టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య మాటల తూటాలతోపాటు సోషల్ మీడియాలో కూడా యుద్ధం ఆగడం లేదు. సమయం చిక్కినప్పుడల్లా టీఆర్ఎస్ లీడర్లు బీజేపీపైన, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు.
తాజాగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. నేరుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని టార్గెట్‌గా చేసుకొని వ్యంగ్యంగా ట్వీట్లు చేశారు.
2019 నుంచి తెలంగాణలో 38 లక్షల నల్లా కనెక్షన్లు ఇచ్చామని ప్రధానమంత్రి పేరిట వెలువడిన ప్రకటనపై కేటీఆర్ విమర్శనాత్మక పోస్టులు పెట్టారు. మోదీ గతంలో ట్వీట్ చేసిన అంశాలను ప్రస్తావిస్తూ అప్పటికీ ఇప్పటికీ ఏంటి తేడా అని నిలదీశారు.
ధరలు పెరుగుతున్నా మౌనంగా ఎందుకు ఉన్నారని మోదీని ప్రశ్నించారు కేటీఆర్. పెట్రో ధరల పెంపు వార్తాంశాన్ని ప్రస్తావిస్తూ థాంక్యూ మోదీజీ అచ్చెదిన్ అంటూ సెటైర్లు వేశారు.
మిషన్ భగీరథ పథకం కోసం కేంద్రం ఏ మేరకు సాయం అందించిందో చెప్పాలంటూ మోదీని ప్రశ్నించారు కేటీఆర్. తెలంగాణకు ఎలాంటి సాయం చేయకుండానే చేసినట్టు ప్రచారం చేసుకోవడం ఏంటని నిలదీశారు.
బీజేపీ లీడర్లు చేస్తున్న డబుల్ ఇంజిన్ సర్కారు అనే నినాదాన్ని కూడా కేటీఆర్ వదల్లేదు. ధరల్ని డబుల్ చేయడమే డబుల్ ఇంజిన్ గ్రోతా అంటూ విమర్శలు గుప్పించారు.
డబుల్ ఇంజిన్ సర్కారు అంటే ప్రజలకే అర్థం కాలేదని.. వారి దృష్టిలో పెట్రోల్‌డీజిల్ ధరలు డబుల్ చేయడం, కార్పొరేట్ సంస్థల సంపదన డబుల్ చేయడం, నిత్యవసర వస్తువుల ధరలు డబుల్ చేయడం, గ్యాస్ ధరలు డబుల్ చేయడం అని ఆరోపించారు.