Knife Attack on Kotha Prabhakar Reddy At Election Campaign:
మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ నేత దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేశాడు. ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై దాడి అత్యంత గర్హనీయం అన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని, ఈ ఘటనను ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందని మంత్రి హరీష్ రావు అన్నారు. 


ఎంపీ ప్రభాకర్ రెడ్డి మీద హత్యాయత్నంలో రాజకీయ కుట్ర ఏదైనా ఉందా అనేకోణంలో సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని చెప్పారు. ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ కేడర్ ఎలాంటి  ఆందోళనలకు గురికావద్దని..  అధైర్య పడవద్దు ప్రభాకర్ రెడ్డిని కంటికి రెప్పలా కాపాడుకుంటాం అన్నారు. కత్తి దాడిలో గాయపడిన ప్రభాకర్ రెడ్డికి మెరుగైన చికిత్స అందించేందుకు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. కత్తి దాడిలో ప్రభాకర్ రెడ్డికి కడుపులో గాయాలయ్యాయి. 


నారాయణ్ ఖేడ్ సభకు వెళ్తుండగా.. బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి జరిగిన విషయం తెలుసుకున్నారు మంత్రి హరీష్ రావు. దాంతో వెంటనే గజ్వేల్ ఆస్పత్రికి వెళ్లారు. ముందు జాగ్రత్తగా మెరుగైన వైద్యం కోసం హరీష్ రావు సూచనతో ఎంపీని హైదరాబాద్ కు తరలించారు. కొత్త ప్రభాకర్ రెడ్డికి బలమైన గాయమైందని, మూడు ఇంచులు దిగిన కత్తి పోటు ఉన్నట్లు తెలుస్తోంది. డాక్టర్లు ప్రభాకర్ రెడ్డికి ఆపరేషన్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


నిందితుడి అరెస్ట్
కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన నిందితుడు మిరుదొడ్డి మండలం చెప్యాల గ్రామానికి చెందిన రాజుగా పోలీసులు గుర్తించారు. ఎంపీకి షేక్ హ్యాండ్ ఇస్తానని చెప్పి ఈ దాడికి పాల్పడ్డాడు. కత్తితో కడుపులో పొడిచాడు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలు కాగా ఆగ్రహం చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు నిందితున్ని చితకబాదారు. కర్రలతో కొట్టి, కాళ్లతో తన్నారు. అనంతరం అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 


ప్రస్తుతం మెదక్ లోక్ సభ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. ఈ క్రమంలో దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలోనే ఆయనపై దాడి జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఇప్పటివరకూ ఎన్నికల ప్రచారంలో నేతల్ని అడ్డుకోవడం చూశాం. గ్రామాల్లోకి రావొద్దని, తమ సమస్యలను తీర్చాలంటూ అడ్డుకోవడం తరచుగా వింటూనే ఉంటాం. కానీ తాజాగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి, హయ్యాయత్నం జరగడం రాజకీయ నాయకులను కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రత్యర్థి పార్టీలు ఈ పని చేశాయా, లేక వ్యక్తిగత కక్షతోనే బీఆర్ఎస్ నేతను కత్తితో పొడిచాడా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.


Also Read: బీఆర్ఎస్ ఎంపీపై కత్తితో దాడి - ఎన్నికల ప్రచారంలో ఊహించని పరిణామం- నిందితుడిని చితకబాదిన కార్యకర్తలు