KCR Participating in Praja Ashirvada Sabha at Jadcherla:
తెలంగాణ రాక ముందు జిల్లాల్లో పర్యటిస్తే పరిస్థితి దారుణంగా ఉండేదని, కన్నీళ్లు వచ్చేవన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ సలహాతో మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించానన్నారు. పాలమూరు దరిద్రం పోవాలంటే ఇక్కడినుంచే పోటీ చేయాలని ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారని జయశంకర్ సారు చెప్పారు. తన విజయవానికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎంతో సహకారం అందించారని గుర్తుచేసుకున్నారు. మహబూబ్ నగర్ ఎంపీగా ఉంటూనే తెలంగాణ రాష్ట్రం సాధించానని గుర్తుచేసుకున్నారు.
జడ్చర్లలో బుధవారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ పలు అంశాలపై మాట్లాడారు. ‘ఉద్యమంలో నేను పాట రాశాను. పక్కనే కృష్ణమ్మ ఉన్న ఫలితం లేకపాయే, పాలమూరు, నల్గొండ, ఖమ్మమెట్టు పంటలు ఎండిపాయే అని పాట రాశా. పాలమూరు నా గుండెల్లో ఉంటుంది. వైద్యశాఖ మంత్రిగా తొలి కేబినెట్ లో లక్ష్మారెడ్డి చేసిన పనులు. కాంగ్రెస్ దశాబ్దాలుగా పాలించినా నీళ్లు ఇవ్వలేదు. జూరాల చిన్న ప్రాజెక్టు అందులోంచి ఇక్కడికి నీళ్లు ఇస్తారంట. ఆ నీళ్లు ఇస్తే రెండు రోజుల్లో జూరాల ఎండిపోతుంది. శ్రీశైలంలో మనకు వాటా ఉంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి నీళ్లు తెచ్చాం. 1956లో చిన్న పొరపాటు జరిగింది. మనల్ని తీసుకెళ్లి ఏపీలో కలిపారు. దాంతో పాలమూరు జిల్లా కరువుతో ఖాళీ, వలసపోయింది.
ఉమ్మడి జిల్లాకు చెందిన కవి గోరటి వెంకన్న ఈ దుస్థితిపై పాటలు రాశారు. తెలంగాణ ఈజీగా రాలేదు. ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు. నేను సైతం ఆమరణ నిరాహార దీక్ష చేసి రాష్ట్రం సాధించుకున్నాం. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు మనం ప్రారంభించుకున్నామని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లకు పేరు వస్తుందని కాంగ్రెస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు జడ్చర్లలో, పాలమూరులో కరువు లేకుండా చేస్తాం. ఉద్దండాపూర్ ప్రాజెక్టు పూర్తయితే ఓవైపు కరివెన ఉంటది. నీళ్లతో జడ్చర్ల సస్యశ్యామలం అవుతది, లక్షా 50 వేల ఎకరాలకు నీళ్లు వస్తే.. కరువు మనవైపు కన్నెత్తి కూడా చూడదు. హైదరాబాద్ కు సమీప ప్రాంతం. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఇంకా దగ్గరగా ఉంటది. జడ్చర్లను పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దే బాధ్యత నాది.
పెండింగ్ ప్రాజెక్టులు కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటున్నాం. అనుమతులు వస్తున్నాయి కనుక త్వరలోనే ఉమ్మడి పాలమూరు అద్భుతంగా మారనుంది. గతంలో ఎండిపోయిన భూములు, ఇప్పుడు ఎటు చూసినా నీళ్లు పారి పచ్చని పంటలతో కనిపిస్తుంది. కుల, మతాలకు అతీతంగా రాష్ట్ర ప్రజలందరికీ సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం. మైనార్టీ, దళితులు, గిరిజనులు, బీసీల బిడ్డలకు పాఠశాలలు ఏర్పాటు చేశాం. ఇప్పుడు అగ్రవర్ణ పేదల పిల్లలకు స్కూల్స్ ఏర్పాటుచేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించాం. ముస్లింలకు సెల్యూట్ చేస్తున్న. మిలాద్ ఉన్ నబి, వినాయక చవితి ఒకేరోజు రావడంతో ముస్లిం సోదరులు తరువాత జరపడానికి ఒప్పుకోవడం గర్వకారణం. రైతుల అప్పులు మాఫీ చేశాం. ఇంకో పదేళ్లు కష్టపడితే రాష్ట్ర రైతుల దేశంలోనే గొప్ప రైతుగా మారతాడు. కర్ణాటకలో కాంగ్రెస్ 20 గంటల కరెంట్ అని హామీ ఇచ్చారు. గెలిచాక ఇప్పుడు కేవలం 5 గంటల కరెంట్ ఇస్తామని హామీ తప్పారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రైతులకు కేవలం 3 గంటల కరెంట్ చాలు అంటుండు. 24 గంటల కరెంట్ కావాలో, మూడు గంటలు చాలో తేల్చేకోవాలి. దేశంలో రైతులకు రోజు మొత్తం కరెంట్ ఇచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కార్ మాత్రమే. ప్రధాని మోదీకి కూడా ఈ పని చేయడానికి సాధ్యం కాలేదు’ అన్నారు కేసీఆర్.
ఎన్నికల్లో నెగ్గాక 2 పోలీస్ స్టేషన్లు మంజూరు చేస్తామన్నారు. ఉద్దండాపూర్ లో ప్రజల కోసం భూములు ఇచ్చిన వారికి న్యాయంగా నష్టపరిహారం అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. జడ్జర్లలో మరోసారి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఉద్యమ సమయంలో తనతో పాటు నిలిచిన నేత, రాష్ట్రం కోసం పదవికి రాజీనామా చేశారని లక్ష్మారెడ్డిని ప్రశంసించారు. ప్రజలు మరోసారి కారు గుర్తుకు ఓటువేసి తమను ఆశీర్వదించాలని సీఎం కేసీఆర్ కోరారు.