పాల్గొని కత్తి దాడికి గురైన బీఆర్ఎస్ నేత, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హెల్త్ బులెటిన్ విడుదలైంది. ప్రభాకర్ రెడ్డికి పొట్ట కుడి భాగంలో 6సెం.మీ మేర కత్తిగాటు పడిందని యశోద ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. సరైన సమయంలో ఆసుపత్రికి తీసుకురావడంతో ప్రాణాపాయం తప్పిందన్నారు. సీటీ స్కాన్‌ చేయగా.. శరీరం లోపల బ్లీడింగ్‌ (Internal Bleeding) అవుతున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా హాస్పిటల్ కు తీసుకురావడంతో ఇన్ ఫెక్షన్ ప్రమాదం తప్పిందన్నారు. అయితే బీఆర్ఎస్ నేత కొత్త ప్రభాకర్ రెడ్డి మరో 10 రోజుల వరకు హాస్పిటల్ లోనే ఉండాలని యశోద ఆసుపత్రి డాక్టర్లు ఆయనకు సూచించారు.


బీఆర్ఎస్ నేతకు సర్జరీ పూర్తి..
ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి సర్జరీ చేసినట్లు డాక్టర్లు తెలిపారు. చిన్న ప్రేగు కు నాలుగు చోట్ల గాయాలయ్యాయి. 15 సెంటిమిటర్ల మేర పొట్టను కట్ చేసి 10 సెంటిమిటర్లు చిన్న ప్రేగును డాక్టర్లు తొలగించారు. గ్రీన్ ఛానెల్ తో హైదరాబాద్ కు సకాలంలో తరలించడంతో ప్రమాదం తప్పింది. లేకపోతే మరింత ఇబ్బంది అయ్యేదన్నారు. కత్తి గాటుతో రక్తం అంత కూడా కడుపులో పేరుకుపోయింది. అందుకే 15 సెంటిమిటర్లు కట్ చేసి పేరుకుపోయిన రక్తాన్ని డాక్టర్లు అంత శుభ్రం చేశారు. లోపల రక్తం పెరుకుపోవడం, ప్రేగుకు నాలుగు చోట్ల గాయాలు కావడంతో సర్జరీ ఆలస్యం అయిందని వెల్లడించారు.


మెదక్ ఎంపీ ఆరోగ్యంపై డాక్టర్ల అప్ డేట్..
‘ప్రభాకర్ రెడ్డిని కత్తి గాటుతో ఇక్కడికి తీసుకువచ్చారు. కత్తిదాడి జరిగిన వెంటనే గజ్వేల్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేశారు. ప్రసాద్ బాబు, వినీత్ అనే డాక్టర్ల టీమ్ బీఆర్ఎస్ నేతకు చికిత్స అందించారు. ప్రేగుకు గాయం అయింది. తక్కువ సమయంలోనే రావడంతో ఇన్ఫెక్షన్ ముప్పు తప్పిపోయింది. 3 గంటల పాటు శ్రమించి సర్జరీ పూర్తి చేశాం. ఆపరేషన్ చేసి ప్రేగు కొంతమేర తొలగించాం. ఇలాంటి సర్జరీలు జరిగిన సమయంలో పేషెంట్ కోలుకోవడానికి కాస్త టైమ్ పడుతుంది. ఆయనకు బీపీ ఉంది. కొన్ని రకాల టెస్టులు చేశాం. మరో 4 రోజుల తర్వాత కొత్త ప్రభాకర్ రెడ్డి కోలుకోవడాన్ని పరిశీలించి వార్డుకు షిఫ్ట్ చేస్తామని’ యశోద డాక్టర్ల టీమ్ తెలిపింది.


దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ నేత దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేశాడు. ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై దాడి అత్యంత గర్హనీయం అన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని, ఈ ఘటనను ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందని మంత్రి హరీష్ రావు అన్నారు. 


సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం ముగించుకుని హైదరాబాద్ చేరుకుని సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి వెళ్లారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని పరామర్శించారు. ఆయన ఆరోగ్యం వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మీద ఆగంతకుడు చేసిన హత్యా ప్రయత్నాన్ని అడ్డుకుని ఆయన ప్రాణాలు కాపాడిన గన్ మెన్ కు నమస్కరించి కృతజ్ఞతలు తెలిపారు సీఎం కేసీఆర్. ఇది ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి కాదని, తనపై జరిగిన దాడి అని నేటి సభలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.