Temperature in Telangana: తెలంగాణలో ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతలపై రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు (Srinivas Rao) హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో 40 డిగ్రీలకు పైగా ఎండలు నమోదవుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో అత్యధికంగా ఎండలు కాస్తున్న 6 జిల్లాలను వాతావరణ కేంద్రం గుర్తించిందని తెలిపారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జ‌గిత్యాల, నిజామాబాద్, మంచిర్యాల జిల్లాల‌కు వాతావ‌ర‌ణ శాఖ ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేసిందని శ్రీనివాసరావు చెప్పారు. కోఠిలో ఉన్న ప్రజారోగ్య శాఖ కార్యాలయంలో డీహెచ్ మీడియాతో మాట్లాడారు. ఎండల వేళ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.


ఈ ఆరు జిల్లాలతో పాటు భ‌ద్రాద్రి కొత్తగూడెం, ఖ‌మ్మం, హైద‌రాబాద్‌లో 40 డిగ్రీల‌కు పైగా ఉష్ణోగ్రత‌లు న‌మోదు అవుతున్నాయని డీహెచ్ తెలిపారు. 2015లో వ‌డ‌ దెబ్బ వల్ల అత్యధిక మరణాలు జరిగినట్లు ఆయన గుర్తు చేశారు. అందరూ న‌లుపు రంగు బట్టలకు దూరంగా ఉండాల‌ని సూచించారు.


మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జనాలు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని డీహెచ్ (Srinivas Rao) సూచించారు. ఒకవేళ ఎవరికైనా వడదెబ్బ (Sun Stroke Symptoms) తగిలితే వారిని వెంటనే నీడలోకి లేదా చల్లగా ఉండే ప్రదేశంలోకి తీసుకువెళ్లి గాలి అడేలా పక్కనుండే వారు చూడాలని సూచించారు. అర గంట గడిచినా లక్షణాలు కనుక తగ్గకపోతే వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లాలని డీహెచ్ సూచించారు.


ఎక్కువగా బయట తిరుగుతుండే వారు తరచూ ఎక్కువగా నీళ్లు, ద్రవ పదార్థాలు తీసుకుంటూ ఉండాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హెల్త్ సెంటర్లలో తాము ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఐవీ ఫ్లూయిడ్స్ అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు వీలైనంత వరకు బయటకు రాకుండా ఉండాలని సూచించారు. కలుషితమైన నీరు, నిల్వ చేసిన ఆహారం తీసుకోవద్దని సూచించారు.


వడదెబ్బ లక్షణాలు (Sun Stroke Symptoms) ఎలా ఉంటాయంటే..
ఎండలో తిరిగే వారికి వడ దెబ్బ (Sun Stroke) తగిలే అవకాశాలు మెండుగా ఉంటాయి. ‘‘అలాంటి వారికి చెమ‌ట రాక‌పోవ‌డం, నాలుక పోడిపారడం, పెదాలు ప‌గిలిపోవ‌డం, మరీ నీర‌సం, త‌ల‌నొప్పి, కడుపులో వికారం, గుండె వేగంగా కొట్టుకోవడం, మూత్రం రాక‌పోవ‌డం వంటి లక్షణాలు కనపడవచ్చు.’’ అని శ్రీనివాస్ రావు తెలిపారు. ఇలాంటి వారికి తక్షణం ద‌గ్గర్లోని చ‌ల్లని ప్రాంతానికి తీసుకెళ్లి.. ద్రవ పదార్థాలు అందించాలని అన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు, పాత్రికేయులు జాగ్రత్తగా ఉండాల‌ని డీహెచ్ సూచించారు.