మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావును కలిశారు. ఇందుకోసం కోమటిరెడ్డి రామోజీ ఫిల్మ్ సిటీలోని రామోజీ రావు నివాసానికి వెళ్లారు. ఈ విషయాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్స్‌లో పోస్ట్ చేసి తెలిపారు. ‘‘ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీరావును ఈరోజు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది’’ అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.


ఇటీవలే బీజేపీ నుంచి సొంత గూటికి చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం మళ్లీ మునుగోడు టికెట్ కేటాయించిన సంగతి తెలిసిందే. రెండోసారి విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో రాజగోపాల్ రెడ్డికి ఆ స్థానం కేటాయించగా.. అది ప్రస్తుతం వివాదాస్పదం అవుతోంది. 2022 మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పాల్వాయి స్రవంతి రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆ సమయంలో రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడం వల్లే ఆ స్థానానికి ఉప ఎన్నిక వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పాల్వాయి స్రవంతి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. ఇప్పుడు తనను కాదని బీజేపీలోకి వెళ్లి తిరిగొచ్చిన రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇవ్వడం పట్ల పాల్వాయి స్రవంతి అసహనంతో ఉన్నారు.


మరోవైపు, ఈ ఎన్నికల్లో తనకే టికెట్ అని భరోసాతో ఉన్న చలమల్ల క్రిష్ణారెడ్డి కూడా తిరుగుబాటుగా మారారు. తాను ఇండిపెండెంట్ అయినా బరిలో ఉంటానని తేల్చి చెబుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మునుగోడు ఎమ్మెల్యేగా విజయం సాధించినా, ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోచేరి.. మళ్లీ 2022 ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు బీజేపీలో పరిస్థితులు సరిగ్గా లేవని సొంత గూటికి వచ్చారు. ఈ 15 నెలల్లో పార్టీకి నియోజకవర్గంలో అండగా ఉన్నవారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నారు.