తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పండుగల సందర్భంగా ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపింది. దసరా పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి తెలుగు రాష్ట్రాలకు శుక్రవారం నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. గురువారం ఎంజీబీఎస్ లో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశంలో ఆయన బస్సు సర్వీసులపై చర్చించారు.
అదనపు సర్వీసులు
ఈ నెల 25 వరకూ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,265 అదనపు సర్వీసులు ప్రయాణికుల కోసం నడపనున్నట్లు పేర్కొన్నారు. అదనంగా 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్లు వివరించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు.
ముందస్తు రిజర్వేషన్ కోసం
బతుకమ్మ, దసరా ప్రత్యేక సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ tsrtconline.in చూడాలని అధికారులు సూచించారు. పూర్తి సమాచారం కోసం, ఆర్టీసీ కాల్ సెంటర్ నెంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలన్నారు.
నో ఎక్స్ ట్రా ఛార్జెస్
ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని, సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక బస్సుల్లో ప్రయాణం చెయ్యొచ్చని అధికారులు ప్రకటించారు.
ఈ ప్రాంతాల నుంచి ప్రారంభం
అన్ని ప్రాంతాలకు ఎంజీబీఎస్ నుంచి బస్సు సర్వీసుల్ని నడపడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఆరాంఘర్, మెహిదీపట్నం, ఉప్పల్ క్రాస్ రోడ్డు తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక సర్వీసుల్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రయాణికులకు అసౌకర్యం లేకుండా తగిన చర్యలు చేపట్టినట్లు వివరించారు. రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీస్, జీహెచ్ఎంసీ సిబ్బంది సమన్వయంతో బస్సు సర్వీసుల్ని నడుపుతున్నట్లు పేర్కొన్నారు.
లగేజీకి ప్రత్యేక రాయితీ
పండుగలను పురస్కరించుకుని ప్రత్యేక బస్సుల్లో ప్రయాణికులు వెంట తీసుకెళ్లే లగేజీకి రాయితీ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. 50 కేజీల పైన లగేజీకి విధించే ఛార్జీల్లో 20 శాతం రాయితీ ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, అక్టోబర్ నెలాఖరు వరకూ హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు.
లక్కీ డ్రా..
రాఖీ పౌర్ణమి మాదిరిగానే దసరాకు లక్కీ డ్రా నిర్వహించి విజేతలకు బహుమతులు అందించి వారిని ఘనంగా సత్కరించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. డ్రాలో గెలుపొందిన ప్రయాణికులకు రూ.11 లక్షల నగదు బహుమతులు అందించనుంది. ప్రతి రీజియన్ కు ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలు.. మొత్తం 110 మందికి ఒక్కొక్కరికి రూ.9900 చొప్పున బహుమతులు ఇవ్వనుంది.
డ్రా కోసం ఇలా చేయండి
ఈ నెల 21 నుంచి 23 వరకు, మళ్లీ 28 నుంచి 30 తేదీల్లో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. ఆయా తేదీల్లో ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనుకాల పేరు, వారి ఫోన్ నెంబర్ ను రాసి వాటిని బస్టాండుల్లో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్సుల్లో వేయాలి. అనంతరం వాటిని డ్రా తీసి విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేస్తారు.