తెలంగాణ డీజీపీగా ఉన్న అంజనీకుమార్‌ తెలంగాణలో కొనసాగుతారా ఏపీకి వెళ్తారా అనే ఉత్కంఠకు తెరపడ లేదు. అంజనీకుమార్‌తోపాటు మరికొందరు సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగులను ఏపీకి కేటాయించినా వెళ్లకుండా తెలంగాణలోనే ఉండిపోయారు. దీనిపై తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. 


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన టైంలో సోమేష్‌కుమారు, అంజనీకుమార్‌తోపాటు 12 మంది సివిల్ సర్వీస్ అధికారులను కేంద్రం ఏపీకి కేటాయించింది. వీళ్లంతా కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించి తెలంగాణలోనే విధులు నిర్వహిస్తున్నారు. దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ విచారణలో తుది తీర్పు ఇవాళ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది కోర్టు. 


2014లో ఆంధ్రప్రదేశ్‌ విభజన సందర్భంగా ప్రత్యూ ష్‌ సిన్హా కమిటీ నివేదిక ప్రకారం ఆలిండియా సర్వీస్‌ ఉద్యోగుల విభజన జరిగింది. ఇందులో చాలా మందిని ఏపీకి కేటాయించినా వెళ్లేందుకు నిరాకరించారు. క్యాట్‌ను ఆశ్రయించి తెలంగాణలోనే సర్వీస్ కంటిన్యూ చేశారు. అలాంటి వారిలో సోమేష్‌కుమార్, అంజనీకుమార్ తోపాటు మొత్తం 12 సివిల్ సర్వీస్ ఉద్యోగులు ఉన్నారు. 


ఈ మధ్య సోమేష్‌కుమార్‌ను కచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలని హైకోర్టు తీర్పు వెల్లడించింది. అప్పీల్‌కు వెళ్లేందుకు కూడా ఆయనకు అనుమతి ఇవ్వలేదు. తెలంగాణలో సీఎస్‌గా ఉన్న సోమేష్‌కుమార్‌ హైకోర్టు ఆదేశాలతో ఏపీకి వెళ్లాల్సి వచ్చింది. తీర్పు వచ్చిన రెండు రోజుల తర్వాత సోమేష్‌కుమార్ ఏపీకి వెళ్లి రిపోర్ట్ చేశారు. ఆయనకు ఇంకా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు.


ఇప్పుడు మిగతా సివిల్‌ సర్వీస్ ఉద్యోగులపై ఉన్న కేసులు విచారణకు వచ్చాయి. సోమేష్‌ కేసులో మాదిరిగానే వీళ్లను కూడా కచ్చితంగా ఏపీకి వెళ్లాల్సి ఉంటుందని తీర్పు అలానే వస్తుందని అనుకున్నారు. తానీ విచారణ జనవరి 27కి వాయిదా పడింది. 


ఏపీ కేడర్‌కు వెళ్లకుండా తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న సివిల్ సర్వీస్ ఉద్యోగుల్లో అంజనీకుమార్‌  ప్రస్తుతం తెలంగాణ డీజీపీగా ఉన్నారు. ఒక వేళ వీళ్లు కూడా ఏపీకి వెళ్లాలని హైకోర్టు తీర్పు ఇస్తే మాత్రం ఒకేసారి సీఎస్‌, డీజీపీ స్థాయి వ్యక్తులు వేరే రాష్ట్రానికి వెళ్లడం దేశంలోనే తొలిసారి అవుతుంది.