బీఆర్ఎస్ లీడర్ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన కత్తి దాడి ఘటనపై స్థానిక దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో బీఆర్ఎస్ మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడికి తానే కారణమని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని రఘునందన్ రావు స్పష్టం చేశారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి జరగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై రఘునందన్ రావు సోమవారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించారు.
కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి జరిగిన ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తనపై అనవసరంగా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని.. తప్పు చేసిన వాళ్లు బీజేపీకి చెందిన కార్యకర్తలే అయితే కనుక తానే వారిని తీసుకొచ్చి పోలీసులకు అప్పగిస్తానని చెప్పారు. దాడి చేసిన వ్యక్తి తనకు దళితబంధు రాలేదనే అక్కసుతోనే ఎంపీపై దాడి చేశారని కొన్ని మీడియాలు ప్రసారం చేశారని చెప్పారు. మున్ముందు పోలీసుల విచారణలో అన్ని నిజానిజాలు తెలుస్తాయని.. దయచేసిన సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మవద్దని రఘునందన్ రావు కోరారు. దాడికి పాల్పడిన వ్యక్తి ఓ ఛానెల్ లో రిపోర్టర్ గా పని చేస్తున్నాడని కొంత మంది అంటున్నారని చెప్పారు. ఓ ఫేస్ బుక్ పేజీలో నిందితుడు కాంగ్రెస్ నేతలతో ఉన్న ఫొటోలు ఉన్నాయని చెప్పారు. నిందితుడు ఏ పార్టీకి చెందిన వ్యక్తి అనేది కూడా పోలీసులు గుర్తించాలని కోరారు.