తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నందున ఈసీ రంగంలోకి దిగి కొంత మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. వారిలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కూడా ఉన్నారు. తాజాగా ఈ బదిలీ వేటు పడ్డ వారి స్థానంలో ఈసీ కొత్త వారిని నియమిస్తోంది. అందుకోసం పేర్లను ప్రతిపాదించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎన్నికల సంఘం ఆదేశించింది. ముఖ్యంగా హైదరాబాద్ సీపీగా ఎవరు నియమితులు అవుతారనే విషయంలో ఆసక్తి నెలకొనగా, ముగ్గురి పేర్లను సీఎస్ ఈసీకి ప్రతిపాదించినట్లు తెలిసింది. 


అయితే, సీఎస్ పంపిన ఈ ముగ్గురిలో ఒకరి పేరును ఈసీ ఎంపిక చేస్తుందా లేదా మరికొంత మంది పేర్లను అడుగుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. శుక్రవారం సాయంత్రం నాటికి హైదరాబాద్ సీపీ పేరు ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ఆ ముగ్గురు వీరే..
హైదరాబాద్ సీపీ పోస్టు కోసం అడిషనల్ డైరెక్టర్ జనరల్ క్యాడర్ ఉన్న ఆఫీసర్ల పేర్లను ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఎన్నికల కమిషన్‌కు పంపారు. వారిలో సందీప్ శాండిల్య, వీవీ శ్రీనివాస్ రావు, శికా గోయల్, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, మహేష్ భగవత్, శివధర్ రెడ్డి, వీసీ సజ్జనార్ పేర్లు ఎంపిక చేయగా.. వీరిలో ముగ్గురి పేర్లను షార్ట్‌ లిస్ట్‌ చేసినట్లు సమాచారం. సందీప్‌ శాండిల్యకు సౌత్‌ జోన్ డీసీపీ, సైబరాబాద్‌ సీపీ, రైల్వేస్‌ డీజీగా పని చేసిన అనుభవం ఉండగా.. ఆయన ప్రస్తుతం తెలంగాణ పోలీసు అకాడమీ డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు. ప్రస్తుతం ఏడీజీ ఆపరేషన్స్‌ హోదాలో ఉన్న కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సుదీర్ఘకాలంగా లూప్‌లైన్‌లోనే ఉన్నారు. మరోవైపు, ఖాళీ అయిన మరో 10 ఎస్పీ పోస్టుల కోసం 30 మంది పేర్లను కూడా సీఎస్ పంపారు. 


ఈసీ అధికారుల అసంతృప్తి
అక్టోబరు 3 నుంచి 5 వరకు ఎన్నికల కమిషన్‌ అధికారులు రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలపై సమీక్షించారు. పోలీసుశాఖతో నిర్వహించిన సమావేశంలో కొందరు అధికారుల పనితీరుపై ఈసీ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో ఎస్పీ స్థాయి అధికారులే ఎక్కువగా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలు కూడా కొందరు పోలీసు అధికారుల పనితీరును విమర్శిస్తూ వారిని మార్చాలని వినతిపత్రం సమర్పించాయి. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినందున అధికారులను మార్చే అధికారం కమిషన్‌కు ఉంటుంది. దీంతో పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌లను బదిలీ చేసింది. జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు బదిలీ జాబితాలో ఉన్నారు. 


రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్‌, మేడ్చల్‌ కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌, యాదాద్రి జిల్లా కలెక్టర్‌ కృష్ణారెడ్డి, నిర్మల్‌ కలెక్టర్‌ వరుణ్ రెడ్డిని బదిలీ చేసింది. వీరితో పాటు 13 మంది ఎస్పీలు, సీపీలను సైతం ట్రాన్స్‌ఫర్‌ చేసింది. హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌, నిజామాబాద్ సీపీ సత్యనారాయణ, వరంగల్ సీపీ రంగనాథ్‌ను సైతం బదిలీ చేసింది. సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్‌, కామారెడ్డి ఎస్పీ శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎస్పీ భాస్కర్‌, మహబూబ్‌నగర్‌ ఎస్పీ నర్సింహ, నాగర్‌ కర్నూల్‌ ఎస్పీ మనోహర్‌, జోగులాంబ గద్వాల ఎస్పీ సృజనకు స్థానచలనం కలిగింది.


నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, మహబూబాబాద్‌ ఎస్పీ చంద్రమోహన్‌, భూపాలపల్లి ఎస్పీ కరుణాకర్‌, సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ బదిలీకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇటు ఎక్సైజ్‌ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌తో పాటు రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాస్‌రాజ్‌ను సైతం ట్రాన్స్‌ఫర్ చేసింది సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిషన్‌. ఎక్సైజ్‌, వాణిజ్య పన్నుల శాఖకు ప్రత్యేక కార్యదర్శులను నియమించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. గురువారం సాయంత్రం 5గంటల కల్లా ప్యానల్‌ పంపాలని ఈసీ ఆదేశించింది.